సంపాదకీయం

విశ్రమించని తోడేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛత్తీస్‌గఢ్‌లో పదహారు మంది గ్రామీణులను మావోయిస్టులు బుధవారం నాడు హత్య చేయడం భద్రతా వైఫల్యానికి ఘోరమైన సాక్ష్యం. తెలంగాణ, ఛత్తీగఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో అనేక రోజులుగా ఉమ్మడి గాలింపులు జరుపుతున్న ఉభయ రాష్ట్రాల పోలీసులు ఈ దారుణాన్ని ముందుగా పసికట్టలేకపోవడం మారణ కాండకు దారితీసిన విపరిణామం. పోలీసులు భద్రతాదళాల వారు తమను రక్షిస్తారన్న ధైర్యం గ్రామీణుల్లో అడుగంటిపోవడానికి ఇలాంటి వైపరీత్యాలు నిదర్శనం. ఛత్తీస్‌గఢ్‌లో తెలంగాణకు సరిహద్దు ప్రాంతంలో నక్కి ఉన్న నక్సలైట్లను ఉభయ రాష్ట్రాల పోలీసుల దిగ్బంధంలో ముంచెత్తినట్టు ఆర్భాటంగా ప్రచారమైంది. ఈ దిగ్బంధం ఫలితంగా కింది స్థాయి మావోయిస్టులు భారీసంఖ్యలో సాయుధ సమర సిద్ధాంతానికి స్వస్తి చెప్పినట్టు కూడ ప్రచారమైంది. కానీ తాము విశ్రమించడం లేదని పారిపోవడం లేదని నక్సలైట్లు చాటుకుంటున్నారు! సాయుధులైన పోలీసులతోను భద్రతాదళాలతోను భయంకర రీతిలో తలపడుతున్న మావోయ్టిలకు నిరాయుధులైన పల్లె ప్రజలను పొట్టన పెట్టుకోవడం సులభమైన వ్యవహారం. ఈ సంగతి తెలిసినప్పటికీ ఈ పదహారు మంది ప్రాణాలను ఉభయ రాష్ట్రాల ఉమ్మడి బలగాలు కాని, కేంద్ర ప్రభుత్వ భద్రతా దళాలు కాని రక్షించలేకపోవడం క్రూరమైన అధికార నిర్లక్ష్యం...ఊహించని చోట, హఠాత్తుగా మావోయిస్టులు గ్రామీణులపై దాడి చేయలేదు. మార్చి నెల పొడుగునా ప్రతీకార చర్యలకు పాల్పడాలని మావోయిస్టులు నిర్ణయించినట్టు పోలీసులే చెబుతున్నారు. గ్రామీణులను మావోయిస్టులు చంపడానికి ముందు రోజున ఉభయ రాష్ట్రాల సరిహద్దులలోని గొట్టెపాడు ప్రాంతంలో మావోయిస్టులకు ఉభయ రాష్ట్రాల పోలీసులకు మధ్య సంకుల సమరం జరిగింది. ఎనిమిది మంది మావోయిస్టులు హతులయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తం కావలసిన నిఘా చక్కగా నిద్రపోయింది. ఈ నిర్లక్ష్యం వల్లనే తోడేళ్లు ఆవుల మందలలోకి చొరబడినట్టుగా నక్సలైట్లు అనేక గ్రామాలలోకి చొరబడి రాక్షసకాండను జరుపగలిగారు. అనేక గ్రామాలకు వెళ్లగలిగిన మావోయిస్టులు తాపీగా తాము చంపదలచిన వారిని ఎంచుకొని నిర్బంధించి తమ గుహలలోకి తరలించుకొని పోయారట. పోలీసులు తమను పసికట్టి అడ్డగించగలరన్న భయం నక్సలైట్లకు లేకపోవడం ప్రభుత్వ నిఘా వైఫల్యానికి విస్మయకరమైన నిదర్శనం. గొట్టెపాడు ప్రాంతంలో ఒక గ్రామీణుడిని గత నెలలో చంపేశారట. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి సైతం గ్రామీణులు ముందుకు రాలేదు. హత్య గురించి ఫిర్యాదు చేసినట్లయితే నక్సలైట్లు మరింత మందిని చంపేస్తారన్న భయం గ్రామీణులను ఆవహించి ఉంది మరి. మావోయిస్టు పీడిత ప్రాంతాలలోని నిరాయుధ నిస్సహాయ ప్రజలకు భద్రతా భావాన్ని కలిగించడంలో ప్రభుత్వాలు ఇలా విఫలమయ్యాయి. నక్సలైట్ల సమాంతర పాలన మళ్లీ మొదలైపోయిందన్నది ఈ బీభత్సకాండ వల్ల తేటతెల్లమైంది. ఇలా ఫిర్యాదు సైతం చేయని గ్రామీణులను పోలీసుల ప్రతినిధులుగా ముద్రవేసి, 16 మందిని పొట్టన పెట్టుకొనడం మావోయిస్టుల పైశాచిక స్వభావానికి మరో ఉదాహరణ!
మావోయిస్టుల బీభత్స కాండను తుదముట్టించడానికి జరుగుతున్న ప్రభుత్వ ప్రయత్నాలలో వైరుధ్యాలు నిహితమై ఉన్నాయి. మావోయిస్టులు నానాటికీ బలం పుంజుకుంటుండటానికి ఈ వైరుధ్యాలు కారణం. మావోయిస్టులు పేట్రేగి పోవడానికి కారణం ఆర్థికపరమైన వెనుకబాటుతనమని ప్రభుత్వమే ప్రచారం చేస్తుండడం ప్రధానమైన వైరుధ్యం. మావోయిస్టు పీడిత ప్రాంతాల్లో ప్రగతి సంక్షేమ పథకాలను అమలు జరపడం వల్ల మావోయిస్టులు, సంతృప్తి చెంది హింసాకాండను మానుకుంటారన్నది కేంద్ర ప్రభుత్వాలు అనేక ఏళ్లుగా లోనయి ఉన్న భ్రమ. ప్రజలకు సైతం ఈ భ్రమను కల్పించడానికి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటిస్తున్న పథకాలు దోహదం చేశాయి. పేదరికాన్ని తొలగించడం కోసం మాత్రమే మావోయిస్టు సాయుధ బీభత్సకాండకు పూనుకున్నారన్న భ్రాంతి ప్రజలకు సైతం ఏర్పడడానకి ప్రభుత్వం వారి ఈ ఆర్థిక వ్యూహం దోహదం చేసింది మావోయిస్టులు హింసాగ్ని జ్వాలలను రగించిన ప్రాంతాలలో మాత్రమే ప్రభుత్వాలు ప్రగతి పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను అమలు జరుపుతాయన్న అపప్రథ ఏర్పడడానికి సైతం ఈ ఆర్థిక వ్యూహం దోహదం చేసింది, చేస్తోంది. ‘పాపం మావోయిస్టులు పేదరికాన్ని తొలగించడం కోసం పోరాడుతున్నారు..’ అన్న సానుభూతిని ప్రభుత్వం ఆర్థిక పథకాల ప్రచారం వల్ల కల్పిస్తోంది. ‘‘మావోయిస్టులు పోరాడక పోయినట్టయితే ప్రగతి సంక్షేమ పథకాలు అమలు జరగవు..’’ అన్న అపకీర్తిని సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూట గట్టుకున్నాయి...
పేదరికాన్ని తొలగించడానకి నిరంతరం కృషి చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ విధి. దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులైన అన్నార్తుల ఇళ్లముందు ప్రగతి ఫలాలనిచ్చే వెనె్నల వృక్షాలు పెరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి విజయం! ఈ సామాజిక న్యాయ సాధనకోసం ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలలో అన్ని జిల్లాలో అన్ని పల్లెలలో బస్తీలలో సకారాత్మకంగా కృషి చేయాలి. ఒక్క నిరుపేద ఆకలితో అలమటించినప్పటికీ ఆ పాపం సమష్టి సమాజానిదని శతాబ్దికి పూర్వం వివేకానంద స్వామి చాటి చెప్పడానికి ఈ సకారాత్మక-పాజిటివ్-ప్రవృత్తి కారణం. కానీ కేవలం నక్సలైట్లు బీభత్స కాండ సాగిస్తున్న జిల్లాలలో మాత్రం ప్రత్యేక పథకాలను అమలు జరుపాలన్న విధానం నకారాత్మకం-నెగిటివ్ యాటిట్యూడ్- మావోయిస్టుల పీడ, జిహాదీల ప్రమాదం ఏర్పడడం లేదా తొలగిపోవడం ప్రభుత్వాల ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాతిపదిక కారాదు. 2009లో మావోయిస్టులను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇలా నకారాత్మక ప్రగతి సంక్షేమ ప్రచారం మొదలు పెట్టింది. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఈ భ్రాంతి నుండి బయటపడాలి. పేదరికం విస్తరణతోకాని, పేదరికం నిర్మూలనలో కాని మావోయిస్టు బీభత్సకాండకు సంబంధం లేదన్న వాస్తవాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. మావోయిస్టులు చైనా ప్రభుత్వ ప్రేరణతో మనదేశంలో కల్లోలం సృష్టిస్తున్న సాయుధ ఉగ్రవాదులు...అందువల్ల మన దేశానికి వ్యతిరేకంగా చైనా ప్రభుత్వం రూపొందించిన ప్రచ్ఛన్న దురాక్రమణ వ్యూహాన్ని మావోయిస్టులు అమలు జరుపుతున్నారు. 2050వ సంవత్సరం నాటికి మన దేశంలోని ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థను నిర్మూలించి కొత్త రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని మావోయిస్టులు ప్రకటించి ఉన్నారు. అందువల్ల చైనా ప్రతినిధులైన మావోయిస్టులు సాగిస్తున్న బీభత్స కాండను ప్రభుత్వం ఆయుధాలతో మాత్రమే తుదముట్టించవలసి ఉంది..
ఇలా తుదముట్టించడానికి సైనిక దళాలను రంగంలోకి దింపడం మాత్రమే సరైన విధానం కాగలదు. చైనా మద్దతుతో భారీ ఆయుధ సామగ్రిని సంపాదించుకొని భయంకరంగా విస్తరించిపోయిన మావోయిస్టులను ఎదుర్కొనడం రాష్ట్ర ప్రభుత్వాల పోలీసులకు సాధ్యం కాని పని అని ఎప్పుడో తేలిపోయింది. కేంద్ర పోలీసులు, ప్రత్యేక భద్రతా దళాలు కూడ విఫలం కావడం చరిత్ర. ఏది ఏమైనప్పటికీ మావోయిస్టులకు వ్యతిరేకంగా సైనిక దళాలను మోహరించరాదన్న విధానం వందలాది పోలీసులను మావోయిస్టుల బీభత్స కాండకు బలి చేసింది. ఇప్పుడైనా విజ్ఞత వికసించాలి. కేంద్ర ప్రభుత్వం విధానాన్ని మార్చుకోవాలి..