తెలంగాణ

ఇరాక్‌లో ‘ఉత్తర తెలంగాణ’ ఆక్రందనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఏప్రిల్ 20: స్థానికంగా పరిస్థితులు అనుకూలించక కుటుంబ పోషణ కోసం ఎడారి దేశాల బాట పడుతున్న యువకులకు పుట్టెడు దుఃఖమే మిగులుతోంది. లక్షల రూపాయల అప్పులు చేసి కాసుల వేటలో పరాయి దేశాలకు వెళ్తున్న వారికి అడుగడుగునా అవరోధాలు ఎదురవుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. నాలుగు మాసాల క్రితం ఇరాక్‌కు వెళ్లిన సుమారు వెయ్యి మంది ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన వారు అక్కడే చిక్కుబడిపోయి పడరాని పాట్లు పడుతున్నారు. స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక రోడ్లపైనే, సిమెంట్ పైపుల్లో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. తమ పోషణ కోసం వెళ్లిన వారు కష్టాల కడలిలో చిక్కుకున్నారన్న సమాచారం తెలుసుకుని బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఇరాక్‌లోని ఎల్‌బెడ్ పట్టణంలో ప్రస్తుతం వారంతా తలదాచుకుంటూ, స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు ఎంతో ఆతృతతో ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఇరాక్‌లోని ఎల్‌బెడ్‌తో పాటు పరిసర పట్టణాల్లోని కంపెనీల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని గల్ఫ్ ఏజెంట్లు నమ్మబలకడంతో నిజామాబాద్ సహా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన సుమారు వెయ్యి మంది లక్షా 20 వేలు మొదలుకుని లక్షన్నర రూపాయల వరకు వీసాలకు డబ్బులు చెల్లించి నాలుగు మాసాల క్రితం ఇరాక్‌కు పయనమయ్యారు. ఇదివరకు అమెరికా సైన్యాలు ఇరాక్‌లో క్యాంపులు కొనసాగించిన సమయంలో ఇక్కడి యువకులు ఆ దేశానికి పనికోసం వెళ్లి కొద్దోగొప్పో పైకంతో తిరిగి వచ్చారు. దీంతో ఇప్పుడు కూడా తమకు అదే తరహాలో ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశతో నిరుద్యోగులు అప్పుసప్పులు చేసి మరీ ఇరాక్‌కు వెళ్లగా, అక్కడ ఏ ఒక్క కంపెనీలోనూ పనులు లభించకపోవడంతో తాము మోసపోయినట్టు గుర్తించారు. అక్కడి భారత రాయబార కార్యాలయానికి వెళ్లి తమ గోడును వెళ్లబోసుకోగా, నకిలీ వీసాలపై వచ్చినందున తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారని, ఇరాక్‌లోని ఇండియన్ ఎంబసీ ద్వారా తమకు వీసమెత్తు కూడా సహాయ, సహకారాలు లభించడం లేదని ఇరాక్‌లో చిక్కుబడి ఉన్న నవీపేట మండల కేంద్రానికి చెందిన రాంచందర్ అనే బాధితుడు ఫోన్ ద్వారా ఆవేదన వెలిబుచ్చాడు. పోలీసుల కంటబడకుండా అరకొర పనులు చేసుకుంటూ రోడ్ల పక్కన, సిమెంట్ పైపులనే నివాసాలుగా మార్చుకుని దుర్భర జీవనాలు వెళ్లదీస్తున్నామని వాపోయాడు. నిరాశ్రయులుగా మారి పస్తులతో కాలం వెళ్లదీస్తున్నామని తమ దైన్యస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించాడు. తాము తిరిగి స్వస్థలాలకు రావాలంటే రెండు నుండి మూడు లక్షల ధరమ్‌లు చెల్లిస్తే ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తామని ఇరాక్‌లోని కంపెనీలు డబ్బులు డిమాండ్ చేస్తున్నాయని తెలిపాడు. ఇప్పటికే పనులు లభించక పస్తులతో కాలం వెళ్లదీస్తున్న బాధితులు ఇంత పెద్ద మొత్తంలో సమర్పించుకునే స్థోమత లేక గడిచిన నాలుగు మాసాల నుండి ఇరాక్‌లోనే చిక్కుబడి దుర్భర జీవితాలను వెళ్లదీస్తున్నామని వాపోయాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడి దౌత్య కార్యాలయానికి వెళ్లి తమను స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేయాలంటూ ప్రదక్షిణలు చేస్తున్నా కనికరించేవారు కరువయ్యారు. స్వస్థలాలకు చేరుకునే మార్గం కానరాక బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బాధితుల్లో అత్యధిక మంది నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు ఉండడంతో వారి కుటుంబాలు స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తమవారిని స్వస్థలాలకు రప్పించే ఏర్పాట్లు చేయాలంటూ మొరపెట్టుకుంటున్నారు.