ఆంధ్రప్రదేశ్‌

కడప టిడిపిలో భగ్గుమన్న విభేదాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, ఏప్రిల్ 10: కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. మాజీమంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు ఆదివారం సాయంత్రం దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు గ్రామంలో చోటుచేసుకుంది. రామసుబ్బారెడ్డి ఆదివారం రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడుతో కలిసి పెద్దండ్లూరు, సిరిగేపల్లెలో జరుగుతున్న జాతర ఉత్సవాలకు వెళ్లారు. అక్కడ కార్యకర్తలతో మాట్లాడి కార్యక్రమం ముగించుకుని తిరిగి జమ్మలమడుగు చేరుకున్నారు. సాయంత్రం సమయంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన వారు రామసుబ్బారెడ్డిని ఆహ్వానించిన కార్యకర్తలపై దాడికి దిగారు. ఎమ్మెల్యే అనుచరులు రామసుబ్బారెడ్డి వర్గీయులైన ఓబన్న, సంజీవరెడ్డితో పాటు మరికొందరిపై దాడులకు పాల్పడ్డారు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ సర్కార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అలాగే ఆయా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేపై పిఆర్ ఆగ్రహం
ఫ్యాక్షన్ వీడాలని నీతులు చెబుతున్న ఎమ్మెల్యే ఆది తమవర్గం వారిపై దాడులు చేయించడం దుర్మార్గమని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పిఆర్ మాట్లాడుతూ అభిమానంతో కార్యకర్తలు తమను పిలవడం తప్పా అని ప్రశ్నించారు. పార్టీ బలోపేతం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటానని చెప్పి ఇలా దాడులకు దిగడం సబబు కాదన్నారు.
చంద్రబాబుకు
కంటి పరీక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 10: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం తన కంటి వైద్య పరీక్షల నిమిత్తం తాడిగడపలోని ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థకు విచ్చేశారు. ముఖ్యమంత్రికి సంస్థ చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం ప్రతినిధి డాక్టర్ బి చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యావరణ పరిక్షణలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం ఆయన నేత్ర వైద్య పరీక్షలకు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి విచ్చేసిన ప్రత్యేక వైద్య బృందం సిఎంకు సాధారణ నేత్ర వైద్య పరీక్షలను నిర్వహించింది. అనంతరం ఎల్‌వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ వైద్యులను ఇతర సిబ్బందిని సిఎంకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇక్కడ జరుగుతున్న వైద్య విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. సిఎం రాక సందర్భంగా తాడిగడప గ్రామంలో పటిష్ఠ బందోబస్తును నిర్వహించారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఆయన వ్యక్తిగత కార్యక్రమంగా సాగింది.
మావోయిస్టు నేత
రవి అంత్యక్రియలు పూర్తి
చింతపల్లి, ఏప్రిల్ 10: మావోయిస్టు అగ్రనేత కుడుమల వెంకటరమణ అలియాస్ రవి అంత్యక్రియలు ఆదివారం విశాఖ జిల్లా చింతపల్లి మండలం కొమ్మంగిలో పూర్తయ్యాయి. అనారోగ్యంతో రవి మెరుగైన వైద్య సేవలకై విశాఖపట్నం వెళ్తూ మార్గం మధ్యలో శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం చింతపల్లి మండలం కొమ్మంగి గ్రామానికి తీసుకువచ్చిన రవి మృతదేహానికి ఆదివారం సాయంత్రం తల్లిదండ్రులు శ్రీరామ్మూర్తి, జోగమ్మ, అన్నయ్య శేఖర్, కుటుంబ సభ్యులు , స్నేహితుల , బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హాజరయ్యారు.
కాంగ్రెస్ బలపడడం కష్టమే: డిఎల్
ప్రొద్దుటూరు, ఏప్రిల్ 10 : రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత నెలకొని ఉందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లె గ్రామంలో ఆదివారం డిఎల్ విలేఖరులతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం నుంచి ఆశించిన మేలు జరగడం లేదన్న అసంతృప్తి జనంలో నెలకొని ఉందన్నారు. అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వైఖరి కారణంగా ప్రజల్లో ఆయనపై సానుకూలత లేదన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి విచిత్రమైన పరిస్థితి ఇదివరకెన్నడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని, ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ తదితర శాఖల్లో విచ్చలవిడి దోపిడీ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మంచినీరైతే దొరకడం లేదుగానీ ఎక్కడ చూసినా మద్యం మాత్రం విచ్చలవిడిగా దొరుకుతోందని ఎద్దేవా చేశారు. విభజనకు కారణమైన కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలో ఇక బలపడటం కష్టమే అన్నారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌పై వ్యతిరేకత బలంగా వుందన్నారు. అలాగే కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే వుందన్నారు. ఇంకా ఎన్నికలకు మూడేళ్ల సమయం ఉందని, సరైన సమయంలో ప్రజల అభీష్టం మేరకు మళ్లీ జనంలోకి వస్తానన్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చే మార్గం కనిపించడం లేదన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. అటు అధికారపక్షంగానీ, ఇటు ప్రతిపక్ష నేతలు గానీ సమస్యలపై స్పందించకుండా కాలం నెట్టుకొస్తున్నారని, దీనంతటినీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని ఖచ్చితంగా చెబుతుంటే టిడిపి నేతలు ఇసుక రీచ్‌ల వద్ద ఉండి డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ఇందులో పోలీసు, రెవెన్యూ శాఖల హస్తం కూడా ఉందని డిఎల్ దుయ్యబట్టారు.

వైసిపిఎల్‌పి నుంచి జగన్‌ను
తప్పించే అవకాశం!
రెండు రోజుల్లో టిడిపిలోకి భారీగా వలసలు
రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు
చాపాడు, ఏప్రిల్ 10: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైకాపా వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైకాపా లెజిస్లేచర్ నేత బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా చాపాడు మండలంలోని ద్వారకానగరం గ్రామంలో ఆదివారం రాత్రి వైకాపా నుంచి 250 కుటుంబాలు టిడిపిలో చేరాయి.
ఈ సందర్భంగా సిఎం రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైకాపా, కాంగ్రెస్‌పార్టీల నుంచి టిడిపిలోకి వలసలు పెరుగుతున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వైకాపా అధినేత జగన్‌ని వైకాపా లెజిస్లేచర్ పార్టీ నేతగా వారి ఎమ్మెల్యేలే తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఒకొక్కరుగా టిడిపి తీర్థం పుచ్చుకుంటుండటంతో ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి దగ్గరలోనే ఉందన్నారు. ఒకటి, రెండు రోజుల్లో వైకాపా నుంచి ఎమ్మెల్యేలు పెద్దఎత్తున టిడిపిలో చేరబోతున్నారని, కడపలో కూడా మరికొందరు చేరనున్నారని సిఎం రమేష్ స్పష్టం చేశారు.

టిటిడి కృషి ప్రశంసనీయం
ఎస్వీ శిల్ప కళాశాలను సందర్శించిన
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, ఏప్రిల్ 10: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ఆదివారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలను సందర్శించారు. సంప్రదాయ కళలను పరిరక్షించేందుకు టిటిడి చేస్తున్న కృషిని కొనియాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణతో కలిసి జస్టిస్ టిఎస్ ఠాకూర్ కళాశాలలోని ప్రదర్శన శాలను తిలకించడంతో పాటు శిల్పాల తయారీని పరిశీలించారు. వాటిని ఆలయాలకు ఎలా అందిస్తారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.
భక్తులకు కల్పిస్తున్న వసతులు భేష్
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు టిటిడి కల్పిస్తున్న వసతులు అద్భుతంగా ఉన్నాయని భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ ప్రశంసించారు. జస్టిస్ టిఎస్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 27 సంవత్సరాలుగా శ్రీవారి దర్శనార్థం వస్తున్నానని, ఎంతో మార్పును చూశానని అన్నారు. ఆ తరువాత శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను లెక్కగట్టే విధానాన్ని టిటిడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

188 మంది మావోల
సానుభూతిపరుల లొంగుబాటు

సీలేరు, ఏప్రిల్ 10: ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం 188 మంది మావోయిస్టు సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మల్కన్‌గిరి జిల్లా మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహపొదర పంచాయతీకి చెందిన గాలిగూడ, డొగ్రిగూడ గ్రామాలకు చెందిన 25 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు, 10 మంది గ్రామ కమిటీ సభ్యులు, 81 మంది మహిళా మావోయిస్టు సానుభూతి పరులు, మరో 72 మంది పురుష మావోయిస్టు సానుభూతిపరులు మత్తిలి పోలీస్ స్టేషన్ ఎస్సై ఎదుట ఆదివారం ఉదయం లొంగిపోయారు. ఈ రెండు గ్రామాలకు చెందిన మావోయిస్టు సానుభూతి పరులు తమ గ్రామాలకు ప్రభుత్వ అధికారులు రాకపోవడం, అభివృద్ధికి నోచుకోకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉండేందుకు ఈనిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. ఈక్రమంలోనే పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు తెలిపారు. లొంగి పోయిన వారికి ప్రభుత్వ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఒడిశా పోలీస్ అధికారులు వారికి హామీ ఇచ్చారు.

బిజెపి, టిడిపి మధ్య విభేదాలు లేవు

తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్‌తో ఏపికి ప్రమాదం
కేంద్ర మాజీ మంత్రి పురంధ్రీశ్వరి వెల్లడి

ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 10: రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి స్పష్టం చేశారు. ఆదివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెండు పార్టీలు సమన్వయంతో రాష్ట్రంలో ముందుకెళ్తున్నాయన్నారు. రాష్ట్రానికి పూర్తిస్థాయిలో కేంద్రం సహకారం అందిస్తుందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి లక్షా 40 వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం విడుదల చేసిందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కేంద్రం సక్రమంగా అమలు చేస్తున్నప్పటికి కేంద్రం ఇస్తున్న సహకారం ప్రజల్లోకి వెళ్లడం లేదన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా నూతన రాష్ట్రంలో బలపడేందుకు కృషి చేస్తుందన్నారు. తాము కూడా రాష్ట్రంలో బలపడేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో తమ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. ఈనెల 14 నుండి 24వ తేదీ వరకు గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి అనే నినాదంతో పార్టీశ్రేణులందరు ప్రజల్లోకి వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్న వనరులు, ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పది రోజులపాటు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టుల డిజైన్ వల్ల రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్వయంగా అసెంబ్లీ ఆవరణలో ప్రాజెక్టుల డిజైన్లపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారన్నారు. ఈ దశలో ప్రభుత్వం స్పందించకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి సహకారం అందించాలన్నారు. విశాఖపట్నానికి తప్పనిసరిగా రైల్వే జోన్ వస్తుందని కొన్ని సమస్యల వల్ల ఈ ప్రకటన వాయిదా పడిందన్నారు. విశాఖ రైల్వే జోన్ అంశంపై త్వరలో రైల్వేబోర్డు చైర్మన్‌తో సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు చోటుచేసుకోవటం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితులు రాకూడదన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తమ తమ్ముడు నందమూరి బాలకృష్ణ తెలుగువారి చరిత్రను ప్రతిబింబించేవిధంగా గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ప్రకటించడం శుభపరిణామన్నారు. తన తండ్రి నందమూరి తారకరామారావు ఈ చిత్రాన్ని ఏనాడో తీయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని, తండ్రి ఆశయాలను తనయుడు నెరవేర్చడం శుభపరిణామన్నారు.

