సబ్ ఫీచర్

‘ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం’ సాకారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఒకే దేశం-ఒకే చట్టం-ఒకే ప్రజ’..అంటూ ‘ఏక్తా భారత్’ నినాదంతో అలనాడు జనసంఘ్ పార్టీ పుట్టింది. కాలక్రమంలో జనసంఘ్ భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందింది. భారతీయ జనతాపార్టీకి ‘సిద్ధాంత రూపకర్త’గా వ్యవహరిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) ఉద్దేశం కూడా అదే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశం- ఒకే చట్టం- ఒకే ఎన్నికలు- ఒకే గుర్తింపుకార్డు, ఒకే విధమైన రిజర్వేషన్ విధానం- పౌరులందరికీ సమన్యాయం- ఉమ్మడి పౌర స్మృతి- ఒకే పన్ను విధానం.. అంటూ నేడు బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో కీలకమైనది- జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే రాజ్యాంగంలోని 370, 35(ఏ) అధికరణల రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన నిర్ణయాలు.
భారతదేశ చరిత్రలో 1947 ఆగస్ట్ 15 తరువాత గుర్తుంచుకోతగిన రోజు 2019 ఆగస్ట్ 5. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 103 క్లాజులతో 58 పేజీల ‘జమ్మూ-కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లు-2019’ని ఈనెల 5న తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం ఉమ్మడి జమ్మూ-కశ్మీర్‌ను జమ్మూ-కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలుగా విభజన అయ్యాయి. జమ్మూ-కశ్మీర్ శాసనసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్ శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించాయి. ప్రస్తుతం కశ్మీర్ ప్రాంత పరిధిలోని పది జిల్లాలు, జమ్మూ ప్రాంతంలోని పది కలిపి 20 జిల్లాలతో రాష్ట్రం ఏర్పడింది. అలాగే లేహ్, కార్గిల్ జిల్లాలతో లద్దాఖ్ ప్రాంతం చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకె) కూడా ఈ చట్టం పరిధిలోకి వచ్చింది. ఆ ప్రాంతం మొత్తంపై కేంద్ర అధికార పరిధి పెరిగింది. రాజ్యసభ ఆ బిల్లును ఆమోదించింది. మరోపక్క అదే సమయంలో ఆర్టికల్ 370 రద్దుచేస్తూ రాష్టప్రతి ఆదేశాలు జారీచేశారు. అన్నీ ఏక కాలంలో జరిగిపోయాయి. దాంతో జమ్మూ-కశ్మీర్ శాసనసభలో భారత రాజ్యాంగం తక్షణం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. ఈ బిల్లుని ఆగస్ట్ 6న లోక్‌సభలో చర్చకు పెట్టారు. బీజేపీకి బలం ఉన్నందున అక్కడ కూడా ఆమోదం పొందుతుంది. ఈ బిల్లు రూపొందించడంలో మోదీ, అమిత్‌షాలు ఇద్దరు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఘన విజయం సాధించారు. ఈ ఇద్దరూ నేడు హీరోలుగా నిలిచారు. కశ్మీర్ పట్ల మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనని దేశంలో అత్యధిక శాతం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ, శాంతి భద్రతల విషయంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, 70 ఏళ్లుగా రావణ కాష్టంలా రగులుతున్న కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపించారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థిర, చరాస్తులను వదులుకొని ఎక్కడెక్కడో తలదాచుకుంటున్న కశ్మీరీ పండిట్ల ఆనందానికి అవధులు లేవు. ఈ చర్యతో మోదీ, అమిత్‌షాలు ఇద్దరూ దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ మాదిరి గుర్తుండిపోతారు.
కాగా, ఎలాంటి చర్చ జరగకుండానే ఆర్టికల్ 370ని రద్దుచేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు. జమ్మూ-కశ్మీర్ ప్రాంతంలో చిరకాలంగా శాంతి లేదు. ప్రజలకు భద్రత కరువైంది. ఏడు దశాబ్దాలుగా వారు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏటేటా రక్షణ వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. ఆర్టికల్ 370 ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలను అక్కడి ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోలేకపోయాయి. మరోపక్క ఆ ప్రాంతంలో అశాంతిని పెంచడానికి, కల్లోలం సృష్టించడానికి పాకిస్తాన్ చేస్తున్న చేష్టలు అందరికీ తెలిసినవే. ఈ పరిస్థితుల్లో ముందుగా ఈ వ్యూహం బయటపెట్టి, చర్చించిన తరువాత చర్యలకు దిగితే దేశం లోపల, వెలుపల ఎన్నో ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చేది. అందువల్లనే దూరాలోచనతో మోదీ, అమిత్ షాలు తమ ఆలోచనను అత్యంత గోప్యంగా ఉంచి, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకొని బిల్లుని తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు అమలులోకి రావడం వల్ల కశ్మీర్ ప్రాంత ప్రజల హక్కులు ఏమీ హరించుకుపోలేదు. వారి గౌరవానికి ఏ విధమైన భంగం కలుగదు. వారి మత విశ్వాసాలకు, సంస్కృతికి ఎటువంటి హానీ ఉండదు. దేశంలోని ఇతర పౌరులకు ఉన్న అన్ని హక్కులు వారు అనుభవిస్తారు. అన్ని సౌకర్యాలు వారికి ఉంటాయి. ఇంకా అదనంగా అక్కడి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తారు. అక్కడ మామూలు పరిస్థితులు నెలకొంటే కేంద్రం శాంతి భద్రతలపై కాకుండా, అభివృద్ధిపై దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. వీటన్నికంటే ముఖ్యంగా దేశ సమైక్యతకు, సమగ్రతకు మేలుజరుగుతుంది. దేశ మొత్తం జనాభాలో ఏకత్వం అనే భావన బలీయంగా నెలకొనడానికి అవకాశం ఏర్పడుతుంది.
ఇప్పటివరకు భారత పార్లమెంటులో చేసే ఏ చట్టంలోనైనా ‘జమ్మూ-కశ్మీర్ మినహా’అని ఉంటుంది. ఇకనుంచి పార్లమెంట్‌లో చేసే ప్రతి చట్టం జమ్మూ-కశ్మీర్‌లోనూ అమలవుతుంది. ఇప్పటివరకూ జమ్మూ-కశ్మీర్‌లో శాశ్వత నివాసితులకు మాత్రమే అక్కడి భూములను విక్రయించే హక్కు ఉండేది. ఇక మీదట దేశంలోని ఏ ప్రాంతం ప్రజలైనా అక్కడ భూములను కొని, అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. ఇది అంత సామాన్యమైన నిర్ణయం ఏమీకాదు. ఈ నిర్ణయం వల్ల ఇంటాబయటా ఎదురయ్యే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే ప్రధాని, హోం మంత్రి స్వయంగా రంగంలోకి దిగి ఉంటారు. అందులో అనుమానం ఏమీలేదు. బిల్లు ప్రవేశపెట్టడానికిముందు వారు తీసుకున్న జాగ్రత్తలే ఇందుకు నిదర్శనం. ఇకముందు తలెత్తే అన్నిటిని కేంద్రం సమర్థవంతంగా ఎదుర్కొనగలదని ప్రజలు ఆశిస్తున్నారు.

-శిరందాసు నాగార్జున 94402 22914