సబ్ ఫీచర్

మావోలకు మరోసారి దెబ్బమీద దెబ్బ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టులకు మరోసారి ఊహించని రీతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల పశ్చిమ కనుమల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించగా, ఆ కాల్పుల్లో గాయపడిన మావోయిస్టు కీలక నేత, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఒకటవ బెటాలియన్ నాయకుడు, బాంబుల తయారీలో దిట్ట అయిన దీపక్‌ను తమిళనాడు పోలీసులు కోయంబత్తూర్ సమీపంలో ఇటీవల అరెస్టుచేశారు. అక్కడి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసినపుడు అతని వద్ద సింగిల్ బ్యారెల్ తుపాకీ, మందుగుండు సామాగ్రి, మావోయిస్టు సాహిత్యం లభ్యమైనట్టు స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) పోలీసులు పేర్కొన్నారు. ఇది పెద్ద విజయంగా పోలీసులు భావిస్తున్నారు.
2016 అక్టోబర్‌లో మావోయిస్టు కీలక నాయకులు కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల కూడలిలో (పశ్చిమ కనుమల్లో) సాయుధ దళాలను నిర్మించేందుకు పూనుకున్న సమయంలో- మావోయిస్టు నాయకుడు కుప్పు దేవరాజ్, మహిళా మావోయిస్టు అజిత్ (కావేరి)లను భద్రతా బలగాలు మట్టుబెట్టాక దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన గెరిల్లాలు, నాయకులు పశ్చిమ కనుమల్లోకి ప్రవేశించారని ఆరోజుల్లోనే చెప్పుకున్నారు. అప్పటికే భవానీతో పాటు మరో రెండు నదుల పేర్లతో కొనసాగుతున్న మావోయిస్టు దళాలను పటిష్టం చేసేందుకు ప్రయత్నం జరిగింది. పశ్చిమ కనుమల మావోయిస్టుపార్టీ జోనల్ కమిటీ నాయకుడు దేవరాజ్ మృతితో స్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు దీపక్ తదితరులు పశ్చిమ కనుమలకు దండకారణ్యం నుంచి చేరుకుని ఉంటారని భావిస్తున్నారు.
అలా ట్రై జంక్షన్‌లో మావోయిస్టులు సాయుధ శిక్షణ శిబిరాలను నిర్వహించారని, స్థావరాలను బలపరచుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టారని పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే గత అక్టోబర్ 28,29 తేదీల్లో కేరళలోని అగలి అడవుల్లో ‘్థండర్ బోల్ట్’ బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించగా, దీపక్ గాయపడి తప్పించుకున్నాడు. చివరకు తమిళనాడులోని కోయంబత్తూర్ పోలీసులకు గాయాలతో చిక్కాడు.
దండకారణ్యంలో భాగమైన ఛత్తీస్‌గఢ్‌లో 2010 సంవత్సరంలో చింతల్‌నార్ ఆదివాసీ గ్రామం వద్ద మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. ఆరోజుల్లో ఆ సంఘటన పెద్ద సంచలనం సృష్టించింది. ఆ దాడిలో బీజాపూర్‌కు చెందిన దీపక్ కీలక పాత్ర పోషించాడని పోలీసులంటున్నారు. ఆ తరువాత కూడా జవాన్లపై జరిగిన అనేక క్రూరమైన దాడుల్లో అతని పాత్ర ఉందని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఆ రాష్ట్ర పోలీసులు ట్రాన్సిట్ వారంట్‌పై దీపక్‌ను ఛత్తీస్‌గఢ్ తీసుకెళ్ళి విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో కేసులో కోర్టు అతనిపై వారెంట్‌ను జారీచేసింది.
కేరళకు చెందిన ‘్థండర్ బోల్ట్’ దళాలు, తమిళనాడుకు చెందిన స్పెషల్ టాస్క్ఫోర్స్ (ఎస్‌టిఎఫ్) పోలీసులు మావోయిస్టుల కీలక నాయకులను, కార్యకర్తలను మట్టుబెట్టడంలో, అరెస్టు చేయడంలో విజయం సాధించారు. కేరళకు చెందిన మార్క్సిస్టు పార్టీ కార్యకర్తల ముసుగులో మావోయిస్టులకు సహకరిస్తున్న వారిని సైతం పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టులు సైతం అగలి ఎన్‌కౌంటర్ అనంతరం జరిగాయి. నిందితులను ‘యుఎపిఎ’ కింద అరెస్టుచేసినట్టు పోలీసులు చెప్పారు. ఇంకా ఎంతోమంది మావోయిస్టు నాయకులు- కార్యకర్తలు, సానుభూతిపరులు పోలీసుల నిఘాలో ఉన్నారు. మార్క్సిస్టు పార్టీ ముసుగులో ఉన్నా వారిని పోలీసులు వదిలిపెట్టడం లేదు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మావోయిస్టు సాయుధ దళాలకు శిక్షణ ఇచ్చే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కీలక నాయకుడు దీపక్‌ను పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోగలిగారు. ట్రై జంక్షన్‌ను మరో దండకారణ్యంలా మార్చేందుకు కంకణం కట్టుకున్న దీపక్‌ను అరెస్టుచేయడంతో భద్రతాబలగాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలోనూ సభ్యులుగా ఉన్న దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇప్పుడు బలహీనపడిందని భావిస్తున్నారు. అలాగే దండకారణ్యం నుంచి సైలెంట్ వ్యాలీకి స్థావరం మార్చాలన్న మావోల ఆలోచనకు సైతం గండిపడినట్టు పోలీసులు చెబుతున్నారు. అగలి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లభ్యమైన డిజిటల్ గాడ్జెట్స్‌లోని సమాచారాన్ని డీకోడ్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అలాగే లభ్యమైన ఎ.కె.47 లాంటి కీలక ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూపీ లాగుతున్నారు. ఓ సంఘటన అనేక అంశాలను వెలికితీసేందుకు ఉపకరిస్తుంది. అలాగే దీపక్ అరెస్టు ఇప్పుడు అనేక కీలక అంశాలు బయల్పడేందుకు అవకాశం చిక్కింది. మావోయిస్టుల ప్రధాన స్థావరంగా భావిస్తున్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం ఏడుగురు మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిపై రూ.13 లక్షల రివార్డు ఉందని తెలుస్తోంది.
మావోల చేతిలో డ్రోన్లు!
మావోయిస్టులు అధునాతన టెక్నాలజీ ఆధారంగా తన ‘‘శత్రువు’’ను దెబ్బతీయాలని నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మావోలు ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో సిఆర్‌పిఎఫ్ బలగాల క్యాంపుల-శిబిరాల గురించి లోతైన సమాచారం తెలుసుకుని ఆ సమాచారం ఆధారంగా మెరుపుదాడులు చేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నట్టు వెల్లడైంది. తొలిసారిగా ఇలాంటి విషయం భద్రతా బలగాల దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు శిబిరాల సమీపంలో ఎగిరే డ్రోన్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. కిస్తారామ్, పల్లోడి ప్రాంతాల్లో సిఆర్‌పిఎఫ్ శిబిరాలపై మావోల డ్రోన్లు ‘చక్కర్లు’ కొట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఇదే నెలలో మావోలు బీజాపూర్ జిల్లా జరిపల్లి అటవీ ప్రాంతంలో ఒక సిఆర్‌పిఎఫ్ జవానును కాల్చిచంపారు. మరో ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
ఇదిలా ఉండగా బెయిల్‌పై ఉన్న మావోయిస్టు నాయకుడు రవిశర్మను ఇటీవల హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టుచేశారు. ఎల్.బి.నగర్ ప్రాంతంలో అతనిని, అతని భార్య అనురాధను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై జార్ఖండ్‌లో 11 కేసులు, హైదరాబాద్, విశాఖలో ఒక్కొక్క కేసు ఉన్నాయని తెలుస్తోంది. వారివద్ద లాప్‌టాప్, పెన్‌డ్రైవ్, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. గత నెలలో మావోయిస్టు అనుబంధ సంస్థలకు చెందిన ఎనిమిది మంది నాయకులపై పోలీసులు కేసులుపెట్టారు. వీరంతా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం. వీరిలో తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు మద్దిలేటి సైతం ఉన్నారు. ‘‘స్టూడెంట్స్ మార్చ్’’ పత్రిక బాధ్యతలు నిర్వహించిన జగన్‌ను కూడా పోలీసులు అరెస్టుచేశారు.
ఇలా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుల నుంచి, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుల వరకు అరెస్టు కావడం, కొందరు ఎన్‌కౌంటర్ కావడం, మరికొందరు లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమం ‘సంకోచిస్తున్న’ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తూర్పు కనుమల్లో స్థావరాలు దెబ్బతిన్నా, పశ్చిమ కనుమల్లో కొత్తగా నిర్మించుకుందామన్న వారి ఆశ అడుగంటింది. ఈ నేపథ్యంలో ఇంత రక్తపాతం అవసరమా? సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని తుపాకీతో శాసించడం సాధ్యమేనా?- అని మావోయిస్టు అగ్ర నాయకులు ఆలోచించుకోవలసిన తరుణమిదే! దీపక్ లాంటివారి తెలివితేటల్ని సకారాత్మక పనులకు ఉపయోగించడమే సముచితంగా ఉంటుంది.

-వుప్పల నరసింహం 99857 81799