తెలంగాణ

వానల్లేక పరేషాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: తెలంగాణలో వారం రోజుల నుండి వానలు లేకపోవడంతో చెల్క, ఇసుకభూముల్లో పంటలు ఎండిపోతున్నాయి. జొన్న, మొక్కజొన్న తదితర పంటలకు వారం రోజుల నుండి నీళ్లు లేకపోతే పంట వాడిపోతోంది. ఈ పరిస్థితి ప్రధానంగా మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు నల్లగొండ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నెలకొని ఉంది. వానలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నల్లరేగడి భూముల్లో కొద్దిగ తేమ ఉండటంతో మరో వారం రోజుల వరకు వర్షాలు లేకపోయినా పంటలు నిలదొక్కుకోవచ్చేమో కానీ, మిగతా భూముల్లో మాత్రం పంట నాశనమయ్యే పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటిదాకా 491మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా, 476 మిల్లీమీటర్లు నమోదైంది. అంటే సాధారణ వర్షపాతం కంటే 3శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. అధికారిక లెక్కల ప్రకారం మెదక్‌లో మైనస్ 21 శాతం వర్షపాతం నమోదుకాగా, మహబూబ్‌నగర్‌లో మైనస్ 6 శాతం, నల్లగొండలో మైనస్ 19 శాతం నమోదైంది. జూన్, జూలై నెలల్లో దాదాపు అన్ని జిల్లాల్లో కూడా 10 నుండి 20 రోజుల పాటు వర్షాలు కురిశాయి. ఆగస్టులో 21 రోజులు గడచిపోగా, రెండు రోజుల నుండి 9 రోజులు మాత్రమే సరాసరిన వర్షాలు కురిశాయి.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 108 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 85 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. జూన్, జూలై నెలల్లో వర్షాలు బాగానే ఉండటంతో మొక్కజొన్న, కందులు, పెసలు, ఉలవలు, సోయాబీన్ పంట పూర్తివిస్తీర్ణంలో వేశారు. జొన్న, బుడ్డలు (వేరుసెనగ), పసుపు 80 శాతం విస్తీర్ణంలో వేశారు. సజ్జ, ఆముదం, పొద్దుతిరుగుడు, ఉల్లి, పత్తిపంటలు 51 నుండి 75 శాతం విస్తీర్ణంలో వేశారు. వరి, చెరకు, తైదలు (రాగులు) 50 శాతం విస్తీర్ణంలోగా వేశారు. వేసిన పంటలు ఇప్పటివరకు బాగానే ఉన్నప్పటికీ, ఈ వారంలో వర్షాలు కురవకపోతే రైతులకు భారంగా మారుతుంది.
నిరంతర సమీక్ష..
తెలంగాణ రాష్ట్రంలో పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. సచివాలయంలో ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదన్నారు. రైతులు విత్తనాలు వేయడం ఇంకాకొనసాగుతోందని వివరించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో జొన్న తదితర పంటలు నీరులేక ఎండిపోతున్నాయని, ఈ వారంలో వర్షాలు వస్తే ఈ పంటలు తిరిగి బాగవుతాయన్నారు. జలాశయాల్లో నీళ్లు అవసరమైన మేరకు లేకపోవడంతో వరిపంట ఇప్పటి వరకు పూర్తిగా సాగుకాలేదన్నారు. బావుల కింద వరినాట్లు కొనసాగుతున్నాయని, ఈ తేదీవరకు సాధారణంగా 15 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడాల్సి ఉండగా, 11.50 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయన్నారు. చాలా ప్రాంతాల్లో నారుమళ్లు ఉన్నాయని, రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారని పార్థసారథి వివరించారు. పత్తిపంట తక్కువగా వేయాలని ప్రభుత్వం ప్రచారం చేసిందని, దాని ఫలితం గణనీయంగా కనిపించిందన్నారు. పత్తిపంట స్థానంలో సోయాబీన్, కంది, మొక్కజొన్న పంటలకు ప్రాధాన్యత లభించిందని పార్థసారథి వివరించారు.