తెలంగాణ

దరిదాపులకు రారు.. దప్పికైనా తీర్చరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఏప్రిల్ 19: ఇద్దరు మంత్రులు, ఒక ఎంపి దత్తత తీసుకున్న జిల్లాలోని పలు గ్రామాల్లో వారి ‘దయ’ కరువైంది. ఆరంభంలో కాస్త హడావుడి చేసినా..ఆ తరువాత మొక్కుబడిగానే చర్యలు ఉండటంతో ఇటు ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేకపోగా, అటు కనీస వౌలిక వసతులు సైతం ప్రజల దరి చేరలేకపోయాయి. ఒకట్రెండు గ్రామాల్లో తాగునీటి సమస్యను కొంతమేర తీర్చినా...మిగతా గ్రామాల్లోని జనం దాహార్తితో అలమటిస్తోంది. మండుటెండలో గొంతు తడుపుకోవడానికి బిందెలతో వ్యవసాయ పొలాల వెంట పరుగులు తీస్తోంది. విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మారింది. దత్తతతో తమ గ్రామాల రూపురేఖలు మారుపోతాయని ఆశించిన గ్రామస్థుల ఆశ ఆవిరైపోతోంది. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్ తన నియోజకవర్గ పరిధిలోని నాలుగు గ్రామాలు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తన నియోజకవర్గ పరిధిలోని నాలుగు గ్రామాలు, కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ తన నియోజకవర్గ పరిధిలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆ దత్తత గ్రామాలపై ‘ఆంధ్రభూమి’ ప్రత్యేక కథనం...

--

ఈసురోమంటున్న వీర్నపల్లి
ఎంపి వినోద్‌కుమార్ దత్తత తీసుకున్న
ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి గ్రామం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘సంసద్ ఆదర్శ గ్రామ యోజన’ పథకంలో భాగంగా కరీంనగర్ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. 3684మంది జనాభా కలిగిన ఈ వీర్నపల్లి గ్రామం చుట్టూ ఎనిమిది గిరిజన తండాలున్నాయి. అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినా.. వాటి అమలుకు నోచుకోలేదు. తాగు నీటి ఎద్దడి నెలకొంది. తొమ్మిది గొట్టపు బావులు తవ్వించినా చుక్క నీరు పడలేదు. పధ్నాలుగు మినీ ట్యాంకులున్నా అలంకారప్రాయమే. తొమ్మిది వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకున్నా.. ప్రజల దాహార్తి తీర్చడం లేదు. రెండు రోజులకోమారు తాగునీరు సరఫరా అవుతోందని గుగులోతు కమల అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక, ఆదర్శ పాఠశాలల ప్రహారీ గోడలు లేకపోవడంతో రక్షణ లేకుండా పోతోంది. వంట గదులు లేక విద్యార్థులు ఆరు బయటే భోజనం చేయాల్సి వస్తోంది. మారుమూల గ్రామాలకు కేంద్ర బిందువైన వీర్నపల్లిలో ఆరోగ్య ఉప కేంద్రం ఉన్నా.. అది అసలు ఎప్పుడు తెరుచుకుంటుందో ఎవరికి తెలియని పరిస్థితి. ప్రత్యేక ఆరోగ్య కేంద్రం హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఈ పల్లె జనం వైద్యం కోసం సుమారు 20 కి.మీ దూరంలోని మండల కేంద్రానికి రావాల్సిన దుస్థితి నెలకొంది. గ్రంథాలయం ఏర్పాటు హామీ నెరవేరలేదు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ విఫలమైంది. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు బిల్లులు అందలేదు. మిషన్ కాకతీయ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయ. రహదారులు బాగానే ఉన్నా.. తండాల్లో డ్రైనేజీ వ్యవస్థ అసలే లేదు. వైఫై సేవలు మాత్రం గ్రామంలో అందుతున్నాయి.

--

కరుణించని ఈటల

మంత్రి ఈటల రాజేందర్ దత్తత తీసుకున్న
గ్రామాలు - జమ్మికుంట మండలం సిరిసేడు, వీణవంక మండలం వీణవంక
కమలాపూర్ మండలం కమలాపూర్, హుజురాబాద్ మండలం చెల్పూర్

మం త్రి ఈటల రాజేందర్ తన పరిధిలోని నాలుగు మండలాల్లో నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. జమ్మికుంట మండలం సిరిసేడు, వీణవంక మండలం వీణవంక, కమలాపూర్ మండలం కమలాపూర్, హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామాలను దత్తత తీసుకున్నారు. మంత్రి దత్తత గ్రామమైన సిరిసేడులో సిసి రోడ్లు మినహా గ్రామంలో కనీస సౌకర్యాల కల్పనకు ప్రజలు నోచుకోలేదు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది అభివృద్ధి పథంలో నడిస్తామని మంత్రి ప్రకటించి తొమ్మిది మాసాలవుతున్న ఆ దిశగా అడుగులు పడటం లేదని గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉండగా, మూడు రోజులకోమారు నీళ్లు వదులుతున్నారు. వీటితోపాటు మరికొన్ని సమస్యలున్నాయి. అలాగే చెల్పూర్‌లో ఎస్సీ కాలనీలు దాహార్తి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. మిషన్‌కాకతీయలో గ్రామ చెరువుకు చోటు దక్కలేదు. వీణవంక, కమలాపూర్ గ్రామాలలో సైతం కనీస సౌకర్యాలు ప్రజల దరి చేరలేదు. మొత్తానికి నేతాశ్రీలు దత్తత తీసుకోవడంతో తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆశించిన దత్తత గ్రామాల ప్రజల ఆశలు ఆశలుగానే మిగిలాయి.

--
దయ చూపని తారకరాముడు

మంత్రి కె. తారక రామారావు దత్తత తీసుకున్న గ్రామాలు..
ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట, ముస్తాబాద్ మండలం చీకోడు
సిరిసిల్ల మండలం రామన్నపల్లి, గంభీరావుపేట మండలం దేశాయిపేట

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘గ్రామజ్యోతి’ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల ఎమ్మెల్యే, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్ తన నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో నాలుగు గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో రాజన్నపేట, ముస్తాబాద్ మండలంలో చీకోడు, సిరిసిల్ల మండలంలో రామన్నపల్లి, గంభీరావుపేట మండలంలో దేశాయిపేట గ్రామాలను దత్తత తీసుకున్నారు. మంత్రి కెటిఆర్ దత్తత తీసుకున్న రాజన్నపేట గ్రామంలో 2113మంది జనాభా ఉండగా, కొత్త చెరువు సమీపంలో ఉన్న బోరు పెద్ద దిక్కుగా నిలుస్తూ వచ్చింది. ఎండలు మండిపోతుండటంతో ఒక్కసారిగా జలం అడుగంటిపోవడంతో ప్రజలకు తాగు నీటి తిప్పలు తప్పడం లేవు. ప్రస్తుతం ఐదు వ్యవసాయ బోరు బావులను అద్దెకు తీసుకున్నారు. ట్యాంకులను అనుసంధానం చేశారు. గ్రామంతోపాటు కిష్టునాయక్, కింది తండాలకు తాగు నీరు సరఫరా లేక గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీటి కాలువలు కంపుకొడుతున్నాయి. మరుగుదొడ్లు నిర్మించినా.. బిల్లులు ఇవ్వడంలో స్థానిక ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయం కుంటుపడడంతో వలసలు మొదలయ్యాయి. అలాగే దేశాయిపేట గ్రామంలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధి లైట్లు, మురికికాలువలు, రోడ్లు సరిగాలేవు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు చీకోడు, రామన్నపేట గ్రామాలలో మాత్రం కొంత ఆశాజనకంగానే ఉంది. అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మంచినీటి సమస్య తక్కువగానే ఉంది.