తెలంగాణ

స్వల్ప ఘర్షణ.. ఫలితం.. భారీ విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, జనవరి 13: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కొరవగల్లీలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారి భారీ విధ్వంసానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. కొరవగల్లీలో ఒక వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు ద్విచక్ర వాహనానికి సైలెన్సర్‌ను తొలగించి పెద్ద శబ్దంతో వేగంగా నడుపుతుండడంతో సదరు వాహనదారునితో కాలనీ వాసులకు ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కోపోద్రిక్తులైన ఒక వర్గానికి చెందిన వందలాది మంది కర్రలు, రాళ్లతో దాడులు చేసి రోడ్లపై ఉన్న ద్విచక్ర వాహనాలను, ఇళ్లను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పు అట్టించారు. పలు ఇళ్ల నుండి సిలిండర్లను బయటకు తెచ్చి రోడ్లపై తగులబెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. అడ్డం వచ్చిన వారిపై దాడులు చేస్తూ ఇళ్లల్లోని మహిళలను సైతం తోసివేసి ఇళ్లను దగ్ధం చేశారు. ఈ ఘటనతో కొరవగల్లీ మొత్తం రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దాదాపు ఉదయం 3గంటల వరకు
అల్లర్లను అదుపు చేశారు. ఈ ఘటనలో 24 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, నాలుగు ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. దాదాపు 10 మంది వరకు యువకులకు సైతం గాయాలయ్యాయి. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం సంభవించి 14 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో కాలనీవాసులు నిరాశ్రయులయ్యారు. ఇళ్లల్లోని నిత్యావసర సరుకులు, బట్టలు, బంగారం, నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్ని ఆహుతైనట్లు బాధితులు వాపోయారు. ఈ విధ్వంసాన్ని అదుపు చేసే ప్రయత్నంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, డీఎస్పీ నర్సింగ్‌రావు, సీఐ వేణుగోపాల్, ఎస్సై అశోక్‌కు గాయాలయ్యాయి. ఇరు వర్గాల దాడిలో గాయపడిన క్షతగాత్రులను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొరవగల్లిలోని సీసీ కెమెరాలను సైతం దుండగులు ధ్వంసం చేశారు.
బిక్కుబిక్కుమంటూ రాత్రంతా...
పట్టణంలోని కొరవగల్లీలో రాత్రి 11 గంటలకు ప్రారంభమైన విధ్వంస కాండ తెల్లవారు జామున 3గంటల వరకు కొనసాగడంతో కాలనీలోని పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీశారు. ఎక్కడ నుండి బండరాళ్లు వస్తాయో.. ఎక్కడి నుండి దాడి చేస్తారో అని గుంపులుగా చేరి భయంతో ప్రాణాలను రక్షించుకున్నారు. * ఎక్కడ చూసినా విధ్వంస దృశ్యాలే..
పట్టణంలోని కొరవగల్లీలో ఆదివారం రాత్రి విధ్వంసకాండ చోటుచేసుకున్న నేపథ్యంలో ఉదయం ఎక్కడ చూసినా విధ్వంసక దృశ్యాలే కనిపించాయి. కాలిపోయిన ద్విచక్ర వాహనాలు, కాలిబూడిదైన ఇళ్లు, పేలిన సిలిండర్లు, ఇళ్ల సామాగ్రి బాధితుల ఆర్తనాదాలతో కాలనీ అంతా బోరుమంది. కట్టుబట్టలే మిగలడంతో బాధితుల రోదనలు మిన్నంటాయి.
* ఉదయం సైతం రాళ్ల దాడులు..
ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో కొరవగల్లీకే పరిమితమైన దాడులు సోమవారం ఉదయం బట్టి గల్లి, పురానా బజార్, పాండ్రి గల్లీ వరకు పాకాయి. ఎక్కడి నుండి రాళ్లు వస్తున్నాయో తెలియక పోలీసులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఉదయం జరిగిన రాళ్ళ దాడుల్లో పలువురు పోలీసులు, స్థానికులు గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారిని హుటాహూటిన ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
* నిర్మానుష్యంగా భైంసా పట్టణం..
ఆదివారం రాత్రి భైంసా పట్టణంలో విధ్వంస ఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురై ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజాము నుండే విధ్వంస ఘటన సమాచారం వ్యాప్తి చెందడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సైతం భైంసాకు రావడానికి జంకుతున్నారు. దుకాణ సముదాయాలు, వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. సోమవారం భైంసాలో సంత కావడంతో పెద్ద ఎత్తున వ్యాపారం జరగాల్సి ఉన్నప్పటికీ విధ్వంస సంఘటన నేపథ్యంలో భైంసా పట్టణం ఎటు చూసినా పోలీసులతో నిర్మానుష్యంగా మారింది. పట్టణానికి చెందిన పలువురు తమ బంధువుల ఇంట్లోకి వెళుతూ కనిపించారు.
* నిలిచిన ఇంటర్నెట్ సేవలు..
భైంసాలో చోటు చేసుకున్న విధ్వంస ఘటన నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అన్ని కంపెనీలకు చెందిన నెట్‌వర్క్‌లను నిలిపివేసి ఘటన వివరాలు బయటకు పొక్కకుండా చర్యలు తీసుకున్నారు. పలు వ్యాపార సంస్థలు, బ్యాంకులు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విదేశాల్లో ఉన్నవారు సైతం ఇక్కడి తమ వారితో మాట్లాడేందుకు కూడా వీలుకాకపోవడంతో పలువురు ఇబ్బందుల పాలయ్యారు. ఉదయం పాలు, కూరగాయలు సైతం స్థానికులకు అందుబాటులో లేకుండా పోయాయి.
'చిత్రం...నిర్మల్ జిల్లా భైంసాలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో తగులబడిన వివిధ వాహనాలు, ఇల్లు