తెలంగాణ

శ్రీమంతుడి శీతకన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 23: అదో కుగ్రామం. రాజధానికి కూతవేటు దూరంలోనే ఉన్నా అభివృద్ధికి మాత్రం ఈ గ్రామం ఆమడదూరం. పేరు సిద్దాపూర్. పాలమూరు జిల్లాలో రోడ్డు కూడా లేని, మంచినీటికి అల్లాడే అనేక గ్రామాల్లో ఇదీ ఒకటి. ఇలాంటి గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సినీ హీరో మహేశ్‌బాబు ముందుకొచ్చారు. ఈ విషయం తెలియగానే సిద్దాపూర్ గ్రామస్థులు గంతేశారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆ శ్రీమంతుడిని కలిసి కృతజ్ఞతలు తెలపాలని సర్పంచ్ నర్సమ్మ, ఎంపిటిసి బాలయ్యలతోపాటు వార్డు సభ్యులు ఎంతో సంబరంతో గత ఏడాది అక్టోబర్ 15న రామోజిఫిలిం సిటీలో మహేశ్‌బాబును కలిశారు. సిద్దాపూర్ అభివృద్ధి బాధ్యత తనదనీ, త్వరలోనే గ్రామానికి వస్తానని మహేశ్ హామీ ఇచ్చారు. అయితే ఆరు నెలలైనా ఇప్పటివరకూ సిద్దాపూర్‌కు మహేశ్ వచ్చింది లేదు. కరవుతో అల్లాడుతున్న గ్రామస్థులు మాత్రం సిద్దాపూర్‌కు మహేశ్ వస్తాడని, ఏదో చేస్తాడని ఇప్పటికీ ఆశతోనే ఉన్నారు. సిద్దాపూర్ గ్రామస్థులు ఏ ఊరికి వెళ్లినా ‘మీకేంటయ్యా, హీరో మహేశ్‌బాబు మీ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. మీ పంట పండినట్టే’అంటూ ఉంటారని, కానీ మా గ్రామం పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ కరవులో శ్రీమంతుడు తమ గ్రామంపై వరాల జల్లు కురిపించి గుక్కెడు మంచినీటిని అందించి తమ దాహర్తిని తీరుస్తాడని కోటి ఆశలతో గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికైనా వస్తే బాగుండు
మహేశ్ బాబు సిద్దాపూర్‌ని దత్తత తీసుకుని దాదాపు ఆరేడు నెలలు గడుస్తోంది. గ్రామంలో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలూ జరగడం లేదు. మహేశ్ బాబు దత్తత తీసుకోవడంతో సిద్దాపూర్ అద్దంలా మారుతుందని ఆశపడ్డాం. ఆయన ఇప్పటికైనా వీలు చూసుకుని గ్రామానికి వస్తే బాగుంటుంది. ఆయనకు ఘన స్వాగతం పలుకుతాం.
- కమ్మరి కృష్ణయ్య, సిద్దాపూర్ గ్రామస్థుడు

ఆలయమైనా బాగు చేస్తారా?
మహేశ్‌బాబు తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని భావించా. కానీ ఇప్పటివరకూ ఆయన రాకపోవడం బాధ కలిగిస్తోంది. ఇలా గ్రామాలను దత్తత తీసుకుంటున్నవారికి అసలు దత్తతకు అర్ధం తెలుసో లేదో అనిపిస్తోంది. సిద్దాపూర్‌లో వేలసంవత్సరాల నాటి వేణుగోపాలస్వామి ఆలయం శిథిలావస్థకు చేరింది.
- నమిలిగారి బాల్‌రెడ్డి, సిద్దాపూర్ గ్రామస్థుడు