తెలంగాణ

మరో పోరాటానికి సిద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కేడీసీ కళాశాల గ్రౌండ్‌లో జరిగిన మాదిగ, ఉప కులాల సామూహిక ఆవేదన మహాదీక్షలో ఆయన ప్రసంగించారు. ఈ మహాదీక్షకు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, బీజేపి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ కేసీఆర్ మంత్రివర్గ కూర్పు అంబేద్కర్ ఆలోచనకు విరుద్ధంగా ఉందన్నారు. సకలజనుల ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన తెలిపారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ముఖ్యమంత్రి జగన్‌ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు. ఏపీలో ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చి అన్ని వర్గాలకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమన్యాయం కల్పించారన్నారు. 11 మంది మాదిగలు ఉన్న అసెంబ్లీలో ఒక్కరు కూడా మంత్రి పదవికి అర్హులు కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రెండు సార్లు లక్ష ఓట్లతో గెలిచిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, గువ్వల బాలరాజు, రసమయి బాలకిషన్ వీరు మంత్రి పదవులకు అర్హులేనని అన్నారు. కొప్పుల ఈశ్వర్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అణగారిన వర్గాలకు 14 మంత్రి పదవులు దక్కాలని, అవి దక్కేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ప్రభుత్వం మాదిగలను అణచివేయాలని చూస్తే కాలగర్భంలో కలసిపోక తప్పదని హెచ్చరించారు. జనాభా ప్రతిపాదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎందుకు అవకాశం ఇవ్వరని ఆయన నిలదీశారు. రాష్ట్రం ఏర్పడక ముందు అప్పట్లో కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సకలజనుల సర్వే జనాభా లెక్కల ప్రకారం 90 శాతం బడుగు, బలహీన వర్గాలే ఉన్నారని అన్నారు. సబ్బండ జనాలు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అప్పుడు నీకున్న రెండు ఎంపీ పదవులతో రాలేదన్నారు. మహా దీక్షలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ మాదిగలకు మంత్రి పదవి దక్కేవరకు పోరాటం చేయాలన్నారు. నాడు రజాకార్లతో పోరాటం చేసిన ప్రజలు కేసీఆర్‌కు వ్యతరేకంగా పోరాటం చేయాలన్నారు. దళిత ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు తొత్తులుగా మారితే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని అన్నారు. మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ కేసీఆర్ నియంతృత్వ పోకడలను ఎండగట్టాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో రాజకీయంగా కేసీఆర్‌ను ఎదుర్కొనేది మాదిగలేనని అన్నారు. గతంలో అసెంబ్లీలో తాను కేసీఆర్‌ను ప్రశ్నించిందుకు అసెంబ్లీ నుండి గెంటివేశాడని అన్నారు. బీజేపి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాదిగల మహా దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఇంకా ఈ దీక్షకు సీపీఐ నేతలు కూడా సంఘీభావాన్ని ప్రకటించారు.

*చిత్రం...మాదిగ మహా దీక్షలో మాట్లాడుతున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