తెలంగాణ

మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మిలియన్ మార్చ్ సందర్భంగా నిర్వహించిన చలో ట్యాంక్ బండ్ ఆందోళనలో ఆందోళనకారులపై లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ పిలుపుమేరకు సోమవారం చేపట్టిన మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా నిరసనకారులు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డకుని కట్టడి చేశారు. దీంతో తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పలుచోట్ల కార్మికులు, నేతలు స్వల్పంగా గాయపడ్డారు. పలువురిని అరెస్టు చేశారు. నిరసనకారులు మంత్రులు జగదీష్‌రెడ్డి, హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి యత్నించారు. పాలమూరు జిల్లాలో ఆర్టీసీ జేఎసీ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం ఆర్టీసీ కార్మికులు తెరాస ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్‌లోని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఇంటిని ఆర్టీసీ కార్మికులు మట్టడించారు. కాగా మంత్రి ఇంటి దగ్గరకు ఎవరూ రాకుండా బారికేడ్లను ఏర్పాటు చేసినప్పటికీ మహిళా కార్మికులు చాకచక్యంగా మంత్రి ఇంటి వెనుక నుండి వచ్చే దారి నుండి ఒక్కసారిగా మంత్రి ఇంటిముందుకు చేరుకుని ముట్టడించారు. మరోపక్క మరికొంతమంది ఆర్టీసీ కార్మికులు వామపక్ష పార్టీల నేతలు సైతం ఇంటిని ముట్టడించారు.
ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంటిని ముట్టడించిన అనంతరం అక్కడ ఉన్న మంత్రి పీఏకు ఆర్టీసీ జేఎసీ నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా వనపర్తిలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇంటిని సైతం ఆర్టీసీ కార్మికులు మట్టడించి అక్కడున్న మంత్రి పీఏకు వినతి పత్రం అందజేశారు. మంత్రుల ఇళ్లతో పాటు ఎమ్మెల్యేల ఇళ్లను సైతం ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, నారాయణపేటలోని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఇంటిని ముట్టడించి వినతి పత్రాలను అందజేశారు.
మంత్రి జగదీష్‌రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నాయకులు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. స్థానిక డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు, సీపీఎం, న్యూడెమోక్రసీ, సీపీఐ, బీజేపీ, పీడీఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బస్టాండ్ నుండి మంత్రి క్యాంపు కార్యాలయానికి ప్రదర్శనగా బయలుదేరారు. వీరిని మంత్రి క్యాంపు కార్యాలయం సమీపంలోని భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు తీరును నిరసిస్తూ వారు కూడలిలో నిరసన వ్యక్తం చేశారు.
కరీంనగర్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ,పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముట్టడికి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల నాయకులు యత్నించగా పోలీస్ ఎక్కడికక్కడే ఆందోళనకారులను అడ్డుకొని అరెస్టులు చేశారు.
వరంగల్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ కెప్టెన్ లక్ష్మికాంతారావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇళ్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడికి వామపక్షాలు, సీఐటీయూ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు విఫల యత్నం చేశారు. ఆందోళనకారులు మంత్రి ఎర్రబెల్లి ఇంటి ముట్టడికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళన కారులకు, పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణవాతావరణం నెలకొంది. పోలీసులు ఇంటి ముట్టడికి వచ్చిన కార్యకర్తలందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇళ్ల ముట్టడి సందర్భంగా మంత్రి, చీఫ్ విప్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందుబాటులో లేరు.
కాగా, మహబూబాబాద్‌లో నివసించే రాష్టస్రాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ఇంటి ఎదుట రాజకీయ అఖిలపక్ష కమిటీ నాయకులతో కలసి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు నిరసనకు దిగారు. మానుకోట ఎంపీ మాలోతు కవిత, మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌ల నివాసాల ఎదుట నిరసనకు దిగారు. ముందస్తు అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి హరీష్ ఇంటి ముట్డడిలో స్పృహతప్పిన మహిళా కండక్టర్
సిద్దిపేటలోని మంత్రి హరీష్‌రావు ఇంటి ముట్టడి కార్యక్రమానికి సోమవారం ఆర్టీసీ కార్మికులు, సీపీఐ, సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గుంపులుగా మూడు రూట్ల నుండి తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగటంతో కళావతి అనే ఆర్టీసీ కార్మికురాలు సృహతప్పి పడిపోయింది. ఐద్వా నాయకులు హేమలతకు స్వల్ప గాయాలయ్యాయి. ఆర్టీసీ కార్మికురాలు కళావతిని ఆసుపత్రికి తరలించారు.
ఆదిలాబాద్‌లోని శాంతినగర్‌లో గల ఎమ్మెల్యే జోగురామన్న నివాస గృహాన్ని కార్మికుల జేఏసీ అధ్వర్యంలో ముట్టడించగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కార్మికులను నిలువరించారు. నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు నిలువరించి భగ్నం చేశారు. భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, మంచిర్యాలలో ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇంటిని ముట్టడించి నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు.
స్పీకర్‌కు వినతిపత్రం
బాన్సువాడ రూరల్: నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు కార్మికులు ప్రయత్నించారు. నసురుల్లాబాద్, బాన్సువాడ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన స్పీకర్‌ను కలిసి తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వినతిపత్రాన్ని అందించేందుకు కార్మికులు ప్రయత్నించారు. స్థానిక జేఏసీ నాయకుడు గిరిధర్ నేతృత్వంలో 50 మంది కార్మికులు స్పీకర్ స్వగృహానికి చేరుకుని నినాదాలు చేశారు.
స్పందించిన సభాపతి కార్మికులను అడ్డుకోవద్దంటూ పోలీసులను వారిస్తూ, లోనికి పంపించాల్సిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పీకర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు.