తెలంగాణ

ఉద్వాసన తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నేత, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం పార్టీలో హాట్ టాపిక్‌గా మారారు. ఈటల రాజకీయ భవితవ్యంపై పార్టీ వర్గాల్లో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఈటలకు ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చర్చించిన విషయాలను గోప్యంగా ఉంచకుండా ఆ శాఖ ఉద్యోగ సంఘాలకు మంత్రి ఈటల రాజేందర్ లీక్ చేశారని ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న అభియోగం. కలక్టర్ల సమావేశపు వివరాలను ఈటల లీక్ చేసినట్టు టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి సన్నిహితంగా ఉండే మీడియాకు కూడా ఆ పార్టీ నుంచే లీక్ అయినట్టు సమాచారం. ఈ ఉదంతంలో మంత్రి ఈటలపై సీఎం కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్టు కూడా సదరు మీడియాలో రావడంతో మంత్రివర్గ విస్తరణలో ఈటలకు ఉద్వాసన తప్పదన్న కోణంలో టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కలెక్టర్ల సమావేశంలో చర్చించిన విషయాలను రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు
తాను లీక్ చేసినట్టు జరుగుతోన్న ప్రచారం వెనుక పార్టీ ముఖ్యుల హస్తం ఉందని ఈటల తన సన్నిహితుల వద్ద అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతున్నట్టు కూడా ఆయన వాపోయినట్టు ఈ వర్గాల సమాచారం. తాము మంత్రి ఈటలను కలిసింది కలెక్టర్ల సమావేశం వివరాల కోసం కాదని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఖండించినప్పటికీ ఈ ఉదంతంపై టీఆర్‌ఎస్ నాయకులు ఎవరూ స్పందించలేదు. ఇదంతా పెద్దల వ్యవహారంగా పార్టీ వర్గాలు చూడటం ఈటలకు సన్నిహితంగా ఉండే నాయకులు కూడా స్పందించకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. ఇలా ఉండగా తాజాగా ఈటల ఉదంతంతో మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు సాగుతున్నాయి. మంత్రివర్గం నుంచి ఈటలను తప్పిస్తే ఈయన స్థానంలో ఎవరికి చాన్స్ ఉంటుందన్న కోణంలో ఈ ఊహాగానాలు సాగుతున్నాయి. ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ స్థాయి కలిగిన నాయకుడు ఎవరూ లేకపోవడంతో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి జోగు రామన్న, దాస్యం వినయ్ భాస్కర్, గంగుల కమలాకర్, వనమా వెంకటేశ్వర్‌రావు పేర్లను పరిశీలించవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే, రెడ్డి సామాజిక వర్గం నుంచి సబితా ఇంద్రారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఇటు రెడ్డి సామాజిక వర్గం, అటు మహిళా కోటా భర్తీ చేసినట్టు అవుతుందని పైగా మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్టు ఈమెకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్టు ఈ వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు అవకాశం కల్పించాలని పార్టీ నేతలు బాహాటంగానే డిమాండ్ చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో హరీష్‌రావుకు కూడా అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇదే సామాజిక వర్గం నుంచి ఎర్రబెల్లి ఇప్పటికే మంత్రివర్గంలో ఉండటంతో పాటు ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఇటీవలనే రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా నియమించారు. దీంతో మంత్రివర్గంలోకి కేటీఆర్, హరీశ్‌రావు ఇద్దరికి అవకాశం ఉండకపోవచ్చనే మరో వాదన కూడా ఉంది. ఎస్‌టీ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కలేదు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌కు అవకాశం కల్పిస్తే ఇటు ఎస్టీ కోటా, అటు మహిళా కోటా భర్తీ అయినట్టు అవుతుందని పార్టీ భావిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఇదే సామాజిక వర్గానికి చెందిన రెడ్యానాయక్, రేఖానాయక్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
చిత్రం... వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్