ఆంధ్రప్రదేశ్‌

పుష్కరఘాట్ తొక్కిసలాటపై నేడు న్యాయ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాలు ప్రారంభోత్సవం రోజు గత ఏడాది జూలై 14న రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటపై సోమవారం విచారణ జరగనుంది. ఈ సంఘటనకు దారితీసిన కారణాలు, ఏర్పాట్లలో ఏమైనా లోపాలు ఉన్నాయా? బాధ్యులెవరు తదితర అంశాలపై విచారణ నిర్వహించడానికి రాష్ట్రప్రభుత్వం జస్టిస్ సోమయాజులు కమిషన్‌ను నియమించిన సంగతి విదితమే. ఇప్పటికే రెండు సార్లు విచారణ నిర్వహించిన కమిషన్ మూడోసారి సోమవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో విచారణ చేపట్టనుంది. విచారణ ప్రారంభించే నాటికి రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు ఒక్కరే అఫిడవిట్ దాఖలుచేయటం, కమిషన్‌కు అఫిడవిట్లు సమర్పించేందుకు మరికొంత గడువు ఇవ్వటం తదితర పరిణామాలు విదితమే. తొక్కిసలాట సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని కమిషన్‌కు అందించాలనుకునే వారు అఫిడవిట్లు దాఖలుచేయాలని జస్టిస్ సోమయాజులు కమిషన్ ఆదేశాలు జారీచేస్తూ, అఫిడవిట్లు మార్చి 5లోగా సమర్పించాలని గడువు నిర్ణయించారు. దాంతో కమిషన్ ముందు సాక్ష్యం చెప్పాలనుకునే వారు సుమారు 30మందికి పైగా అఫిడవిట్లు దాఖలుచేసినట్టు తెలుస్తోంది. అఫిడవిట్లు దాఖలుచేసిన వారిలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ కూడా ఉన్నారు. ఈ అఫిడవిట్లకు రాష్ట్రప్రభుత్వం తరపు వాదనను ఈనెల 19లోపు దాఖలుచేయాలని గత విచారణలోనే జస్టిస్ సోమయాజులు అధికారులను ఆదేశించారు.
విచారణ ప్రారంభమైన రోజున కేవలం ఒకే ఒక్కరు మాత్రమే అడపిట్‌ను దాఖలుచేస్తే, ఇప్పుడా సంఖ్య 30కి పైగా దాటిపోవటంతో పుష్కరఘాట్ తొక్కిసలాట సంఘటనపై జరుగుతున్న న్యాయవిచారణ పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సోమవారం జరగనున్న మూడవ విడత విచారణలో రాష్ట్రప్రభుత్వం తన వాదనను వినిపిస్తుందా లేక మరికొంత గడువు కోరుతుందా అనే అంశంపై అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్కరఘాట్ తొక్కిసలాటకు సంబంధించిన అధికార పత్రాలను, వీడియో క్లిప్పింగులు తదితర సమాచారాన్ని కమిషన్ ముందుంచాలని ఇంతకు ముందే జస్టిస్ సోమయాజులు కమిషన్ ముందు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు దాఖలుచేసిన పిటిషన్‌పై కూడా సోమవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ముప్పాళ్ల సుబ్బారావు కేవలం సాక్షే కాబట్టి, అధికార పత్రాలు, వీడియో క్లిప్పింగులు వంటి వాటిని కోరేందుకు అర్హత లేదని ఇంతకు ముందే ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తంచేశారు. అదే వాదనను మరోసారి ప్రభుత్వం తరపు న్యాయవాది వినిపించే అవకాశాలు ఉన్నాయి. రానున్న మూడు నెలల కాలంలో విచారణ వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట దృశ్యం (ఫైల్‌ఫొటో)

యుద్ధప్రాతిపదికన
బ్యారేజి మరమ్మతులు

ప్రకాశం బ్యారేజిపై శాశ్వత విద్యుత్ దీపాలంకరణ పనులను పరిశీలించిన మంత్రి దేవినేని ఉమ

విజయవాడ, మార్చి 20: దాదాపు రూ.240 కోట్లతో చేపట్టబడిన ప్రకాశం బ్యారేజి మరమ్మతులు, కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు శరవేగంతో కొనసాగుతున్నాయి. రాబోయే పుష్కరాలను దృష్టిలో వుంచుకుని బ్యారేజి మరమ్మతులను త్వరితగతంగా పూర్తిచేస్తున్నారు. ఇప్పటివరకు రూ.130 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఈ నేపధ్యంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం చీఫ్ ఇంజనీర్ వైఎస్ సుధాకర్‌తో కలిసి బ్యారేజి ఆఫ్రాన్ మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ ఆఫ్రాన్ పనులను మే నెలాఖరుకు పూర్తిచేస్తామని మంత్రి ఉమా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరంలో వచ్చిన 11 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కారణంగా ఫ్లెక్సిబుల్ ఆఫ్రాన్ దెబ్బతిన్నదని మంత్రి చెప్పారు. 6 టన్నుల బరువైన కాంక్రీట్ బ్లాకులు కొన్నిచోట్ల వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయని మంత్రి తెలిపారు. కాంక్రీట్ బ్లాకుల మధ్య ఉండే మూడు అంగుళాల ‘మెటల్’ పూర్తిగా దెబ్బతిందన్నారు. ఈ మరమ్మతులు చేపట్టడం ద్వారా ప్రకాశం బ్యారేజి సుస్థిరంగా వుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఈ పనులను మే నెలాఖరు నాటికి అవసరమైన మేర యంత్రాలు, కూలీలను వినియోగించాలని, నాణ్యత విషయమై రాజీపడితే సహించేది లేదని మంత్రి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. బ్యారేజికి వున్న 70 గేట్లను పూర్తిస్థాయిలో రిపేర్లు పూర్తిచెయ్యాలన్నారు. ప్రస్తుతం ఉన్న లీకేజీలు సరిచెయ్యాలని, తుప్పుపట్టిన చోట సరైన మరమ్మతులు చేపట్టి గేట్లకు రంగులు వెయ్యాలని సూచించారు. రాబోయే పుష్కరాలను దృష్టిలో వుంచుకుని ఆప్రోస్‌కు దారితీసే వంతెనకు రెయిలింగ్స్ పటిష్టంగా ఏర్పాటు చెయ్యాలన్నారు. ఈ పనులన్నింటిని తక్షణమే చేపట్టి పుష్కరాల్లోపు పూర్తిచెయ్యాలని ఆదేశించారు. పుష్కరాలను దృష్టిలో వుంచుకుని ప్రకాశం బ్యారేజి అందాన్ని ఇనుమడింపచేసే విధంగా విద్యుత్ లైట్లతో అలంకరించనున్నామన్నారు. ఈ విద్యుత్ దీపాలంకరణ శాశ్వత పద్ధతిలో చేపడుతున్నామన్నారు. భవానీద్వీపం వద్ద పూర్తిస్థాయి వినోదభరితమైన టూరిస్టులను ఆకర్షించే వివిధ జల క్రీడలను (వాటర్ స్పోర్ట్స్) ప్రవేశపెట్టనున్నామన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల వివరాలు, వాటిని నిర్మించిన సర్ ఆర్ధర్‌కాటన్, కెప్టెన్ ఓర్, కెఎల్ రావ్‌ల వంటి ప్రసిద్ధ ఇంజనీర్ల వివరాలను తెలిపే విధంగా పెద్ద ప్రదర్శనశాలను నిర్మించనున్నామన్నారు. కృష్ణా బ్యారేజికి శ్రీశైలం నుంచి 2టిఎంసిల నీటిని విడుదల చెయ్యడం జరిగిందని మంత్రి చెప్పారు. ఇందువల్ల ప్రకాశం బ్యారేజి వద్ద నీటి మట్టం పది అడుగులకు చేరుకుందన్నారు. ఈ నీటిని విజయవాడ, గుంటూరు నగరాల తాగునీటి అవసరాలతో పాటు పెడన, బందరు, కైకలూరు మండలాల్లోని తాగునీటి చెరువులకు మళ్లించాల్సి వుంటుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇతర చెరువులకు కూడా అవసరాన్ని బట్టి తాగునీరు విడుదల చెయ్యాల్సి వుంటుందన్నారు. వేసవికాలం ప్రారంభంలోనే తాగునీటి కొరత ఏర్పడే పరిస్థితులు ఉన్న దృష్ట్యా నీటిని పొదుపుగా వినియోగించడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలన్నారు. 666 టిఎంసీల నీరు కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాల వల్ల రావాల్సి వుండగా కేవలం 66 టిఎంసీలు మాత్రమే నీరు లభ్యమైందన్నారు. ఇందువల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరత వుందన్నారు. ఈ నీటినే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవల్సి వస్తుందన్నారు. ఈ పర్యటనలో క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ రమేష్, సబ్ కలెక్టర్ జి.సృజన, తదితరులు పాల్గొన్నారు.