తెలంగాణ

ప్రాజెక్టులపై నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై రైల్వే శాఖ, రైల్వే బోర్డు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపిలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత ఏడాది చేసిన ప్రతిపాదనల్లో ఏ ఒక్కటీ కూడా అమలు కాలేదని, తెలంగాణ ప్రాంత రైల్వే ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే బడ్జెట్‌కు ముందు ప్రతి ఏడాది దక్షిణ మధ్య రైల్వే జిఎం ఎంపిలతో సమావే శం నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపధ్యంలో బుధవారం రైల్వే జిఎం రవీంద్ర గుప్తాతో సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 15 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత ఎంపిలు రానున్న రైల్వే బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి సత్వరమే పనులు చేపట్టాలని కోరారు. ప్రతి ఏడాది సమావేశం నిర్వహించి చేతులు దులుపుకోవడం తప్ప పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని, అభివృద్ధి జరగడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానంతరం ఎంపిలు వినోద్, జితేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మల్లారెడ్డి, కొండ విశే్వశ్వర్‌రెడ్డి తదితరులు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదన ఇంతవరకు కార్య రూపం దాల్చలేదని, కాజిపేట వ్యాగన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామని 2012-13లో ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని, కాజీపేటను ప్రత్యేక రైల్వే డివిజన్‌గా చేస్తామని చెప్పిన మరో హామీ కూడా నెరవేరలేదని వారు రైల్వే జిఎం దృష్టికి తెచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అతిముఖ్యమైనదని, కేంద్రప్రభుత్వం దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారు కోరారు. పెద్దపల్లి-నిజామాబాద్ కొత్త రైల్వే లైను ప్రాజెక్టు 25 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉందని, కరీంనగర్ నుంచి ముంబయి వరకు కొత్త రైలు ప్రారంభించాలని, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయని ఎంపిలు రైల్వే శాఖపై అసహనం వ్యక్తం చేశారు. నగరంలో రైల్వే స్టేషన్ల పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉన్నందున శివారుల్లో నాలుగు టెర్మినల్స్ నిర్మించాలని తమ ప్రతిపాదనల్లో రైల్వే శాఖను కోరినట్లు వారు వెల్లడించారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు మూడో రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని, ఆలంపూర్ జోగులాంబ ఆలయం వద్ద స్టేషన్ ఏర్పాటు చేయాలని మరో ఎంపి నంది ఎల్లయ్య జిఎంను కోరారు. సమావేశంలో పాల్గొన్న వివిధ విభాగాల రైల్వే అధికారులు ఎంపిలు అడిగిన పలు ప్రశ్నలకు జవాబిచ్చారు. పెండింగ్ ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణ పనుల పురోగతి వంటి అంశాలను ఆయా విభాగాలకు చెందిన జోనల్ రైల్వే ఉన్నతాధికారులు ఎంపిలకు వివరించారు. పెద్దపల్లి -నిజామాబాద్ కొత్త రైల్వే లైను పనులకు భూసేకరణ పూర్తి కావాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన నిధులు సిద్ధంగా ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారు. మనోహరాబాద్-కొత్తపల్లి కొత్త బ్రాడ్‌గేట్ లైన్ పనులకు కూడా భూసేకర జరగాల్సి ఉందని, అది జరిగిన వెంటనే పనులు చేపట్టేందుకు వీలవుతుందని వెల్లడించారు. అక్కన్నపేట-మెదక్ మధ్య 17.20 కి.మీ కొత్త రైలు మార్గం రూ.117.74 కోట్లతో చేపట్టేందుకు 2012-13లో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరినా భూసేకరణకు సంబంధించి నష్టపరిహారం చెల్లింపు జరగాల్సి ఉందని వెల్లడించారు. కాజిపేట-విజయవాడ మధ్య మూడో లైను విద్యుదీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా తెలంగాణలో ఉన్న పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఎంపిలు అధికారుల నుంచి వివరణ అడిగారు.
ఎంపిల సమావేశం నుంచి గుత్తా వాకౌట్
రైల్వే జిఎంతో జరిగిన ఎంపిల సమావేశం నుంచి నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి వాకౌట్ చేశారు. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న మాచర్ల-నల్గొండ రైల్వే లైను పనులను చేపట్టడంలో రైల్వే శాఖ నిర్లక్ష్యం చేస్తోందని, తాను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైల్వే జిఎంతో చెప్పి సమావేశం నుంచి బయటకు వచ్చేసారు. ఈ లైన్ నిర్మాణ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సర్వే పూర్తయినా పనులు ఇంతవరకు చేపట్టలేదని, తాను చాలా సార్లు రైల్వే మంత్రిత్వశాఖకు ప్రతిపాదించినా ఏమాత్రం స్పందన లేదని అసహనం వ్యక్తం చేసి సమావేశం నుంచి బహిష్కరించి వచ్చేశారు. జిఎంతో సమావేశమైన వారిలో ఎంపిలు ఎ.సీతారామ్‌నాయక్, బాల్కా సుమన్, పసునూరి దయాకర్, బిబి పాటిల్, రాపోలు ఆనంద్ భాస్కర్, టి.దేవేందర్‌గౌడ్, గోడమ్ నగేష్, బీదర్ ఎంపి భగవంత్ కుంభ ఉన్నారు.

చిత్రం... ఎంపీలతో మాట్లాడుతున్న రైల్వే జిఎం రవీంద్ర గుప్తా