తెలంగాణ

గోదావరి జలాలతో నీటి సమస్యకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయికల్, ఏప్రిల్ 6: లక్ష కోట్ల వ్యయంతో గోదావరి జలాలు వాడుకలోకి తెచ్చి రాష్ట్రంలో తాగు, సాగునీటి సమస్యలు తీర్చు కోవడంతోపాటు తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని బోర్నపల్లి సమీపంలో గోదావరి నదిపై రూ. 70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంతెనకు ఆయన తోపాటు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాకముందు నీళ్లు, ఇల్లు కావాలన్నా, కరెంట్ కావాలన్నా అడుక్కోవాల్సి వచ్చేదని, ఇప్పుడు అడుక్కునే విధానానికి సిఎం కెసిఆర్ స్వస్తి చెప్పారని, అడగకుండానే అన్నీ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలోని 46 వేల చెరువులను అభివృద్ధి చేయడమే మిషన్ కాకతీయ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డల కన్నీళ్లు తుడవడమే టిఆర్‌ఎస్ ఎజెండా అన్నారు. గోదావరి పక్కనే ఉన్నా తాగునీటికి సాగునీటికి ఇంకా సతమతం అవుతున్నామని, రాబోయే రెండేళ్లలో గోదావరి జలాలు వాడుకలోకి తెచ్చుకోవడంతోపాటు జిల్లాలోని కాళేశ్వరం నుండి ఎస్సారెస్పీ వరకు అవసరమైన ప్రతిచోట చెక్‌డ్యాంలు నిర్మిస్తామన్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, ఈనెల 1వ తేదీ నుండే వ్యవసాయానికి 9గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నామని, ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. ఎంపి కవిత మాట్లాడుతూ మాట తప్పం.. మడిమ తిప్పం.. అందుకోసమే ఎన్నికలకు ముందే మాట ఇచ్చామని సిఎం కెసిఆర్ రూ. 70 కోట్లు మంజూరు చేశారన్నారు. బోర్నపల్లి జగన్నాథ్ పూర్ గ్రామాల మధ్య ఉపనదిపై వంతెన కోసం తనవంతుగా రూ. 10లక్షలు మంజూరు చేస్తానని, ఇదే వేదికపై ఉన్న ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు రూ. 5లక్షలు మంజూరు చేసే వరకు మీరే పట్టుపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మున్సిపల్ చైర్మన్ శీలం వేణు, సబ్ కలెక్టర్ శశాంక, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఆంధ్ర - తెలంగాణ సరిహద్దుల్లో
నాటుసారాపై సంయుక్త పోరు

రంగంలోకి దిగిన ఇరు రాష్ట్రాల ఆబ్కారీ శాఖాధికారులు తొలిరోజు 6500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

భద్రాచలం, ఏప్రిల్ 6: తెలంగాణలో సారా రహిత జిల్లా, ఆంధ్రాలో నవోదయం వంటి వినూత్న కార్యక్రమాలకు ఉభయ రాష్ట్రాల అధికారులు శ్రీకారం చుట్టారు. నాటుసారా నుండి ప్రజలను దూరం చేయడమే ఈ కార్యక్రమాల్లో ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. రాష్ట్ర విభజనతో ముంపు మండలాలకు తూర్పుగోదావరి జిల్లా అధికారులు దూరంగా ఉండటంతో అక్రమార్కులు కుటీర పరిశ్రమగా చేసుకుని సారా తయారీ, విక్రయాలు, నల్లబెల్లం స్థావరాలు ఏర్పాటు చేసుకుని స్వైర విహారం చేస్తున్నారు. చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాక మండలాల్లో విచ్చలవిడిగా నాటుసారా తయారీ జరుగుతుండటంతో ఇటీవలే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఆబ్కారీశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్ఫోర్స్ అధికారులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సరిహద్దులు చెరిపేసి సంయుక్తంగా ఇరు రాష్ట్రాల ఆబ్కారీ శాఖ అధికారులు నాటుసారాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీకాంత్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈఎస్ కె.వెంకట్రామిరెడ్డి, టాస్క్ఫోర్స్ సీఐ నిక్సన్, రంపచోడవరం సీఐ రవీంద్రబాబు నేతృత్వంలో 21 మంది ఆంధ్రా అధికారులు, తెలంగాణ నుంచి కొత్తగూడెం ఏఈఎస్ ఎస్.మధు, భద్రాచలం సీఐ రాజశేఖర్‌బాబు, చెక్‌పోస్టు సీఐ సర్వేశ్వరరావు, టాస్క్ఫోర్స్ ఎస్సై నాగేశ్వరరావు, ఏసురత్నం తదితర 35 మంది సిబ్బంది సంయుక్త దాడులకు దిగారు. ఆంధ్రాలోని తెలంగాణకు సరిహద్దున ఉన్న అత్యంత సమస్యాత్మకంగా, నాటుసారా తయారీ జరిగే గ్రామాలైన ఎటపాక మండలంలోని పిచ్చుకులపాడులో 2వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి 450 కిలోల నల్లబెల్లం, 30లీటర్ల సారాయిని పట్టుకున్నారు. గుండువారిగూడెంలో 3వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి,10 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు. గోళ్లగట్టలో 1500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి 10 లీటర్ల సారాయిని పట్టుకున్నారు. ముంపు మండలాల్లో ఎటపాక ఒక్కటే కాకుండా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోనూ గతంలో సారాయి తయారీ చేసే గ్రామాలు, పాత ముద్దాయిలు, నల్లబెల్లం వ్యాపారులు వివరాలు సేకరించారు. ఇకపై వారంలో ఒకసారి ఈ గ్రామాలపై దాడులు చేయాలని నిర్ణయించారు. ఈ గ్రామాల్లోనే సారా తయారీ, విక్రయదారులు, గతంలో కేసులు నమోదై, జైలుకు వెళ్లి వచ్చిన ముద్దాయిలు ఉన్నట్లుగా గుర్తించారు. ఏప్రిల్ 15న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజున ఖమ్మం జిల్లాను సంపూర్ణ సారా రహిత జిల్లాగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఆబ్కారీశాఖ అధికారులు వెల్లడించారు.

గోదావరి జలాలతో
తెలంగాణ సస్యశ్యామలం
నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట రూరల్, ఏప్రిల్ 6: గోదావరి జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట మండలం తొర్నాల గ్రామంలో మిషన్ కాకతీయ 2వ విడత చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మిషన్ కాకతీయ మొదటి విడతలో 161 చెరువులకు గాను 32కోట్ల రూపాయలను వెచ్చించామని, రెండవ విడతలో 175 చెరువులకు గాను 30.28కోట్ల రూపాయలను కేటాయించామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, ఏ ఒక్క ఎకరానికి సాగునీరు అందించలేదన్నారు.
చెరువు కన్న తల్లిలాంటిందని, చెరువు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు. చెరువులకు పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రంగనాయకసాగర్ ద్వారా ఎంతటి కరువొచ్చిన చెరువులు, కుంటలకు కాలువల ద్వారా గోదావరి నీళ్లందిస్తామన్నారు. రైతులకు పగటిపూట 9గంటల కరెంటుతో పాటు చెరువులకు నీళ్లొస్తే రైతన్నలు రెండు పంటలను సాగు చేయవచ్చునన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి పేద కుటుంబానికి కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, ఎంపిపి యాదయ్య, నాయకులు మారెడ్డి రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, బాల్‌రంగం, యాదగిరి, సర్పంచు పరమేశ్వర్‌గౌడ్, ఎంపిటిసి ఏదుల్ల నర్సింలు తదితరులు పాల్గోన్నారు.

సిద్దిపేట మండలం తొర్నాల గ్రామంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు