తెలంగాణ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 23: ప్రజా రవాణా వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని, అప్పటివరకు కార్మికులు మనోధైర్యం కోల్పోకుండా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని టీజేఎస్ అధ్యక్షుడు, రాజకీయ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఆర్టీసీ, రాజకీయ జేఏసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సమ్మె చేపట్టడానికి నెల రోజుల ముందే ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వానికి, సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందించిందని గుర్తు చేశారు. అయినప్పటికీ, సమ్మె నోటీసుల పట్ల అప్పట్లో సీఎం కేసీఆర్ నామమాత్రంగానైనా స్పందించలేదన్నారు. అంతకుముందే గత జూన్ మాసం నుండి దశల వారీగా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు నిర్వహించి, రవాణా శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదన్నారు. చివరి నిమిషంలో త్రిసభ్య కమిటీని నియమించినప్పటికీ, ఆర్టీసీ జేఏసీ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల వైఖరిని వ్యక్తపర్చలేదన్నారు. కార్మికులు సమ్మెకు పూనుకున్న మీదట ముఖ్యమంత్రి కేసీఆర్ వారి పట్ల దుష్ప్రచారానికి దిగారని దుయ్యబట్టారు. కార్మికులకు నెలకు 50వేల వేతనం ఉందని సీఎం పేర్కొన్నారని, తాను ఓ కార్మికుడిని ఈ విషయమై ఆరా తీస్తే 15 వేల వేతనం మాత్రమే వస్తోందని తెలిపాడన్నారు. ప్రభుత్వ పట్టింపులేని ధోరణి వల్ల అనివార్య పరిస్థితుల్లోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాల్సి వచ్చిందని, ఈ విషయంలో కార్మికులతో చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ప్రభుత్వానికి చట్టాలంటే గౌరవం లేనట్టుగా ప్రవర్తిస్తోందని ఆయన ఆక్షేపించారు. ఈడీలతో కమిటీని ఏర్పాటు చేసి సుమారు 4గంటల పాటు సీఎం కేసీఆర్ చర్చలు జరిపారన్నారు. అయితే ఈడీలతో కూడిన కమిటీ కార్మిక సంఘాలతో కాకుండా ఆర్టీసీ బస్‌భవన్‌లో అధికారులతో చర్చలు జరపడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆలోచనా విధానం సక్రమంగా లేదని, ముందుగా కార్మికులతో చర్చలు జరపాలన్నారు. ఆర్టీసీ ఆస్తుల మీద సర్కారు కన్ను వేసినందు వల్లే ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపడం లేదని కోదండరామ్ ఆరోపించారు. ఏపీలో ఆర్టీసీ విలీనం సాధ్యమైనపుడు, తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదని ఆయన తెరాస ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏసీ రూమ్‌లో కూర్చొని సమీక్షలు నిర్వహించకుండా, రోడ్ల పైకి వచ్చి చూస్తే వాస్తవ పరిస్థితులు, సమస్య తీవ్రత తెలుస్తుందన్నారు. మేఘా కృష్ణారెడ్డి బస్సులు కావాలా? లేక పల్లె వెలుగు బస్సులు కావాలా? అన్నది ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. ప్రజారవాణా వ్యవస్థగా సేవలందిస్తున్నందున ఆర్టీసీ బస్సులపై పన్ను మినహాయిస్తే సంస్థకు దానంతట అదే ఆదాయం సమకూరుతుందన్నారు. సంస్థను లాభాల బాటలో పయనింపజేసేందుకు ఆర్టీసీ కార్మికులు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నారని, పదవీ విరమణ చేసిన 7వేల మంది సిబ్బంది స్థానంలో కొత్తవారిని నియమించకపోయినా సంస్థ మనుగడ కోసం అహరహం శ్రమిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ సమ్మె వెనుక యావత్ తెలంగాణ సమాజం ఉందని, ప్రభుత్వం చర్చలు జరపకపోతే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుందన్నారు. సమ్మె విషయమై ఆర్టీసీ కార్మికులు మనస్థైర్యం కోల్పోవద్దని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు ఐక్యంగా పోరాడాలని, ఉద్యమానికి తామంతా వెన్నుదన్నుగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సమావేశంలో రాజకీయ జేఏసీ నాయకులు భాస్కర్, యెండల సుధాకర్, ప్రభాకర్, యాదగిరి, రమేష్‌బాబు, సబ్బని లత, వనమాల కృష్ణ, యాదాగౌడ్, ఆర్టీసీ జేఏసీ నాయకులు వందేమాతరం శ్రీనివాస్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

*చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం