తెలంగాణ

త్వరలో టెక్స్‌టైల్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 6: దేశంలోనే అతి పెద్ద మల్టిపుల్ టెక్స్‌టైల్ పార్క్‌ను త్వరలో వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మూడోరోజూ వరంగల్‌లో పర్యటించిన కెసిఆర్ నగరాభివృద్ధికి వరాలు కురిపించారు. వరంగల్ సర్వతోముఖాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్టు చెప్పారు. మూడు రోజుల పర్యటన అనంతరం బుధవారం నందన గార్డెన్‌లో మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లాను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏటా బడ్జెట్‌లో కేటాయించే రూ.300 కోట్లతో స్పెషల్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ కలెక్టర్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాను అభివృద్ధిపథంలో ఉంచుతామన్నారు. దేశంలోనే మల్ట్ఫిల్ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందుకోసం వంద కోట్లు భూసేకరణకు మంజూరు చేశామన్నారు. భూసేకరణ పూర్తికాగానే వరంగల్‌లో తిర్పూర్, గుజరాత్, సోలాపూర్‌లను తలదనే్నలా అధునాతనమైన టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. కాటన్ టూ గార్మెట్ ఇక్కడే ఉత్పత్తి అయ్యే విధంగా టెక్స్‌టైల్ పార్కు ఉండబోతోందని, దేశంలోనే నెంబర్ వన్ టెక్స్‌టైల్ పార్కుగా రూపుదిద్దుకోబోతుందన్నారు. వచ్చే మూడేళ్లలో ఈ టెక్స్‌టైల్ పార్కు పూర్తిస్థాయిలో రూపుదిద్దుకొని అందుబాటులోకి వస్తుందని, దీనిద్వారా వరంగల్‌కు మరో ఐదు లక్షలు అదనంగా జనాభా పెరుగుతుందన్నారు. వరంగల్‌లో వచ్చే ఏడాది మెటర్నిటీ కళాశాల, అగ్రికల్చర్ కళాశాల, కాటన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన ట్రైబల్ వర్సిటీని కూడా వరంగల్‌లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. శాస్ర్తియంగా చక్కటి పద్ధతిలో వరంగల్‌ను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. మరో నెలలో నగరంలో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం కాబోతుందన్నారు. నగరంలో 20 బస్‌బేలు నిర్మిస్తామని, వివాదస్పదంగా ఉన్న జకులుద్దీన్ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అదే స్థలంలో థీమ్‌పార్క్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సైనిక్ స్కూల్, ఢిల్లీ, హైదరాబాద్ పబ్లిక్‌స్కూల్‌తోపాటు మరికొన్ని అంతర్జాతీయ స్కూళ్లు కూడా ఇక్కడకు రాబోతున్నాయన్నారు. వరంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్ నగర నడిబొడ్డునున్న సెంట్రల్ జైలును మామునూరుకు తరలించి, ఆ స్థలంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. ప్రస్తుత ఎంజిఎం హాస్పిటల్‌ను మెటర్నిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలోనే వరంగల్‌లో స్మార్ట్ పోలీస్ చూడబోతున్నామని, డిఐజి కార్యాలయ స్థానంలోనే 12 అంతస్థుల పోలీస్ టవర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే నగరమంతటా సిసి కెమెరాలు విస్తరించి ఉన్నాయని, సిసి కెమెరాలతోనే నేరాలకు చెక్ పెట్టవచ్చన్నారు. వరంగల్ కలెక్టరేట్ భవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నట్టు తెలిపారు. నూతన భవనాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. వరంగల్ నగరంలో త్వరలోనే వంద కొత్త భవనాలు చూడబోతున్నారన్నారు. రెండు మూడు నెలల్లో ఈ భవనాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. గత కొనేళ్లుగా పెండింగ్‌లోవున్న జర్నలిస్టు సమస్యలకు సిఎం కెసిఆర్ పరిష్కారం చూపారు. దాదాపు 60 ఎకరాల్లో జర్నలిస్టులు అందరికీ అద్భుతమైన డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని, అందుకు చైర్మన్‌గా తానే ఉంటానన్నారు. ఇతరులు అసూయపడేలా వరంగల్ జర్నలిస్టులకు ప్రభుత్వ ఖర్చులతోనే ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అందుకు రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సమావేశంలో స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రులు చందూలాల్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.

చిత్రం... వరంగల్‌లో బుధవారం స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులు అందిస్తున్న సిఎం కెసిఆర్