తెలంగాణ

యురేనియం తవ్వకాలపై యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్రాబాద్, ఆగస్టు 17: నల్లమల ప్రాంతంలోని ఆదివాసీ చెంచులతో పాటు ఇతర వర్గాల ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం ద్వారానే యురేనియం తవ్వకాలు ఆగుతాయని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీ కృష్ణ అధ్యక్షతన అమ్రాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పచ్చని అడవులు, కృష్ణా నది, ఆదిమ జాతి చెంచులు, వన్యప్రాణులు, ఔషద మొక్కలు ఉన్న ప్రదేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజులు ఆమోదం తెలుపడం ద్వారానే నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాల కోసం కేంద్రం అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. ఈ తవ్వకాల మూలంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో 1000 టీఎంసీల సాగు నీరు కలుషితం కావడంతోటి కోటి ఎకరాలలో సాగవుతున్న పంటలు దెబ్బ తింటాయని ఈ నీళ్లపై ఆధార పడిన రెండు తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, అమరావతి తదితర ప్రాంతాలకు చెందిన పది కోట్ల మంది ప్రజలు వివిధ రకాల వ్యాధుల బారిన పడనున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపైన ముఖ్యమంత్రి కేసీ ఆర్ తక్షణమే బహిరంగా ప్రకటన చేసి యూరేనియం తవ్వకాలను నిలుపుదల చేయించాలని డిమాండ్ చేశారు. పర్యావరణం, అడవుల పరిరక్షణ అని చెబుతున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కూడా నల్లమల యురేనియం తవ్వకాలను అనుమతులను రద్దు చేస్తున్నట్లు పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. జార్ఖండ్ రాష్ట్రంలోని జాదుగూడ, కడప జిల్లాలోని తుమ్మల పల్లి ప్రాంతాలలో యురేనియం తవ్వకాలు జరపడం మూలంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. యూరేనియం తవ్వకాలకు అనుమతులిచ్చిన టీ ఆర్ ఎస్, బీజేపీ పార్టీలను సాంఘిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీల వారితో ఎలాంటి బంధుత్వాలు కూడా కొనసాగించరాదని అన్నారు. రెండు పార్టీలను దోషులుగా నిలబెట్టడం ద్వారానే యురేనియం తవ్వకాలు నిలిచిపోతాయని అన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇక్కడ కాకపోతే ఎక్కడైన పోయి బతుకుతాడని చివరికి కేసీఆర్ ఫాం హౌజ్‌లో పాలేరుగా పనిచేసి అవకాశం ఉందని తీవ్రంగా విమర్శించారు. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలో నివసిస్తున్న 70వేల మంది ప్రజలు ఎక్కడకు పోయి బ్రతుకుతారని అన్నారు. రాజకీయ పార్టీల జెండాలను పక్కనబెట్టి ఒక్కటే అజెండాగా యూరేనియం సమస్యను తీసుకొని ముందుకుపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాక తప్పదని అన్నారు. బలవంతంగా ఎవరైనా ఈ ప్రాంతానికి యురేనియం తవ్వకాల కోసం వస్తే మహిళలంతా తిరుగుబాటు చేసి కారం పొడి చల్లి వారిని అడ్డగించాలని అన్నారు. ఈ పోరాటానికి తాను ఎక్కడ ఉన్న కూడా ఏ సమయంలోనైనా హైదరాబాద్ నుండి రెండు గంటలలో ఇక్కడకు చేరుకుంటానని అన్నారు. ఈ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులలో కూడా యురేనియం తవ్వకాలు జరుగనిచ్చే పరిస్థితి ఉండదని, త్వరలో జరుగనున్న పార్లమెంట్ సమావేశాలలో నల్లమల సమస్యలపై గళం విప్పుతానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నల్లమల యూరేనియం వ్యతిరేక రాజకీయ జేఏసీ కన్వీనర్ కలుముల నాసరయ్య, అమ్రాబాద్ ఎంపీపీ శ్రీనివాసులు, జడ్పీటీసీ అనురాధ, వైస్ ఎంపీపీ ప్రణీత, రెండు మండలాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, జేఏసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. నల్లమల కళాకారుల వేదిక ద్వారా పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.
చిత్రం...అమ్రాబాద్‌లో మాట్లాడుతున్న మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి