సబ్ ఫీచర్

అవును.. మనం సాధించగలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం మారుతోంది, వేగంగా మారుతోంది. భారతదేశంలో మిగతా దేశాల్లోకన్నా ఎక్కువ యువత ఉంది. దాంతో భారతదేశ ప్రగతి వేగవంతం కాబోతోంది. వర్తమాన యువత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టి అద్భుతాలు సృష్టించే అవకాశాలు దండిగా ఉన్నాయి. దేశంలో బుల్లెట్ రైలు రాబోతోంది. విమానాశ్రయాలు మరిన్ని నిర్మాణమవుతున్నాయి.
ప్రపంచ గతిని మార్చిన మొదటి రెండవ పారిశ్రామిక విప్లవాలను భారతదేశం ఆలింగనం చేసుకోబోయింది. ప్రధాన కారణం విదేశీ పాలన. ఇక మూడో పారిశ్రామిక విప్లవంలో భారత్ నామమాత్రపు పాత్రనే పోషించింది. ఇప్పుడు నాల్గవ పారిశ్రామిక విప్లవాన్ని భారతదేశం తన భుజాలపై వేసుకున్నంత బాధ్యతతో వ్యవహరిస్తోంది. దాంతో అనూహ్యంగా ఫలితాలు రానున్నాయి. ఇప్పుడు ఎక్స్‌పొనెన్షియల్... పెద్ద పెద్ద అంగలు వేస్తూ యువత అభివృద్ధిని సాధించనున్నదని నిపుణుల అంచనా. కొత్త మానసిక స్థితి (మైండ్ సెట్)తో, సాధికారత సాధిస్తూ గతంలో ఎన్నడూ లేనంత శీఘ్రంగా, నాణ్యతతో, బాధ్యతాయుత పురోభివృద్ధి సాధించే ప్రక్రియలో యువతరం ఉందని నిపుణుల భావన. ముఖ్యంగా అంకుర సంస్థలు ఏర్పాటుచేసి కొత్త సవాళ్ళను స్వీకరిస్తూ వాటి పరిష్కారాలను కనుగొంటూ తమ సత్తాచాటే ప్రక్రియలో యువత కనిపిస్తోంది.
వ్యవసాయ రంగంవైపు కనె్నత్తి చూడని వారిప్పుడు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామాలను తీసుకొచ్చేందుకు అంకుర సంస్థలు అనేకం పనిచేస్తున్నాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, వినూత్నరీతిలో దిగుబడిని పెంచి, దేశ ఆర్థిక వ్యవస్థను సత్తువ తీసుకొచ్చే పనిలో యువత కనిపిస్తోంది. అలాగే పాఠశాల విద్య, ఆరోగ్య రంగాల్లోనూ అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వౌలిక సదుపాయాల కల్పన చాలా పెద్దఎత్తున జరుగుతోంది. దీని వెనకాల వర్తమాన టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ ఉండటంవల్ల వేగం కనిపిస్తోంది... ఫలితాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో గణనీయమైన మార్పును తిలకించవచ్చు. అనేక ఆవిష్కరణలకోసం అంకితమై పనిచేసేవారి సంఖ్య పెరిగింది. ప్రతీది సృజనాత్మకంగా, అధునాతనంగా, టెక్నాలజీ ఆధారంగా రూపకల్పన చేయడం, ఆవిష్కరించడంవల్ల ఆర్థిక చలన గతులు వేగం పెరుగుతోంది. తమపై తమకు విశ్వాసం, సకారాత్మక దృష్టి, మానవీయ కోణం, ఇట్లా సమీకృత అవగాహనతో అడుగులువేస్తూ యువత ఆదర్శంగా నిలుస్తోంది.
అనుభవజ్ఞులు, పెట్టుబడులు సమకూర్చే ఏంజెల్స్, మార్కెట్ విశే్లషకులు... అందరూ యువతపైనే భరోసా పెట్టుకున్నారు. పాతిక సంవత్సరాలలోపుగల వారి ఆలోచన. వేగం, ధృతి, పట్టుదల, ఆవిష్కరణల గుణం ఇత్యాది లక్షణాల కారణంగా వారిపై ఆశలు పెట్టుకుంటున్నారు. ‘జియో’లాంటి ఆధునిక సంస్థల్లో వేలాది మంది పాతికేళ్ళలోపువారే పనిచేస్తున్నారని ఆ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. జియో విజయానికి ఆ యువతనే కారణమని కూడా ఆయన నిర్ద్వంద్వంగా పేర్కొన్నారు.
ఇప్పుడు ప్రపంచమంతటా ఇదే ఒరవడి కొనసాగుతోంది. నిశ్శబ్దంగా వారు గొప్ప విప్లవాన్ని సృష్టిస్తున్నారు. మానవాళి గతంలో ఎన్నడూ లేనంత సౌకర్యవంతంగా జీవించేందుకు అనువైన వాతావరణం ఏర్పడుతోంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. హక్కులు కాపాడబడుతున్నాయి. జ్ఞానం అందరి దరికి చేరుతోంది. ఎక్కువ కష్టపడి తమ సత్తా చాటేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఒకప్పుడు ఈ అవకాశం లేదు... కాని ఇప్పుడు ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. కోల్‌కతాలో నీటి అడుగుభాగాన మెట్రోరైలు నడుస్తుంది...
ఐడియా, ఆలోచన సరికొత్త ఆలోచన ఉంటే రాకెట్‌లా దూసుకుపోవచ్చని అందరూ చెబుతున్నా అంగీకరిస్తున్న విషయం. పెట్టుబడి పెట్టేందుకు అనేక సంస్థలు... వ్యక్తులున్నారు. ఆ వాతావరణం కనిపిస్తోంది. మార్కెట్లో పుష్కలంగా నిధులున్నాయి. ఈ కొత్త వాతావరణాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అనేక అంకుర సంస్థలు తమతమ రంగాల్లో విశేషంగా కృషి చేస్తున్నాయి. ఫలితాలు సాధిస్తున్నాయి. పెద్దపెద్ద సవాళ్ళను స్వీకరించి వాటిని జయించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మారిన మానసిక స్థితి (మైంట్ సెట్) అని పరిశీలకుల అభిప్రాయం. నూతన ఆలోచనలకు, ఆచరణకు దృక్కోణానికి గేట్లుతెరవడంవల్ల ప్రపంచమంతటా వినూత్నత, విభిన్నత దర్శనమవుతోంది. భారత్‌లో యువత ఎక్కువ ఉన్నందువల్ల ఆ దృశ్యం చక్కగా కనిపిస్తోంది.
ముప్ఫై ఏళ్ళక్రితం 350 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ వర్తమానంలో మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రూపాంతరం చెందిందంటే ఎంత వేగంగా వృద్ధిచెందుతున్నదో ఇట్టే ఊహించవచ్చు. పూర్తి ఆశావాదంతో భారతీయులు ముందుకు సాగుతుండటం ఇందుకు మరో కారణం. ప్రపంచంతో పోటీపడి గెలిచే సామర్థ్యం, సత్తా భారత్‌కుంది. స్మార్ట్ నగరాలు వెలుస్తున్నాయి. ఆర్థిక ఎదుగుదలకు అవి ఆలంబనగా నిలుస్తున్నాయి.
130 కోట్ల జనాభా ఏకాగ్రతతో కష్టపడి పనిచేస్తే ప్రపంచానికే భారతదేశం మార్గదర్శనంగా నిలువగలదని, కొత్త టెక్నాలజీని ఔపోసనపట్టి చరిత్ర సృష్టించే సత్తా సైతం భారత్‌కు ఉందని ఆశావాదుల విశ్వాసం. చైనాను దశాబ్దం, దశాబ్దంన్నర కాలంలో అధిగమించే అవకాశాలు భారత్‌వద్ద పుష్కలంగా ఉన్నాయని, ఆర్థికంగా సూపర్ పవర్‌గా ఉబికివచ్చే వీలుందని, ఇదెంతో గర్వించదగ్గ విషయమని నిపుణుల భావన.
డేటానే ఇంధనంగా భావించే రోజులు వస్తున్నాయి, పెట్రోలు... డీజిల్ ఇంధన వినియోగం తగ్గి సంప్రదాయేతర ఇంధన వినియోగం. వాడుక పెరగబోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు 130 కోట్ల మంది ప్రజలు సంకల్పం చెప్పుకుని సాధికారతతో కదిలితే మానవజాతి చరిత్రలో గతంలో ఎన్నడూ చూడనటువంటి ‘‘బంగారు రోజులు’’ అందుబాటులోకి వస్తాయన్న విశ్వాసాన్ని పెద్దపెద్ద తలకాయలే అంటున్నాయి... అంగీకరిస్తున్నాయి.
నేషన్ ఫస్ట్ (దేశం ముందు) అన్న భావన అత్యంత ముఖ్యమని, ప్రజాస్వామ్యం ఊపిరిగా అనూహ్య అభివృద్ధిని అతి తక్కువ సమయంలో సాధిస్తే ప్రపంచం భారతదేశాన్ని గౌరవిస్తుంది ఆదర్శంగా తీసుకుంటుంది. ఆరాధనాభావంతో తిలకిస్తుంది. అందుకుగాను గరిష్టస్థాయిలో యువత తన శక్తియుక్తుల్ని వెచ్చించాల్సి ఉంది. ఇప్పటికే ఆ ప్రక్రియలో యువత మునిగి ఉంది. నూతన తరం... నూతన యుగం... నూతన ఆవిష్కరణలతో అగ్రభాగానికి దూసుకుపోవడంలో అందరి ‘‘్భగస్వామ్యం’’ తప్పనిసరి. అప్పుడే దేశంలో చివరి వ్యక్తికి అభివృద్ధి ఫలితాలు దక్కుతాయి.
ఇందుకై మారిన టెక్నాలజీని, మానసిక స్థితిని, మానవ వనరులు, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ని రోబోలను, నైపుణ్యాలను తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడే సరైన గమనం ఏర్పడుతుంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. అవన్నీ క్రమంగా మటుమాయమవుతాయి. ఆలోచనను మార్చితే అదృష్టం మారుతుందన్న అవగాహనతో అడుగులువేస్తే ఈ చారిత్రక అవకాశాన్ని, యువతతోపాటు అందరూ ఉపయోగించుకోవడంలోనే మాన్యత ఉంది. అవును, మనం సాధించగలం. దేశంనుంచి దారిద్య్రాన్ని తరిమేయగలం... అది సాధ్యమే... అవును సాధ్యమే. ఈ సంకల్పమే నేటి నినాదం.

- వుప్పల నరసింహం, 9985781799