సబ్ ఫీచర్

ప్రమాదంలో ప్రజారోగ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఆర్థిక, సామాజిక వ్యవస్థలను నిర్వీర్యం చేసి, జాతిని సంక్షోభంలోకి నెడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందక ఎంతోమంది ప్రా ణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది పేదలు తమ ఆరోగ్య సంరక్షణకు సరైన సౌకర్యాలు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారు. సామాన్య మానవుడు ‘ఆరోగ్య భద్రత’ కొరవడి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. అసంక్రమిత వ్యాధులైన క్యాన్సర్, మధుమేహం, గుండెపోటు, రక్తపోటు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, సంక్రమిత వ్యాధులైన క్షయ, న్యూమోనియా, కలరా, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, అమీబియాసిస్ లాంటి వ్యాధుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వ్యాధులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం సౌకర్యాలు లేకపోవడం ఫలితంగా ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ గ్రామీణ, పట్టణ ప్రాంత పేదలు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రబలుతున్న వ్యాధులకు సమగ్రమైన కారణాలను ప్రభుత్వాలు తెలుసుకుంటూ నివారణ చర్యలు, వైద్య సౌకర్యాలపై దృష్టిపెడుతూ పొంచి ఉన్న ముప్పును అరికట్టవలసిన అవసరం ఉన్నది.
జనాభాకు సరిపడా స్వచ్ఛమైన మంచినీరు అందకపోవడం, సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడం వంటి కారణాలతో రకరకాల రోగాలు సంభవిస్తున్నాయి. పోషకాహార లోపం స్ర్తిల, శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సామాన్య ప్రజల్లో స్వచ్ఛతపై సరైన అవగాహన లేదు. ఆహార పదార్థాల కల్తీలు కూడా అనేక రోగాలకు కారణం అవుతున్నాయి. చాలామంది తమ రోజువారీ జీవన విధానంలో శారీరక శ్రమకు దూరం కావడంతో కొవ్వు పదార్థాలు పేరుకుపోయి అనేక జీవనశైలి వ్యాధులకు గురికాక తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ మురికివాడల్లో కాలానుగుణంగా వచ్చే వ్యాధులపై డాక్టర్ల సలహాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు లేకపోవడంవల్ల విష జ్వరాల బారినపడి చాలామంది చనిపోతుండడం విషాదకరం.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం స్పందించి సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లకపోతే ప్రజల ఆరోగ్య సమస్య అతిపెద్ద సంక్షోభంగా మారడం తథ్యం. కుగ్రామాల నుండి పట్టణాల వరకు తాము నివసించే చోట ప్రతి పౌరుడూ నాణ్యమైన వైద్య సేవలను పొందగలగాలి. గ్రామీణ ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోషకాహారం వంటి అంశాలపై చైతన్యం పెంచేందుకు కమిటీలను ఏర్పాటుచేసి క్రియాశీలకంగా పనిచేసినట్లు చూడవలసిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి జిల్లా ఆసుపత్రి వరకూ తగినంతమంది వైద్య సిబ్బందిని, మందులను, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాలి. సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య ఆహారం అవసరమన్న అంశంపై అవగాహన కల్పించాలి. కాలుష్యాన్ని ప్రజల భాగస్వామ్యంతో అరికట్టే విధంగా కృషిచేయాలి. నేడు అన్ని వయసులవారు మద్యపానానికి, పొగాకు ఉత్పత్తులకు బానిసలవుతూ అనేక ఆరోగ్య సమస్యలకు బలైపోతున్నారు. బహిరంగ మద్యపానాన్ని, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణకు కృషి చేయాలి. ప్రథమ చికిత్స, రక్తదానం వంటి విషయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ప్రజారోగ్యం అనేది దేశ ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించి, ప్రభుత్వ రంగంలో నాణ్యమైన వైద్యసేవలను విస్తృతం చేయాలి.

-సంపతి రమేష్ మహారాజ్