తెలంగాణ

పాలనకు కొత్త కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి అధికార నివాసం, కార్యాలయం, సమావేశ మందిరాలతో కూడిన నూతన భవన సముదాయానికి సిఎం కె చంద్రశేఖర్‌రావు శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. నూతన భవన నిర్మాణం పూరె్తైన తరువాత సిఎం కెసిఆర్ ఇక్కడి నుంచే పాలన సాగిస్తారు. మంత్రివర్గ భేటీలు, కలెక్టర్లతో సమావేశాలు, ముఖ్య అధికారులతో జరిగే సమీక్షలు.. అన్నీంటికి ఇదే కేంద్రం కాబోతోంది. సచివాలయానికి సిఎం తక్కువగా వస్తున్నారు. కేబినెట్ సమావేశం వంటిది జరిగినప్పుడు తప్ప సచివాలయానికి రావడం లేదు. నూతన భవన నిర్మాణం పూర్తయ్యాక పాలనా కేంద్రంగా ఈ భవనం నిలుస్తుంది. పంజాగుట్టలో ప్రస్తుత క్యాంపు కార్యాలయం పక్కన ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలంలో ఆధునిక సౌకర్యాలతో సిఎం కార్యాలయం నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న క్యాంపు కార్యాలయంలో సమావేశాలు నిర్వహించడానికి ఏమాత్రం అనువుగా లేదని, సందర్శకులను కలుసుకోవడానికి అనువుగా లేనందున నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించినట్టు అధికార ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత జూబ్లీహాల్‌ను ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశానికి కేటాయించారు. దీంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నా, ఇతర ముఖ్య సమావేశాలు నిర్వహించాలన్నా అనువైన సమావేశ మందిరం లేకుండాపోయింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ హోటళ్లలో పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందని అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించాలంటే జెన్‌టియుకో, అగ్రికల్చర్ యూనివర్సిటీకో పోవలసిన పరిస్థితి ఉంది. మిషన్ కాకతీయ సమావేశం జెన్టీయులో, మిషన్ భగీరథ సమావేశం అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించాల్సి వచ్చింది. మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడు మంత్రులు భోజనాలు చేయడానికి బయట హోటళ్లకు వెళ్తున్నారు. అన్ని సమావేశాలకు ఉపయోగపడేలా సమావేశ హాలును సిఎం అధికార నివాసంలోకానీ, సచివాలయంలోకానీ లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని అంటున్నారు. సిఎం తన అధికారిక నివాసంలో ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తారు. విధాన నిర్ణయాలు చేయడం కోసం పరిపాలన సమన్వయం కోసం ముఖ్య అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. దీనికోసం ఎంసిఆర్ హెచ్‌ఆర్‌డికో మరోచోటుకో పోవాల్సి ఉంటుందని అంటున్నారు. సిఎంను కలవడానికి ఇతర రాష్ట్రాల అధికారులు, మంత్రులు, సిఎంలు, కేంద్ర మంత్రులు, దేశ విదేశ ప్రముఖులు వస్తారు. వీరి కార్లు క్యాంపు కార్యాలయంలో పార్క్ చేసే పరిస్థితి లేదు. ప్రస్తుత క్యాంపు కార్యాలయంలో ఒక్క సిఎం కారు తప్ప మిగితా కార్లు పట్టవు. ఐదువందల మంది వస్తే నిలుచునే పరిస్థితి కూడా లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రతి రోజూ సమావేశాలు నిర్వహించడానికి వీలుగా కనీసం వెయ్యిమంది కూర్చునే సమావేశ మందిరంతో కూడిన సిఎం అధికారిక నివాసం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆర్ అండ్ బి ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. సిఎం అధికారిక నివాసం, కార్యాలయం, సమావేశ మందిరం ఉండేలా పంజాగుట్టలోని 8.9 ఎకరాల స్థలంలో భవనం నిర్మిస్తారు. నిజాం రాజులు హైదరాబాద్‌కు లక్షల ఎకరాల భూమి వదిలిపోతే, కనీసం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించుకోవడానికి అవసరమైనంత స్థలంలేని పరిస్థితి ఏర్పడిందని సిఎం కార్యాలయం వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అందుబాటులోని భూమిలోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి అధికారిక నివాసన సముదాయానికి సిఎం శకుస్థాపన చేసినట్టు తెలిపారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్ అండ్ బి శాఖ ముఖ్యకార్యదర్శి సునీశ్ శర్మ, సిఎంఓ అధికారులు పాల్గొన్నారు. నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో సిఎం దంపతులు, సిఎంఓ కార్యాలయ అధికారులు మినహా ఇతరులు పాల్గొనలేదు.

చిత్రం... ముఖ్యమంత్రి అధికార నివాస, పాలనా కేంద్రానికి భూమి పూజ చేస్తున్న కెసిఆర్ దంపతులు