తెలంగాణ
జయహో.. జనతా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, మార్చి 22: ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా మహమ్మారిపై పోరాడేందుకు ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపునకు కోటిన్నర జనాభా అలరారుతున్న హైదరాబాద్ మహానగరం మూగబోయింది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంపూర్ణంగా జనతా కర్ఫ్యూకు మద్దతు పలకడం విశేషం. పేద, మధ్య తరగతి, ధనిక వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇంటికే పరిమితమయ్యారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 400 సంవత్సరాలకుపైబడి చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగరంలో మార్చి 22వ తేదీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. అనేక యుద్థాలు, ఉద్యమాలు, పోరాటాలకు సాక్షీభూతంగా నిలిచిన హైదరాబాద్ మహానగరంలో చీమ చిటుక్కుమనలేదు. ఇళ్లలో నుంచి జనం బయటకు రాలేదు. గల్లీల్లోని పాన్ షాపులు, మటన్ సెంటర్లు, మెస్‌లు మొదలుకుని ప్రధాన కూడళ్లలోని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, అన్ని రకాల వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. చివరకు రైల్వే, బస్టాండ్ల వద్ద గల్లీల్లో ఎప్పుడూ తెరిచి ఉండే టీ దుకాణాలు, తినుబండారాల హోటళ్లు కూడా మూతపడ్డాయి. హైదరాబాద్ గత శతాబ్థంలో అనేక సంఘటనలను చూసింది. 1948 సెప్టెంబర్ 17వ తేదీన పోలీసు యాక్షన్ డే, హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం, 1969 తెలంగాణ ఉద్యమం, 2001 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా 2020 మార్చి 22వ తేదీ మాదిరిగా నగరం లాక్ డౌన్ కాలేదని ఆ నాటి సంఘటనలను చూసిన పెద్దలు చెబుతున్నారు. హైదరాబాద్‌కు వచ్చే కరీంనగర్ జాతీయరహదారి, నిజామాబాద్ జాతీయ రహదారి, నర్సాపూర్ రహదారి, ముంబయి రహదారి, వికారాబాద్ రహదారి, బెంగళూరు రహదారి, వరంగల్ జాతీయ రహదారిపై ఒక్క వాహనం కూడా కదలలేదు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో జనం లేరు. నగరంలోని అన్ని ఫ్లై ఓవర్లు, ప్రధాన రహదారులు ఎడారిని తలపించాయి. 40 లక్షల వాహనాలతో, కాలుష్యంతో దర్శనమిచ్చే హైదరాబాద్‌లో అప్పుడప్పుడు అత్యవసర సర్వీసుల నిమిత్తం వెళ్లే ఒకటి రెండు వాహనాలు దర్శనమిచ్చాయి. నగర పరిసరాల్లోని కుత్బుల్లాపూర్, కుకుట్‌పల్లి, సనత్‌నగర్ పారిశ్రామికవాడ, మల్కాజగిరి, ఉప్పల్-ఎల్‌బీనగర్, సికింద్రాబాద్, హైదరాబాద్, కార్వాన్, నాంపల్లి, బహదూర్‌పల్లి, చార్మినార్, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠీ, అమీర్‌పేట్, బేగంపేట్, సంజీవరెడ్డి నగర్, కేపీహెచ్‌బీ నగర్ ప్రాంతాలు బోసిపోయాయి. అపార్టుమెంట్లు, ఇళ్లకే జనం పరిమితమయ్యారు. ఆల్పాదాయవర్గాలు, రెక్కాడితే కాని డొక్కాడని ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు కూడా నిర్మానుష్యమయ్యాయి. ఇళ్లలోనే ఉండి టీవీలు చూశారు. కరోనా వైరస్ మహమ్మారి గురించి చర్చించుకోవడం కనిపించింది. ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు హైదరాబాద్ నగరం జనతా కర్ఫ్యూను తూచాతప్పకుండా పాటించి అమలు చేసిందని, మళ్లీ భవిష్యత్తులో ఈ తరహా రోజు రాకూడదని కోరుకుంటానని శశిధర్ రెడ్డి అనే వాణిజ్యవేత్త చెప్పారు. జనతా కర్ఫ్యూ వల్ల ప్రజలకు కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం తెలిసివచ్చిందని, దీని గురించి తెలుసుకుని ఆందోళనకు లోనయ్యారన్నారు. స్వీయ నిర్బంధం ఒక్కటే పరిష్కారమనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడంలో ప్రధాని మోదీ, తెలంగాణ, ఆంధ్రా సీఎంలు కేసీఆర్, జగన్‌లు విజయవంతమయ్యారని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పసిపిల్లలు కూడా ఇంట్లోని ఉండి తల్లితండ్రులను వేధించకుండా సహకరించడం ఆశ్చర్యకరంగా ఉందని విజయలక్ష్మి అనే గృహిణి చెప్పారు. ఆటోలు, క్యాబ్‌లు, ఇతర వాహనాలు రోడ్లపై దర్శనమివ్వలేదు. కొన్ని చోట్ల తీవ్ర అస్వస్తతకుగురైన వారిని ఆసుపత్రికి చేరవేసేందుకు అపార్టుమెంట్ వాసులు స్వచ్చందంగా వచ్చి వాహనాలు ఇవ్వడం విశేషం. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిచెందకుండా మోదీ, కేసీఆర్‌లు తీసుకునే చర్యలకు మద్దతు ఇస్తామని ప్రజలు ముందుకు వచ్చి చెబుతున్నారు. ఎవరిని అడిగినా, లాక్ డౌన్ ఎన్ని రోజులు ప్రకటించినా బాధపడమని, ప్రభుత్వానికి సహకరిస్తామంటున్నారు. పేదలకు రేషన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యాదవ్వ అనే వృద్ధమహిళ చెప్పారు.
*చిత్రం...బయటకు వచ్చి చప్పట్లు కొడుతూన్న కేటీఆర్