తెలంగాణ

పంటల కొనుగోలుకు ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో 2019-20 యాసంగి (రబీ) పంటకు సంబంధించి పంటల ఉత్పత్తి అద్భుతంగా ఉందని, ఈ పంటల కొనుగోలుకు బృహత్తర ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఒక టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, రబీలో 40 లక్షల ఎకరాల్లో వరి, 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, మరో 10 లక్షల ఎకరాల్లో పల్లీ, ఉద్యాన తదితర పంటలు వేశారని గుర్తు చేశారు. వరి, మొక్కజొన్న కొనుగోలుకు అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కరోనా ఉధృతంగా ఉన్నప్పటికీ, పంటల కోత, పంటల ఉత్పత్తుల కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకున్నట్టు వివరించారు. వరి కోతకోసం 16,600 హార్వెస్టర్లను గుర్తించామని, ఇతర రాష్ట్రాల నుండి మరో 1,500 వరకు హార్వెస్టర్లు వస్తున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి హార్వెస్టర్లు మన రాష్ట్రంలోకి వచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. లాక్‌డౌన్ నుండి వ్యవసాయ రంగాన్ని మినహాయించామన్నారు. సమాజంలో ఏర్పడ్డ పరిస్థితులకు అనుగుణంగా రైతులు జాగ్రత్తగా ఉంటూ తమ పంటల ఉత్పత్తులను అమ్ముకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలుకు గ్రామాల్లోనే ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు. రైతులకు కూపన్లు ఇస్తున్నామని, ఈ కూపన్లలో పేర్కొన్న తేదీల్లోనే రైతులు తమ పంటల ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోగా చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ధాన్యం నిలువ కోసం 20 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే ప్రభుత్వం వద్ద 9 కోట్ల గన్నీ బ్యాగులు ఉన్నాయని, మరో నెల రోజుల్లో అవసరమైన మేరకు బ్యాగులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం జూట్ కార్పొరేషన్‌తో మాట్లాడామన్నారు. రైతుల నుండి వరి కొనుగోలు చేసిన వెంటనే మిల్లింగ్ జరుగుతుందన్నారు. రైస్‌మిల్లుల్లో హమాలీలు, కూలీల కొరత ఉండబోదనన్నారు. ఇలాఉండగా బత్తాయిపళ్లను కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.
సేద్యానికి ఉపాధి నిధులు
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను వ్యవసాయ పనులతో అనుసంధానం చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామీ పనులు సమర్థంగా లేవని ప్రధాని స్వయంగా అంగీకరించారని, అందువల్ల వ్యవసాయ పనులతో నూరు శాతం అనుసంధానం చేయాలని కోరుతున్నామన్నారు.
కనీసం 50 శాతం వ్యవసాయ పనులతో ఉపాధి హామీ పనులను అనుసంధానం చేయడం వల్ల ఒకవైపు రైతులకు ప్రయోజనం ఉంటుందని, మరోవైపు జాతీయ ఆహార భద్రతకు వీలవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆర్థికపరమైన ఆంక్షలు వ్యవసాయ రంగానికి వర్తించబోవని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.
రైతులను ఆదుకుంటాం
ఇటీవల కురిసిన వడగళ్ల వానవల్ల పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో దాదాపు 40 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక సమాచారం వల్ల తేలిందన్నారు. పూర్తి వివరాలను సేకరించేందుకు ఎన్యూమరేషన్ జరుగుతోందని, వ్యవసాయ శాఖ ఈ పనిలో నిమగ్నమైందన్నారు. పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందిన తర్వాత రైతులకు ఏ విధంగా, ఎంత మేరకు సాయం చేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారన్నారు.