తెలంగాణ

పలు జిల్లాల్లో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/ఆదిలాబాద్/మెదక్/నిజామాబాద్, మే 7: కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. కరీంనగర్‌లో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతోపాటు బలమైన ఈదులుగాలులతో వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంబాలు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు లోతట్టు కాలనీలు జలమయం కాగా, కాలనీ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సుమారు అరగంట పాటు భారీ వర్షం కురిసింది. ఆ తరువాత జల్లు మాదిరిగా పడింది. దీంతో రోడ్లు సైతం జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలుచోట్ల చిరు నుంచి ఓ మోస్తరు వరకు వర్షం పడింది. కాగా, జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సూచించారు. వర్షం కురుస్తున్న సమయంలో పాత ఇళ్లు, ముఖ్యంగా ప్రమాదంగా ఉండే ఇళ్లల్లో ఉండకూడదని, బహిరంగ ప్రదేశాల్లో తిరగరాదని సూచించారు. అలాగే అధికారులు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
భారీ వర్షంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
ఆదిలాబాద్, భైంసా డివిజన్లలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి రబీ పంటలకు తీరని నష్టం వాటిల్లింది. పెనుగాలులతో కురిసిన భారీ వర్షానికి మామిడి పంట నేలరాలగా, జొన్న, మొక్కజొన్న, గోధుమ పంటలకు నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ పట్టణంలో మూడు గంటలపాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్, తాంసి, జైనధ్, గుడిహత్నూర్, ఇచ్చోడ, భైంసా డివిజన్‌లోని భైంసా, ముధోల్, లోకేశ్వరం మండలాల్లో వర్షం కురిసింది. లోకేశ్వరంలో పిడుగుపాటుకు సాయన్న (48) అనే వ్యక్తి మృతి చెందాడు. మెదక్ జిల్లా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో శనివారం వడగళ్లతో కూడిన భారీ వర్షం పడింది. వర్షంతో జనజీవనం అతలాకుతమైంది. మామిడి, జొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
మోర్తాడ్‌లో గాలివాన బీభత్సం
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. అరగంట వ్యవధిలోనే ఆకాశం మేఘావృతమై విపరీతమైన వేగంతో గాలులు వీస్తూ వర్షం ప్రారంభమైంది. భారీ ఈదురు గాలులకు ఇళ్ల్ల పైకప్పులుగా ఉన్న పెంకులు కూడా లేచిపోయాయి. పద్మశాలి రోడ్డులోని రెండు భారీ వృక్షాలు ఈదురు గాలులకు నేలకూలడంతో అవికాస్తా విద్యుత్ స్తంభాలపై పడిపోయాయి. దీంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. మార్కెట్ రోడ్‌లోనూ రెండు వృక్షాలు నేలకూలగా, ఇదే పరిస్థితి ఏర్పడింది. రెండు వీధుల్లోనూ విద్యుత్ స్తంభాలు విరిగిపోయి విద్యుత్ వైర్లు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. భారీ ఈదురు గాలులకు పంట పొలాల్లో ఎండబెట్టిన సజ్జ మొత్తం కొట్టుకుపోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
హైవేపై స్తంభించిన ట్రాఫిక్
ఇదిలా ఉండగా, శనివారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలులకు మండలంలోని గాండ్లపేట వద్ద గల జాతీయ రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. మోర్తాడ్ విద్యుత్ సబ్ స్టేషన్‌కు కరెంట్ సరఫరా చేసే ప్రధాన లైన్ తెగిపోయింది. రోడ్డుకు అడ్డంగా వృక్షం పడిపోవడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. మోర్తాడ్ బస్తాండ్ వద్ద గల ఎస్సీ, బిసి కాలనీలోనూ ఎనిమిది వృక్షాలు కూకటివేళ్లతో పెకిలించుకుపోయాయి. చెట్లన్నీ విద్యుత్ వైర్లపై పడటంతో అధిక సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.