సబ్ ఫీచర్

సినీ అవధాని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిభ ఎవరి సొత్తూ కాదు. అదున్న వ్యక్తి ఏ రంగంలోనైనా రాణిస్తాడు. ఒక రంగానికే అంకితమైతే మరింత
రాణించగలడు. తన లోపం తాను తెలుసుకుని, ఎంతవరకు ఏ పనికి న్యాయం చేయగలడో
తెలుసుకోవడం ప్రతి వ్యక్తికి అవసరం. అటువంటి అరుదైన వ్యక్తులలో నిట్టల గోపాలకృష్ణ, అదే.. లక్ష్మణరేఖ
గోపాలకృష్ణ ఒకరు.

వాహిని స్టూడియోలో 14 ఫోర్లు వుంటే, ఒక ఫ్లోర్‌లో ఎన్టీఆర్ ఉన్నాడు అంటే, మిగతా ఫ్లోర్లలో
నటీనటులందరూ ఖచ్చితమైన సమయాన్ని పాటించేవారు. అదీ ఆయన నేర్పిన క్రమశిక్షణ అంటారు గోపాలకృష్ణ.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలో జన్మించిన ఆయన, హైస్కూల్ చదువంతా అక్కడే పూర్తిచేశారు. ఆ తరువాత రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ. మొదటినుండీ కళలపట్ల అభినివేశంవున్న ఆయన డిగ్రీలో తన సహాధ్యాయి అయిన నటుడు చంద్రమోహన్‌తో కలిసి నాటకాలు వేసేవారు. చంద్రమోహన్ హీరోగా వేస్తే, గోపాలకృష్ణ హీరోయిన్‌గా నటించేవారు. నువ్వు హీరోయిన్‌గా నటిస్తానంటేనే హీరోగా వేస్తానని చంద్రమోహన్ ఉడికించి మరీ నటింపజేసేవారు. అలా నాటక రంగంలో తన ముద్రను వేసిన గోపాలకృష్ణ, 1961లో తన కళాతృష్ణను తీర్చుకోవడానికి మద్రాస్ వెళ్లారు. హీరోగా రాణించాలని ఆయన కోరిక. కానీ హీరోకు ఉండవలసిన ఒడ్డూ పొడుగూ లేవు. కానీ నటించే సత్తా వుంది. దూరపు బంధువు అడ్డాల నారాయణరావు దర్శకత్వంలో ‘సమాజం’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయనను కలవడంతో సినిమా పరిశ్రమలో నెగ్గుకురావడం, అదీ నటుడిగా చాలా కష్టమని, తప్పకుండా సినిమా పరిశ్రమలోనే కొనసాగాలనుకుంటే సాంకేతిక విభాగంలో శిక్షణ పొందితే బావుంటుందని సలహా ఇచ్చారు. తనకిష్టమైన దర్శకత్వ శాఖలోనే అప్రెంటీస్‌గా చేరడానికి నిర్ణయించుకున్నారాయన. దర్శకుడు తాపీ చాణక్యకు పరిచయం చేసి అవకాశం ఇమ్మన్నారు. ఆయన రూపొందిస్తున్న ఎన్టీఆర్-అంజలీదేవీల ‘వారసత్వం’ చిత్రానికి అప్రెంటీస్‌గా చేరారు గోపాలకృష్ణ. జీతం గీతం ఏమీ లేకపోయినా షూటింగ్ ఎలా కొనసాగుతుంది అన్నదానిపైనే ఆయన పరిశీలన సాగింది. అంజలీదేవి, గోపాలకృష్ణ ఒకే హైట్ ఉండడంతో లైటింగ్ సన్నాహాలలో ఫ్లోర్‌లో అంజలీదేవి బదులు గోపాలకృష్ణను నిలబెట్టి కెమెరా లెంగ్త్ చూసుకునేవారు. అలా అన్ని విధాలా ఆయన ఆ షూటింగ్‌లో పాల్గొన్నారు. నిర్మాత కొత్తవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చే ఇనిస్టిట్యూట్ తామేమీ పెట్టలేదని వెళ్లిపొమ్మనడంతో ఫ్లోర్‌నుండి బయటకు వచ్చారు. కానీ దర్శకుడు చాణక్య తనకు గోపాలకృష్ణే కావాలని గట్టిగా కోరడంతో మళ్లీ వచ్చానని, అపుడు అంజలీదేవికి సైనస్ సమస్య ఎక్కువగా ఉండడంతో ఆమెకు తగిన విధంగా డైలాగులు చెప్పి ప్రాక్టీసు చేయించేవాడినని ఆయన గుర్తుచేసుకుని నవ్వేశారు. అదే చిత్రానికి అప్రెంటీస్‌గా వున్న దర్శకుడు వి.రామచంద్రరావు విక్టరీ మధుసూదన్‌రావుకు గోపాలకృష్ణను పరిచయం చేశారు. అపుడు వీరాభిమన్యు షూటింగ్ జరుగుతోంది. ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఆ తరువాత మధుసూదన్‌రావు దర్శకత్వంలో ఆస్తిపరులు, మంచి కుటుంబం చిత్రాలకు కూడా పనిచేశారు. ఆ తరువాత ఎస్‌విఆర్, అంజలీదేవి ప్రధాన పాత్రలలో లక్ష్మీనివాసం చిత్రానికి పనిచేశారు. ఆ షూటింగ్‌లో ఎస్‌విఆర్ దర్శకుడు మధుసూదన్‌రావును, గోపాలకృష్ణను బాగా గమనించారు. మధుసూదన్‌రావు సీరియస్‌గా ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకునేవారు. గోపాలకృష్ణ అందరితో నవ్వుతూ సరదాగా సెట్‌లో పనిచేసేవారు. వీరిద్దరికీ ఎలా కుదిరింది అన్నది ఎస్‌విఆర్ అనుమానం. అందుకే మనసులో వుంచుకోకుండా మధుసూదన్‌రావుని అడిగేశారు. అపుడు మధుసూదన్‌రావు, అందుకే మా ఇద్దరికీ కుదిరిందని చెప్పడంతో అందరం నవ్వుకున్నామని ఆయన అంటారు. మధుసూదన్‌రావు తన ప్రియశిష్యుడని తనగురించి చెప్పుకోవడం నాకు గర్వకారణంగా వుంటుందని ఆయన అంటారు. ఆ తరువాత కలసిన మనసులు చిత్రంతో కమలాకర్ కామేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కుటుంబ స్నేహితులు అయ్యేంతలా జరిగింది. రోజూ సాయంత్రానికల్లా ఇద్దరూ కలిసి ఆ రోజు వారు పాల్గొన్న షూటింగ్ ముచ్చట్లను చెప్పుకొని తప్పొప్పులను బేరీజు వేసుకునేవారు. ఎక్కువ సఖ్యత వుండడంతో ప్రతీ విషయాన్ని నాకు ఆయన చెప్పేవారని గుర్తుచేసుకున్నారు గోపాలకృష్ణ. పౌరాణిక చిత్రాల షూటింగ్‌లు జరిగేప్పుడు తనను పిలిచి మరీ పనిచేయించేవారని, చాలా సింపుల్‌గా వుండేవారని గోపాలకృష్ణ తెలిపారు. ఓసారి కలిసిన మనసులు షూటింగ్‌లో మాటల రచయిత ఆత్రేయ రాసిన మాటలను నిర్మాత ఎం.ఎస్.రెడ్డి మార్చారు. కానీ ఆ విషయాన్ని మధుసూదన్‌రావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి ఆత్రేయతో మాట్లాడి, ఆయన అనుమతి తీసుకొని డైలాగ్ వర్షన్ చెప్పారని, అది ఓ మాటల రచయితకు అంత పెద్ద దర్శకుడైనా, హీరో అయినా ఇచ్చిన గౌరవమని అంటారాయన. అందుకే మాటలు మార్చినపుడల్లా డైలాగ్ వర్షన్ ముందుగా నాకు కావాలని, అపుడే నేను నటీనటులను సమాయత్తపరచగలనని, ఎం.ఎస్.రెడ్డితో పోట్లాడి మరీ ముందుగా స్క్రిప్ట్ పేపర్ తెప్పించుకునేవాడని తెలిపారాయన. ఓసారి కమలాకర కామేశ్వరరావు పనిమీద వెళ్లినా, మిగతా సన్నివేశాలు తననే తీయమనేవారు. ఆ తరువాత ఆయన వచ్చి చూసి మళ్లీ ఆ సన్నివేశాలను రీషూట్ చేసేవారు. ఎడిటింగ్‌లో గోపాలకృష్ణ తీసిన సన్నివేశాలను, కమలాకర కామేశ్వరరావు తీసిన సన్నివేశాలను చూపించి రెండింటిమధ్య తేడాలను తెలిపి, ఇలా తీయాలంటూ దగ్గరవుండి ఓ గురువులా ఆయన నన్ను ఆదరించారని గుర్తుచేసుకున్నారు గోపాలకృష్ణ. ఆ తరువాత దర్శకుడు యోగానంద్‌తో డబ్బుకు లోకం దాసోహం, వాడే వీడు, కథానాయకుని కథ చిత్రాలకు పనిచేశారు. ఎన్టీఆర్‌తో ఏ భయం లేకుండా సినిమా కథ చెప్పాలంటే ఖచ్చితంగా గోపాలకృష్ణ ఉండాల్సిందే. కాల్షీట్లు ఆయననుండి తీసుకోవడానికి కూడా గోపాలకృష్ణే సమర్థుడు అన్న నానుడి దర్శకులకు అలవాటైంది. ఫ్లోర్‌కి రాగానే తనకు డైలాగ్ వర్షన్ చెప్పే గోపాలకృష్ణ ఎక్కడ అని అడగడం ఎన్టీఆర్‌కు రివాజైపోయింది. వాహిని స్టూడియోలో 14 ఫోర్లు వుంటే, ఒక ఫ్లోర్‌లో ఎన్టీఆర్ ఉన్నాడు అంటే, మిగతా ఫ్లోర్లలో నటీనటులందరూ ఖచ్చితమైన సమయాన్ని పాటించేవారు. అదీ ఆయన నేర్పిన క్రమశిక్షణ అంటారు గోపాలకృష్ణ. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎన్టీఆర్‌తో అనేక చిత్రాలకు పనిచేశారు. ఆ తరువాత కె.విశ్వనాధ్ వద్ద శోభన్‌బాబు, శారదలతో కలిసి ‘కాలం మారింది’ చిత్రానికి పనిచేశారు. వీరాభిమన్యు చిత్రం రూపొందించే సమయంలో డాన్సుల కంపోజ్ కూడా ఒక్కొక్కసారి గోపాలకృష్ణ పర్యవేక్షించేవారు. డాన్స్‌మాస్టర్ హీరాలాల్ శిష్యులు వచ్చి ఒకరు శోభన్‌బాబులా, ఒకరు నటి కాంచనలా నృత్యాలు కంపోజ్ చేసేవారు. అక్కడ దర్శకుడు స్థానంలో గోపాలకృష్ణే నిలబడి ఫైనల్ చేసేవారు. ఆ తరువాత ఆ నృత్యాలు చూసిన దర్శకుడు ఓకె చేసేవారు. ఒకవైపు కాల్షీట్లు, మరోవైపు ఫ్లోర్ మేనేజ్‌మెంట్, నటీనటుల స్క్రిప్ట్‌లు తదితర అంశాలన్నీ గోపాలకృష్ణ చేతిపైనుండే జరిగేవి. రాముడే దేవుడు చిత్రాన్ని వాణిశ్రీ-చలంలతో కె.విశ్వనాథ్ రూపొందించడానికి అగ్రిమెంట్ కుదిరింది. కానీ నిర్మాతలతో చిన్న తేడాలు రావడంతో కె.విశ్వనాథ్ ఆ చిత్రాన్ని వదిలేశారు. దర్శకుడు బి.వి.ప్రసాద్‌తో ఆ చిత్రాన్ని రూపొందించడానికి సన్నద్ధమయ్యారు. అపుడు గోపాలకృష్ణ విశ్వనాథ్‌తో ‘‘సార్.. నేను కూడా బయటికి వచ్చేస్తా’’ అన్నారు. అపుడు కె.విశ్వనాథ్, ‘‘మనిద్దరం కలిసి రూపొందించిన ఆ కథ, కొత్త దర్శకుడి చేతిలో పడి ఎలా వస్తుందో ఏమో? నేను ఎటూ లేను. కనీసం నీవైనా లేకపోతే ఆ కథకు న్యాయం జరుగుతుందా? కనుక నువ్వు అదే యూనిట్‌లో వుండి చిత్రం బాగా రావడానికి సహకరించాలి’’ అన్నారు. ఓ గొప్ప దర్శకుని హృదయ వైశాల్యానికి ఈ ఒక్క సంఘటనే ఉదాహరణ అంటారు గోపాలకృష్ణ.
(మిగతా వచ్చేవారం)

-సరయు శేఖర్, 9676247000