తెలంగాణ

అందరూ రావొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: ‘తాను తలపెట్టిన అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులే. ఎలాంటి ఆంక్షలు ఉండవు. స్వీయ క్రమశిక్షణ పాటిస్తే అదే చాలు’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ‘చండీయాగాన్ని నిర్వహించాలన్న నిర్ణయం ఇప్పటిది కాదు. నాలుగేళ్ళ కిందట తెలంగాణ సిద్ధిస్తే చేస్తానని మొక్కుకున్న’ అని వివరించారు. 23 నుంచి 27 వరకు ఐదు రోజులపాటు నిర్వహించనున్న అయుత చండీయాగం ఏర్పాట్లను మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో యాగస్థలిలో శుక్రవారం మీడియాకు సిఎం స్వయంగా వివరించారు. నాలుగేళ్ల కిందట శృంగేరి పీఠం నిర్వహించిన అయుత చండీయాగం ప్రసాదాన్ని మిత్రుడు రామ్మోహన్ శర్మ తెచ్చి ఇచ్చారు. ప్రసాదం స్వీకరించాక తెలంగాణ సిద్ధిస్తే అయుత చండీయాగాన్ని తాను కూడా నిర్వహిస్తానని ఆ రోజునే సంకల్పం తీసుకున్నా అని సిఎం వివరించారు. రాష్ట్రం సిద్ధించి పరిపాలన గాడినపడ్డాక శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థస్వామి ఆశీస్సులతో యాగానికి సంకల్పించినట్టు సిఎం తెలిపారు. యాగానికి ఎవరైనా రావొచ్చని, ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే యాగాన్ని రుత్విజులు ఎంతో నిష్టతో, పవిత్రంగా నిర్వహించనుండటంతో ఇక్కడికి వచ్చేవారు కూడా స్వీయ క్రమశిక్షణ పాటించడంతోపాటు అర్హత ఉన్నవారు మాత్రమే రావాల్సిందిగా సిఎం సూచించారు. యాగ నిర్వహణను పూర్తిగా శృంగేరీ పీఠంనుంచి వచ్చే రుత్విజుల పర్యవేక్షణలో జరుగనుండగా, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవారితోపాటు రాష్ట్రానికి చెందిన సుమారు 15వందల మంది రుత్విజులు పాల్గొంటారని సిఎం తెలిపారు. యాగాన్ని తిలకించడానికి వచ్చే ప్రముఖులతోపాటు ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వేర్వేరుగా ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే భోజన వసతి, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యాగం చివరి రోజున పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హాజరుతుండగా, వేర్వేరు రోజుల్లో తమిళనాడు గవర్నర్ రోశయ్య, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ఆంధ్ర సిఎం చంద్రబాబు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంవి రమణ, జస్టిస్ చలమేశ్వర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొంస్లే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ తదితర ప్రముఖులు రానున్నారని వివరించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. యాగాన్ని తిలకించడానికి సామాన్య ప్రజలు ఎవరైనా రావొచ్చని, అందరికీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. వెయ్యినుంచి రెండు వేలమంది మహిళలు ప్రతినిత్యం కుంకుమార్చన చేయడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు.
సొంత ఖర్చుతోనే...
చండీయాగాన్ని సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నాం. ప్రభుత్వంపై నయా పైసా భారం పడనీయం అని సిఎం స్పష్టం చేశారు. యాగానికి సుమారు ఆరు కోట్ల వరకు ఖర్చవుతుందని, మొత్తం వ్యయాన్ని తాను స్వయంగా భరిస్తుండగా, కొందరు స్నేహితులు సాయం చేస్తున్నారని సిఎం వివరించారు.

చిత్రం... అయుత చండీయాగానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న సిఎం కెసిఆర్