పిహెచ్‌సిలకు నూతన భవనాలు

81 ఆరోగ్య కేంద్రాలకు రూ.101 కోట్లు
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని

ఆంధ్రభూమి బ్యూరో
కాకినాడ, ఏప్రిల్ 10: రాష్ట్రంలో 81 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు (పిహెచ్‌సి) రూ.101 కోట్ల వ్యయంతో నూతన భవనాలు నిర్మించనున్నట్టు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కరపలో నూతనంగా నిర్మించిన ఎఎన్‌ఎం శిక్షణ కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన పిహెచ్‌సిల స్థానే నూతన భవనాల నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో 1900 వైద్యుల పోస్టులు భర్తీచేశామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడా మందుల కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో రూ.500 కోట్ల విలువైన 56 వేల వైద్య పరికరాల నిర్వహణ బాధ్యతలు ప్రత్యేక ఏజన్సీకి అప్పగించామని, వాటి నిర్వహణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలను ఉచితంగా అందజేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎక్స్‌రే, సిటి స్కాన్ వంటి పరీక్షలను పిహెచ్‌సిల్లో ఉచితంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2015-16 సంవత్సరాల్లో దేశంలో మాతాశిశు మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కేంద్ర ఆరోగ్య మిషన్ అవార్డును స్వీకరించిందన్నారు. గతంలో మాతాశిశు మరణాల విషయంలో దక్షిణ భారత దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అధికంగా ఉండేదని, గతేడాది ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. రాష్ట్రంలో 10 ప్రభుత్వాసుపత్రుల్లో తల్లీబిడ్డల బ్లాకులను (మెటర్నిటీ బ్లాకులు) నిర్మిస్తుండగా ఇప్పటికే రాజమండ్రి, ఏలూరు, నంద్యాల, చిత్తూరులో వీటిని ప్రారంభించామన్నారు. ప్రతి మెటర్నిటీ బ్లాకులో ఆరు లేబర్ రూమ్‌లు ఉంటాయన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడానికి ఆసుపత్రుల్లో ప్రసవించే వారికి రూ.1000 వంతున నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టుల ఆరోగ్య కార్డులపై పూర్తిస్థాయిలో వైద్య సేవలందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మున్సిపల్ పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సులు

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మున్సిపల్ పాఠశాలలు
అవగాహన సదస్సులో మంత్రులు నారాయణ, గంటా

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 10: ఎంత ఖర్చయినా వెరువకుండా ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా మున్సిపల్ పాఠశాలల నుండే ర్యాంకర్లను తయారు చేయాలనేది తమ లక్ష్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ర్యాంకులను సాధించడానికి ఫౌండేషన్ కోర్సులు తప్పనిసరని అన్నారు. ఫౌండేషన్ కోర్సు ప్రాధాన్యతపై ఆదివారం నాడిక్కడ ఒక హోటల్‌లో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఫౌండేషన్ కోర్సు లక్షలాది రూపాయల ఖర్చుతో కూడిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ఉచితంగా ఈ కోర్సు ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి నారాయణ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూళ్ల కంటే మిన్నగా మున్సిపల్ స్కూళ్లను తయారు చేస్తామన్నారు. ఫౌండేషన్ కోర్సు ప్రాధాన్యత తెలియచేయాలనే ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. విద్యారంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న తనకు ఈ బాధ్యతను సిఎం అప్పగించారన్నారు.
విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలను సాధించలేకపోతున్నామన్నారు. ఇక ఉపాధ్యాయులకు ప్రతిభ ఆధారంగా బదిలీలు నిర్వహించి వారి కెరియర్‌లో వెయిటేజి ఇవ్వనున్నామన్నారు. దేశంలోనే సంచలనం సృష్టించబోయే ఈ కోర్సును పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మంత్రి నారాయణ అభినందనీయుడన్నారు.
పలువురు విద్యార్థులు స్పందిస్తూ ఈ కోర్సు చాలా బాగుందని, సబ్జక్టులలో పట్టు సాధించటానికి ఎంతో దోహద పడుతుందన్నారు. కేవలం రెండు గంటలు మాత్రమే కాకుండా మరో రెండు గంటలు పొడిగించాలని, ఈ కోర్సును ఐదో తరగతి నుంచే ప్రారంభించాలని కోరారు. ఈ సమావేశంలో నగర మేయర్ కోనేరు శ్రీధర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

ననె్నవరూ
కొనలేరు!

చంద్రబాబే ఉద్యమ స్ఫూర్తి
నా రాజకీయ అనుభవమంత లేదు జగన్ వయస్సు
ఆయన నన్ను ఉద్యమించమని చెప్పలేదు
అరెస్టులకు భయపడేది లేదు
ముద్రగడ పద్మనాభం స్పష్టీకరణ

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 10: తనను ఎవ్వరూ కొనలేరని, తానెవ్వడికీ అమ్ముడుపోనని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తుని ఉద్యమంలో పాల్గొన్న కాపు నాయకులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఆయన ఆదివారం విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కాపుల ఓట్లు కూడగట్టేందుకు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, సంవత్సరంన్నర అయినా అవి నెరవేరకపోవడం వలన రోడ్డెక్కాల్సి వచ్చిందని అన్నారు. కాపు సమస్యల పరిష్కారానికి గత ఏడాది జూలై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వరుసగా లేఖలు రాస్తూ వస్తున్నానని ముద్రగడ అన్నారు. ఎట్టకేలకు చంద్రబాబు స్పందించారని అన్నారు. కాపులకు న్యాయం చేసే దిశగా ఆయన అడుగులు ముందుకు వేస్తున్నారని ముద్రగడ చెప్పారు. రాష్ట్రంలో ఏ కులాల కోటాలను తగ్గించకుండా, కాపులకు న్యాయం చేయాలని కోరుతునన్నానని, మిగిలిన కులస్తులు ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. కాపుల్లో నిరుపేదలు చదువుకోడానికి కూడా స్థోమత లేక వీధుల్లో తిరుగుతున్నారని ఆయన అన్నారు. వీరందరి కోసమే తాను ఉద్యమించాల్సి వచ్చిందని అన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రబాబే తన ఉద్యమానికి స్ఫూర్తి అని ముద్రగడ చెప్పారు. ఆయన హామీలు ఇవ్వకపోతే, ఈ ఉద్యమం జరిగేది కాదని అన్నారు. తన ఉద్యమం వెనుక జగన్ ఉన్నారన్న ప్రచారంలో విస్తవం లేదని ముద్రగడ పునరుద్ఘాటించారు. ‘నా రాజకీయ అనుభవం అంత లేదు జగన్ వయస్సు. ఆయనా నన్ను ఉద్యమం చేయాలని శాశించేది?’ అని ముద్రగడ అన్నారు. తన ఉద్యమానికి అన్ని పార్టీల నుంచి మద్దతు లభించిందని చెప్పారు. కేవలం ఇది ఒక సామాజికవర్గానికి సంబంధించిందన్నారు. తుని ఘటనలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోమని కోరుతున్నాను. అయితే ఉద్యమంలో పాల్గొన్నవారెవ్వరూ విధ్వంసానికి పాల్పడలేదని, కేవలం కొన్ని సంఘ విద్రోహ శక్తులే ఇందుకు కారణమన్నారు. ఈ కేసును లోతుగా పరిశీలించి బాధ్యులపై చర్య తీసుకోవాలని తాను ముఖ్యమంత్రిని కోరానని ముద్రగడ చెప్పారు. కాపు ఉద్యమకారులెవ్వరూ అరెస్ట్‌లకు భయపడడం లేదని, ముందస్తు బెయిళ్లు తీసుకోబోమని స్పష్టం చేశారు.
పూర్తి ఫలాలు అందాల్సిందే!
కాపుల సంక్షేమం దృష్ట్యా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు కొంత సంతృప్తికరంగానే ఉన్నాయని, అవి పూర్తిగా అందితేనే కాపులంతా పూర్తిగా సంతృప్తి చెందుతారని ముద్రగడ అన్నారు. కాపు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ముందుకు సాగబోవని కొన్ని సామాజికవర్గాల వారు చేసిన వ్యాఖ్యలపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ముద్రగడ సమాధానం చెపుతూ కాపులు మళ్లీ రోడ్డెక్కే అవకాశం ఉండదని భావిస్తున్నానని అన్నారు.

విలేఖరులతో మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభం

పుష్కర తొక్కిసలాట

దోషులెవరు?!

అంత్య పుష్కరాలొస్తున్నా
అంతుచిక్కని రహస్యం

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 10: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోదావరి పుష్కరాల తొలి రోజు రాజమహేంద్రవరంలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యులెవరన్నది అధికారికంగా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. మరో మూడు నెలల్లో గోదావరికి అంత్య పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. అలాగే కృష్ణా నదికి కూడా త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి పుష్కరాల తొక్కిసలాట దుర్ఘటనకు బాధ్యులెవరన్నది తేల్చకపోవడం విమర్శలకు తావిస్తోంది. గోదావరి పుష్కరాల్లో జరిగిన పొరపాట్లను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటేనే కృష్ణా పుష్కరాలను ఎలాంటి దుస్సంఘటనలు లేకుండా నిర్వహించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం పుష్కరాల రేవులో జరిగిన తొక్కిసలాటకు కారణాలు, బాధ్యులెవరన్నది తేల్చలేకపోతోంది. ఈ దుర్ఘటనలో సుమారు 29మంది యాత్రికులు మరణించారు. ఈ సంఘటనపై రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తొక్కిసలాట ఘటనపై తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత ప్రస్తుత డిసిఆర్‌బి డిఎస్పీ అంబికాప్రసాద్, అనంతరం అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్య ఈ కేసును దర్యాప్తుచేశారు. 150 మందికిపైగా ప్రత్యక్ష సాక్షులు, మృతుల కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదుచేశారు. విపక్షాల విమర్శలతో స్పందించిన ప్రభుత్వం జస్టిస్ సోమయాజులు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ గడువు గత నెల 29వ తేదీతో ముగిసింది. కమిషన్ గడువు ముగిసినా ప్రభుత్వం తరుపున అఫిడవిట్ దాఖలు చేయలేదు. గడువులోగా అన్ని శాఖల నివేదికలను క్రోడీకరించి అఫిడవిట్ దాఖలు చేస్తామని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ చెప్పినా ఆచరణలో మాత్రం విఫలమయ్యారు. వాస్తవానికి గత నెల 19నే ప్రభుత్వం తరుపున అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన ప్రభుత్వం సోమయాజులు కమిషన్ ఏర్పాటుకు జిఓ జారీ చేసింది. ఈఏడాది జనవరి 1న, ఫిబ్రవరి 23న, మార్చి 21న కమిషన్ రాజమహేంద్రవరంలో విచారణ నిర్వహించింది. తొలి విచారణకు హాజరైన న్యాయ వాది ముప్పాళ్ల సుబ్బారావు మాత్రమే అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. 2వ సారి విచారణ నాటికి మాజీ ఎంపి ఉండవల్లితో పాటు, వామపక్షాలు, వివిధ వ్యక్తులు 26 మంది కమిషన్ ముందు హాజరై అఫిడవిట్లు దాఖలుచేశారు. సోమయాజులు కమిషన్ ఎదుట ప్రత్యక్షసాక్షులు, క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులను హాజరుపరచడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ప్రభుత్వం తరుపున అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో తొక్కిసలాట కేసు అగమ్యగోచరంగా మారింది. పోలీసుల దర్యాప్తులోనూ, న్యాయ విచారణలోనూ తొక్కిసలాటకు కారణాలు, బాధ్యులెవరన్నది తేల్చకపోవడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం.