తెలంగాణ

ఐదేళ్లలో అన్నీ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: నీటిపారుదల ప్రాజెక్టుల్లో పాత వాటిని (పెండింగ్) రెండేళ్ళలో, కొత్త వాటిని ఐదేళ్లలో ఎట్టి పరిస్థితులలో పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రాణాలు పోయినా అవినీతికి తావులేకుండా పారదర్శకంగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటిని మూడు సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు పూర్తి చేస్తామని, అయితే కాలువలు, డిస్ట్రిబ్యూటరీ వంటి చిన్న చిన్న పనులు పూర్తి కావటానికి రెండు సంవత్సరాల వ్యవధి పడుతుందనే ఐదేళ్లు గడువు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి వివరించారు. శాసనసభలో నీటిపారుదల ప్రాజెక్టులపై చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై విపక్షాలు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేస్తూ ముఖ్యమంత్రి ప్రసంగించారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను 2017 సంవత్సరం చివరికల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి వెయ్యి కోట్లు సరిపోతాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి వాటిని పూర్తి చేయాలంటే రూ. 2400 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బిసి) ఒక్కటి పూర్తి కావడానికి 2018-19 వరకు గడువు తీసుకుంటుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఐదు సంవత్సరాలు పడుతుందని చెబుతున్నప్పటికీ 2018 నాటికల్లా దాని ప్రధాన పనులన్ని పూర్తి అవుతాయన్నారు. అయితే ఇతర చిన్న చిన్న పనులు పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందనే ఐదేళ్ల గడువు పెడుతున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
మేడిగడ్డ, దేవాదుల ప్రాజెక్టులతో పాటు ఇతర బ్యారేజీల నిర్మాణం వల్ల సాగునీరు మాత్రమే కాకుండా వీటి ద్వారా జల విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టుల నిర్మాణంలో అమలు చేసిన ఇపిసి, మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల విధానానికి స్వస్తి పలికి సిడిఆర్ (కార్పొరేట్ డెట్ రిటర్నర్స్) విధానాన్ని ప్రవేశపెట్టినట్టు కెసిఆర్ వివరించారు. దీనివల్ల స్థోమత కలిగిన కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు అప్పగించడానికి అవకాశం ఉంటుందన్నారు. గతంలో కొంత మంది కాంట్రాక్టర్లకు నిర్మాణ నైపుణ్యం, ఆర్థిక స్థోమత లేనప్పటికీ పనులు అప్పగించడం వల్లనే పనులు ముందుకు సాగలేదన్నారు. అలాంటి కాంట్రాక్టర్లు కొందరిని తొలిగించినప్పటికీ, మరికొందరు కోర్టులకు వెళ్లే అవకాశం ఉందని, దీంతో ప్రాజెక్టులు పూర్తి కావడంలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా పాత కాంట్రాక్టర్లను పిలిచి గతంలో ఇచ్చిన వ్యయానికి సరిపడ పనులు అప్పగిస్తామని హామీ ఇచ్చి వారిని ఒప్పించినట్టు ముఖ్యమంత్రి వివరించారు. అయితే కొత్త ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఎట్టి పరిస్థితులలో కొత్తవారికే అప్పగిస్తామన్నారు.
ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఇక నుంచి వేగవంతం చేయనున్నామని, త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానిస్తామని, పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కావచ్చిందన్నారు.
ఒక నది పరీవాహకం నుంచి మరో నది పరీవాహకానికి నీటిని తీసుకెళ్లడం కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బిజెపి సభ్యుడు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ అంతకుముందు గోదావరి జలాలను రంగారెడ్డి జిల్లాకు తరలించాలని చేసిన సూచనను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ, నది పరీవాహకంలో ఉన్న ప్రాంతాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత ఇతర ప్రాంతాల గురించి ఆలోచిస్తామని ముఖ్యమంత్రి వివరించారు.