తెలంగాణ

ఉసురు పోసుకోకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 30: ఆంధ్ర పార్టీల నేతలు రాజకీయ పబ్బం కోసం చిల్లర రాజకీయాలకు దిగుతున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా దీక్షకు దిగుతాననడం సిగ్గుమాలిన చర్య, దుర్మార్గమైన నిర్ణయమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ మే 16 నుంచి 18 వరకూ మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేస్తానని వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రకటించడంపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ పర్యటనలో ఉన్న మంత్రి హరీశ్, జగన్ నిర్ణయంపై ఘాటుగా స్పందించారు. శనివారం మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టు ప్రకటించారు. ఆంధ్ర నేతలు తమ రాజకీయ పబ్బం కోసం మరోసారి తెలంగాణ ప్రజలను దగా చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఎలాగైనా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు జగన్‌తోపాటు చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశారని, ఇప్పుడు జగన్ మరో కుట్రకు తెరలేపుతున్నాడని మండిపడ్డారు. వెయ్యిమంది జగన్లు వచ్చినా, వందమంది బాబులొచ్చినా పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తీరుతామని, ఎవరు అడ్డొస్తారో చూస్తామని హరీశ్ హెచ్చరించారు. తాను పాలమూరు ప్రజల తరపున జగన్‌కు చేతులెత్తి నమస్కరిస్తున్నానని, పథకాన్ని అడ్డుకుని పాలమూరు ప్రజల ఉసురు పోసుకోవద్దన్నారు. కరవుతో అల్లాడుతూ ఓపక్క జనం వలసలు, మరోపక్క రైతుల ఆత్మహత్యలతో కుదేలవుతున్న జిల్లాకు నీళ్లివ్వకూడదని జగన్ చెప్పడం దుర్మార్గమైన విషయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన జీవో ఆధారంగా పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నామని, పనులకు ఇలా శ్రీకారం చుట్టామో లేదో ఆంధ్ర పార్టీల నేతలు అప్పుడే కడుపుమంటతో తెలంగాణ ప్రజల కడుపుకొట్టేందుకు కుట్రలకు తెరలేపుతున్నారని, ఎత్తిపోతలను ఆపడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రలో జగన్‌కు ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలపై దీక్ష చేస్తే బాగుంటుదంని మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు. మానవత్వంవున్న వారు ఏ ఒక్కరూ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని చెప్పరని అంటూ, జగన్‌ను మానవత్వం లేని వ్యక్తిగా అభివర్ణించారు. మీ నాన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన జలదోపిడీని ఇంకా తెలంగాణ ప్రజలు మరిచిపోలేదు. తండ్రికి తగిన తనయుడివి. నువ్వు కూడా తెలంగాణ రైతాంగం కడుపు కొట్టేందుకు పూనుకున్నావు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాంద్రీ-నీవా, గాలేరు, పోతిరెడ్డిపాడుకు అనుమతులు ఉన్నాయా? అని మంత్రి హరీశ్‌రావు జగన్‌ను ప్రశ్నించారు. ఎవరి హయంలో ఈ ప్రాజెక్టుల నంచి అక్రమంగా కృష్ణా జలాలు తరలించుకుపోయి నీటిని వాడుకున్నారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలను తెలంగాణకు దక్కకుండా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన దుర్మార్గాలు ఇన్నీ అన్నీ కావన్నారు. ప్రస్తుతం తామేమీ నిస్సహాయులం కాదని, తమకంటూ తెలంగాణ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని జగన్ గుర్తెరగాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లో పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తీరుతామని అంటూ, పథకంతో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఉద్ఘాటించారు. ఒక్క పాలమూరు జిల్లాలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా 8 లక్షల ఎకరాలతోపాటు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల ద్వారా మరో 12 లక్షల ఎకరాలకు కృష్ణా జలాలు తీసుకొచ్చి 20 లక్షల ఎకరాల్లో పంటలు పండేలా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. ఆంధ్ర నేతలకు భయపడేది లేదని, ఇప్పటికైన జగన్ తన దీక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదని సూచించారు. లేదంటే జగన్‌కు మరోసారి మానుకోట దుస్థితి తలెత్తుతుందని, ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త వహించాలని హితవు పలికారు. మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, రాంమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మహబూబ్‌నగర్‌లో జగన్‌పై విరుచుకుపడుతున్న మంత్రి హరీశ్‌రావు