తెలంగాణ

ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ‘నామినేటెడ్’ భర్తీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ఎప్పటికప్పుడు ఏదో కారణంగా రెండేళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన నామినేటెడ్ పదవుల పందేరానికి ఎట్టకేలకు ఈనెలాఖరులో శ్రీకారం చుట్టడానికి రంగం సిద్థమైంది. ఈ నెల 19న పాలేరు ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి నామినేటెడ్ పదవుల నియామకం ప్రారంభించి నెలాఖరుతో ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మే నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు ఖమ్మంలో జరిగిన పార్టీ ప్లీనరీ వేదికపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే మే మొదటి వారంలోనే ఈప్రక్రియను ప్రారంభించి నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఒకటి రెండు పోస్టుల భర్తీతోనే ఆగిపోయింది. ఆర్టీసి చైర్మన్‌గా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మిషన్ భగీరథ చైర్మన్‌గా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఇద్దరీ నియామకం మాత్రమే జరిగిన విషయం తెలిసిందే. పాలేరు ఉప ఎన్నికలకు మంత్రులు, ఎమ్మెల్యేలకు మండలాల వారిగా ప్రచార బాధ్యతలను అప్పగించడంతో వారు స్థానికంగా లేని సమయంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వద్దని ఆపివేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. పైగా ఉప ఎన్నికలపై పార్టీ సారించిన దృష్టిని నామినేటెడ్ పోస్టుల భర్తీతో మళ్లించినట్టు అవుతుందని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఈ వర్గాల సమాచారం. రాష్టస్థ్రాయిలో భర్తీ చేయనున్న కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని, ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ వస్తుందని చెబుతున్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెల జూన్ 2 నాటికి రెండేళ్లు గడుస్తుండటంతో, ఇక ఎంతమాత్రం నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇక ఎంత మాత్రం తాత్సారం తగదని ముఖ్యమంత్రి స్వయంగా పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నెల 19వ తేదీన పాలేరు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి రాష్ట్ర, జిల్లాస్థాయి నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఏకకాలంలో ప్రారంభం అవుతుందని పార్టీ వర్గాల సమాచారం. జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, గ్రంధాలయ సంస్థల పాలక వర్గాల నియామకం జరుగుతుందని తెలిసింది. వీటి భర్తీకి జిల్లాల నుంచి ఇప్పటికే పార్టీ అధిష్టాన వర్గానికి ప్రతిపాదనలు అందినట్టు సమాచారం. వీటి భర్తీపై వివాదాలకు తావులేకుండా సంబంధిత జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సమావేశమై చర్చించిన తర్వాతనే ప్రతిపాదనలను పార్టీ అధిష్టానానికి చేరినట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టులకు చాలా మటుకు రెండేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంది. ఈ దఫా ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాల కాలపరిమితి మిగిలి ఉండటంతో నియామకం జరిగే పోస్టులన్నీ మరొక టర్మ్ కూడా కొనసాగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ నియామకాలు వచ్చే ఎన్నికల్లో పార్టీని మరోసారి అధికార పీటంపై కూర్చొబెట్టకలిగిన శక్తియుక్తులు కలిగిన నేతలకే దక్కేవిధంగా కసరత్తు జరిగిందని పార్టీ సంస్థాగత వ్యవహారాలను పర్యవేక్షించే నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. నామినేటెట్ పోస్టుల భర్తీతో పాటు రాజ్యసభకు రాష్ట్రం నుంచి ఖాళీ కాబోతున్న రెండు స్థానాలకు రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులను ముఖ్యమంత్రి ప్రకటించనున్నారని తెలిసింది. శుక్రవారం నుంచి ఫామ్ హౌస్‌లోనే ఉండిపోయిన ముఖ్యమంత్రి కెసిఆర్, అక్కడనే రాజ్యసభ సభ్యుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలిసింది.