తెలంగాణ

ప్రజల దృష్టి మళ్లించేందుకే కొత్త జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, మే 16: రాష్ట్రంలో నెలకొన్న కరవుపై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ప్రజల దృష్టి మళ్ళించేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త జిల్లాల ప్రకటన చేశారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులపై ఆ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు. ఎన్నికలకు ముందు ఎనె్నన్నో హామీలిచ్చిన సిఎం ‘ఏరుదాటినంక తెప్పతగలేసిన చందం’గా వ్యవహరిస్తూ, ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే, రైతుల రెండు కళ్ళైన దుక్కిటెడ్లకు, పాడి గేదెలకు సైతం తాగునీరు లభించక కబేళాలకు తరలుతుంటే,‘ రోమ్‌నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్న నీరో చక్రవర్తి’ తీరును కెసిఆర్ ప్రదర్శిస్తున్నారన్నారు. అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం ధనిక రాష్ట్రం మనదేనని గొప్పలు చెప్పి, నేడు రూ.1.80 లక్షల కోట్ల అప్పులు తెచ్చి, ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టారని విమర్శించారు. ఒక్కో ఇంటిపై తలసరి అప్పు రూ.1.80 లక్షలు బలవంతంగా రుద్దుతున్నారని మండిపడ్డారు. ఒంటెద్దుపోకడలతో, నాటి నైజాం నియంతృత్వ వైఖరిని ప్రదర్శిస్తూ, ప్రశ్నించే గొంతు లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. నయానోభయానో తన పంచన చేర్చుకుంటూ ప్రాంతీయ, జాతీయ పార్టీలు రాష్ట్రంలో లేకుండా చేస్తున్నారని, రాబోయే రోజుల్లో కెసిఆర్ వైఖరికి అడ్డుకట్ట వేసేందుకు బిజెపియే ప్రత్యామ్నాయమన్నారు. నైజాం రాజులకు పట్టిన గతే కెసిఆర్‌కు కూడా తప్పదని ఆయన హెచ్చరించారు. కేంద్రం విడుదల చేసిన రూ.791 కోట్ల కరవు నిధులను కూడా ఖర్చుచేయడంలో రాష్ట్రం మీనమేషాలు లెక్కిస్తుండడం శోచనీయమన్నారు. కేంద్రానికి తప్పుడు సమాచారమిస్తూ, స్థానిక సంస్థలకు నేరుగా విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ, ఇతర అవసరాలకు వినియోగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూపాయికి కిలోబియ్యం పథకంలో రూ.27ల సబ్సిడీ కేంద్రమే భరిస్తుండగా, కేవలం రూ.2 సబ్సిడీ మాత్రమే రాష్ట్రప్రభుత్వం భరిస్తూ, గొప్పలు చెప్పుకుంటుండడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనమన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలయ్యేవరకు ప్రభుత్వాన్ని నీడలా వెంటాడతామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అంతకుముందు జిల్లా నలుమూలలనుంచి వచ్చిన వేలాదిమంది కార్యకర్తలు స్థానిక సర్కస్‌గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. నాలుగు గంటలపాటు నిర్వహించిన ఈ కరవు ధర్నాలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, బల్మూరి వనిత, మాజీ ఎమ్మెల్యేలు కాసీపేట లింగయ్య, ఎండల లక్ష్మినారాయణ, చందుపట్ల జంగారెడ్డిలతో పాటు పలువురు ప్రసంగించారు.

చిత్రం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నాలో పాల్గొన్న బిజెపి నాయకులు