తెలంగాణ

పీవీ పేరిట కొత్త జిల్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సిఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చలు సాగుతున్నాయ. దేశ ప్రధానిగా సేవ లందించిన పివి నరసింహారావుతోపాటు మాజీ ఎంపి చొక్కారావు, ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ వంటి దివంగతుల పేర్లు పెట్టాలన్న పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి వీరి పేర్లు పెట్టాలని ఇప్పటికే వివిధ కుల, ఉద్యమ సంఘాలు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాయి. వీరి పేర్లు జిల్లాలకు పెట్టడంద్వారా ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త జిల్లా ఏర్పాటుతోపాటు వాటికి పెట్టే పేర్లపైనా కసరత్తు జరుగుతోంది. ఈ అంశంలో చారిత్రక, ఉద్యమ నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. పధ్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లబ్ధప్రతిష్ఠులతోపాటు, అంతకు దశాబ్దాల ముందే తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన ప్రముఖులు, తెలంగాణకు విశేష సేవలందించిన జాతీయ ప్రముఖులు, దేవాలయాల పేర్లు పెట్టాలన్న డిమాండ్‌పై పరిశీలన జరుగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టాలన్న ప్రతిపాదన తెరపైకొచ్చింది. దానిపై ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా చర్చ జరుగుతోంది. వంగర బిడ్డగా దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడంతోపాటు, ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన రాజనీతిజ్ఞుడిగా అందరి ప్రశంసలు పొందిన పివి పేరు కరీంనగర్ జిల్లాకు లేదా కొత్తగా ఏర్పాటుచేయబోయే జిల్లాకు పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. వంగర ప్రస్తుతం హుస్నాబాద్ పరిధిలో ఉంది. అయితే జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, హుస్నాబాద్, ధర్మపురి నియోజకవర్గాలు కలిపి జగిత్యాల జిల్లాగా ఏర్పడుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు పివి పేరు పెట్టాలని బ్రాహ్మణ సంఘాలతోపాటు, తెలంగాణ ఉద్యమ సంఘాలు, ప్రజాసంఘాలు చాలాకాలం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆయన సంస్మరణార్ధం జగిత్యాలకు పివి పేరు పెట్టడం ద్వారా.. ఆయన కాంగ్రెస్ వ్యక్తి అయినప్పటికీ, తమ ప్రభుత్వం ఆయనను గౌరవించిందన్న సంకేతాలిచ్చేందుకు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇరకాటంగా ఉంది. గతంలో దాదాపు అన్ని పార్టీలు, సంస్థలు, కుల, ప్రజా సంఘాలు కరీంనగర్ జిల్లాకు పివి పేరు పెట్టాలని డిమాండ్ చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారికంగా ఇప్పటివరకూ దానిపై పెదవి విప్పకపోవడం ప్రస్తావనార్హం. పివిని కాంగ్రెస్ నాయకత్వం అధికారికంగానే పక్కకుపెట్టడంతో, నాయకత్వాన్ని కాదని ఆయన పేరు జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది.
అదేవిధంగా వరంగల్ జిల్లాకు టీఆర్‌ఎస్ సిద్ధాంతకర్త, దివంగత ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. ఇప్పటికే ఒక యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఆదిలాబాద్‌కు కొమరం భీం పేరు పెట్టాలన్న డిమాండ్ చాలాకాలం నుంచి వినిపిస్తోంది. అది మంచిర్యాలకా లేదా ఆదిలాబాద్‌కా అన్నది చూడాల్సి ఉంది. ఇక దివంగత ఎంపి జె.చొక్కారావు పేరును కరీంనగర్‌కు పెట్టాలన్న డిమాండ్ చాలా ఏళ్ల నుంచి వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఉద్యమకారుడు స్మరించుకున్న చాకలి ఐలమ్మ పేరు వరంగల్ జిల్లాలో ఏర్పాటయ్యే కొత్త జిల్లాకు పెట్టాలన్న ప్రతిపాదన ఉంది.
ఇక నల్లగొండ జిల్లాలో ఏర్పాటయ్యే కొత్త జిల్లాకు యాదాద్రి జిల్లాగా నామకరణం చేయాలన్న ప్రతిపాదన ఉంది. చినజీయర్‌స్వామి సలహా సూచనలతో, యాదాద్రిని తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ చాలా పట్టుదలతో ఉన్నారు. భువనగిరి జిల్లాగా మార్చాలన్న డిమాండ్ ఉన్నప్పటికీ, యాదాద్రి జిల్లాగా మార్చాలని మెజారిటీ వాదన వినిపిస్తోంది.
ఖమ్మం జిల్లాలోని భద్రాచాలం పేరుతో కొత్త జిల్లా పెట్టాలన్న డిమాండ్ ఉంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం కేవలం 2వేల ఎకరాలకు పరిమితం అయినప్పటికీ, పుణ్యక్షేత్రం అయినందున అదే పేరుతో జిల్లా ఏర్పాటుచేసి, కొత్తగూడెంను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేస్తే మంచిదన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మెదక్, పేరుకు జిల్లా అయినప్పటికీ సంగారెడ్డి జిల్లా కేంద్రంగా, రంగారెడ్డి జిల్లా అయినప్పటికీ హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా భద్రాచలం జిల్లాను కూడా ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదన ఉంది. సమైక్యాంధ్రప్రదేశ్‌లో చివరగా కడప జిల్లాకు వైఎస్సార్ కడప జిల్లాగా, నెల్లూరుకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారు. ఆవిధంగా అంతకుముందు పేర్లు, ప్రాముఖ్యం దెబ్బతినకుండా కొత్తపేర్లను పాతవాటికి చేర్చారు. ఇప్పుడు తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో, జిల్లాల చారిత్రక నేపథ్యం దెబ్బతినకుండా ఉండాలంటే వాటికి ముందు కొత్తపేర్లను చేర్చినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు.