ఆంధ్రప్రదేశ్‌

తరలింపు ఖర్చు తడిసిమోపెడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5:సచివాలయం తరలింపుపై అడుగులు తడబడుతున్నాయి. తరలింపు అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి చాలా పట్టుదలతో ఉన్నట్లు గత రెండురోజుల నుంచి ఆయన చేస్తున్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. అదే స్థాయిలో ఉద్యోగులు కూడా భీష్మించుకోవడంతో తరలింపు వ్యవహారం ఉత్కంఠగా మారింది. జూన్ 27కల్లా హైదరాబాద్‌లో ఉన్న సచివాలయ ఉద్యోగులంతా ఎట్టి పరిస్థితిలోనూ వెలగపూడికి రావల్సిందేనని ముఖ్యమంత్రి హుకుం జారీ చేసిన వెంటనే, సచివాలయ ఉద్యోగులలో కలకలం మొదలయింది. ఈ విషయంలో ఉద్యోగులంతా జాక్‌గా ఏర్పడి పోరాడాలన్న ప్రయత్నాలు మొదలయ్యాయి.
వెలగపూడికి తరలింపు వ్యవహారంలో తామంతా ఆందోళనతో ఉంటే, సచివాలయ ఉద్యోగుల సంఘ నేత మురళీకృష్ణ, ఏపి ఎన్జీఓ నేత అశోక్‌బాబు నిర్లిప్తంగా ఉన్నారని, వారి వైఖరి తమకు అనుకూలంగా లేదన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. ‘ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటంలో తప్పులేదు. కానీ దానిని ఉద్యోగుల డిమాండ్లు సాధించుకునేందుకు పనికివచ్చేలా ఉండాలి. మా నేతల తీరు అందుకు విరుద్ధంగా ఉంది. కొంతమంది ఉద్యోగుల పిల్లల్లో మానసిక వికలాంగులున్నారు. వారికి ఇక్కడ ప్రత్యేకంగా స్కూళ్లు ఉన్నాయి. అక్కడ లేవు. కొంతమందికి ఇక్కడ ఆసుపత్రుల్లో తప్ప అక్కడ ఆసుపత్రుల్లో చికిత్సలు లేవు. ఇక మహిళా ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. మీరంటే ఎక్కడో చోట ఉంటారు. కానీ మేం ఎక్కడ ఉండాలని అడుగుతున్నారు. వీటికి పరిష్కార మార్గాలు వెతికిన తర్వాతే తరలింపు ఉండాలి. కానీ ఇద్దరు నాయకులు (మురళీకృష్ణ, అశోక్‌బాబు) వీటిపై ప్రభుత్వంపై పోరాడుతున్న దాఖలాలు లేవ’ని ఒక ఉద్యోగి వ్యాఖ్యానించారు.
ఇదిలాఉండగా, తరలింపునకు సంబంధించిన మరో కీలక సమస్య ఇప్పుడు ఆర్ధిక సమస్యగా మారనుంది. నిబంధనల ప్రకారం ప్రభుత్వమే బదిలీ చేస్తే ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి. వెలగపూడికి వెళ్లే ఉద్యోగులు అక్కడ ఇళ్లు వెతుక్కునేందుకు, ఇక్కడ నుంచి సామాన్లు తరలించేందుకు నాలుగవ తరగతి నుంచి గెజిటెడ్ ఉద్యోగి వరకూ, ఒక్కొక్కరికి 70 వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. దానిని ఏ రూపంలో ఇవ్వాలన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం వారిని ఆందోళన పరుస్తోంది. వాటిని అడ్వాన్సు రూపంలో ఇవ్వడమా? లేదా? అన్న దానిపైనా ప్రభుత్వం నుంచి స్పష్టత రావలసి ఉంది.
ఇక విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా ఉన్నాయని, ఆ అంశంపై సీఎం ఎన్ని ఆదేశాలిస్తున్నా, అక్కడి జిల్లా యంత్రాంగం నుంచి స్పందన కనిపించడం లేదంటున్నారు. స్కూళ్ళలో 7వ తరగతి పిల్లలకు కూడా లక్ష రూపాయలు డొనేషన్ అడుగుతున్నారని, ఇలాంటి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటున్నారు. తరలింపు అంశంలో కూడా ప్రాంతీయ విబేధాలు కనిపిస్తున్నాయి. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఉద్యోగులు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయవాడ అయితే తమకు దగ్గర కాబట్టి, వెళ్లడానికి పెద్ద ఇబ్బందులు లేవంటున్నారు. అయితే రాయలసీమకు చెందిన ఉద్యోగులు మాత్రం సీడ్ క్యాపిటల్ అయ్యేవరకూ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.
సమస్యలు పరిష్కరించాల్సిందే: కృష్ణయ్య
‘అమరావతికి వెళ్లేందుకు అంతా సిద్ధంగానే ఉన్నాం. అక్కడ ప్రజల ముందు ఉండి, వారి కష్టాల్లో భాగస్వాములవాలన్న కోరిక మాకూ ఉంది. అయితే, ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రావలసి ఉంది. ముఖ్యంగా మూడు, నాలుగు అంశాలపై మేం ప్రభుత్వ స్పష్టత కోసం ఎదురుచూస్తున్నామ’ని సచివాలయ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియన్, గెజిటెడ్ జాక్ చైర్మన్ కృష్ణయ్య ఆంధ్రభూమికి చెప్పారు. అక్కడికి తరలివెళ్లాలని ప్రభుత్వమే నిర్ణయించినందున, నిబంధనల ప్రకారం ఆ ఖర్చంతా ప్రభుత్వమే భరించాలని, దానిపై ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నామన్నారు. జాక్ ఏర్పాటుపై ప్రశ్నించగా, ఇప్పటికే ఉన్న 5 సంఘాలు చురుకుగానే పనిచేస్తున్నాయని చెప్పారు. మరో రెండేళ్లలో రిటైరయ్యేవారిని, భార్యాభర్తలైన ఉద్యోగులు, వికలాంగ పిల్లలున్న తలిదండ్రులను తరలింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎస్‌ను కోరామన్నారు. ముఖ్యంగా ఉద్యోగుల పిల్లలకు స్థానికత విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదని, త్వరలో వస్తుందన్న జవాబు మాత్రమే వస్తోందన్నారు. ఫిట్‌మెంట్ ప్రకటించినప్పటికీ ఉత్తర్వు రాలేదని, ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాము తరలింపునకు వ్యతిరేకంగా ఉన్నామన్న ప్రచారం అబద్ధమని, తమ సమస్యలు పరిష్కరిస్తే అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని కృష్ణయ్య స్పష్టం చేశారు.