సబ్ ఫీచర్

కార్మిక దినోత్సవ వేళ.. పోలీసు ఉద్యోగుల బలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడే.. మే నెల తొలి రోజు.. ప్రపంచ కార్మిక దినోత్సవం.. శ్రమజీవులు, ఉద్యోగులు ఉత్సాహంగా వేడుక జరుపుకుంటున్న వేళ మహారాష్టల్రోని గడ్చిరోలి జిల్లా దాదాపూర్ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరతో 15 మంది పోలీసు ఉద్యోగులను హతమార్చారు. బీభత్సం సృష్టించారు. ఏ ఎర్రని జెండా కార్మికులకు, ఉద్యోగులకు అండగా నిలుస్తుందని వారి రక్తంలోంచే ఆవిర్భవించినదిగా చెప్పుకునే జెండాకు మావోలు పోలీసు ఉద్యోగులను బలి ఇచ్చారు. అదీ కార్మికుల దినోత్సవం రోజునే వారిని కిరాతకంగా హతమార్చడం దారుణం.
మేడే సందర్భంగా కార్మిక- కర్షక- ఉద్యోగుల సంక్షేమం, వారి జీవన విధానంలో మరింత వనె్న తెచ్చేందుకు కృషిచేయాల్సిన వారు, శ్రమ జీవులకు ‘పట్ట్భాషేకం’ చేయాలనుకునేవారు ఇలా శ్రమజీవులకు ప్రాతినిధ్యం వహించే సాధారణ పోలీసు ఉద్యోగులను పొట్టనపెట్టుకోవడం వల్ల ఒరిగిందేమిటి?...
వర్తమాన నాల్గవ పారిశ్రామిక విప్లవ కాలంలో కమ్యూనిస్టు భావజాలం రూపాంతరం చెందాల్సిన ఆవశ్యకత ఉందని ఉద్ధండ పిండాలైన మేధావులే నిత్యం చెబుతున్నారు. అంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు సమూలంగా మారుతున్నాయి.. మారాయి కాబట్టి 150 సంవత్సరాల క్రితపు, మొదటి పారిశ్రామిక విప్లవ చైతన్యంతో, ఆలోచనలతో ఆవిర్భవించిన మార్క్స్ భావజాలం శిలాజంగా గాక కాలానుగుణంగా దాన్ని రూపాంతీకరించుకోవలసిన ఆవశ్యకత ఉందని అందరూ అంగీకరిస్తున్నారు. చివరికి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులుగా సుదీర్ఘకాలం పనిచేసి, ఈ విషయాలపైనే పార్టీలో చర్చ చేపట్టినా.. ఫలితం లేక పార్టీని వీడి జన జీవన స్రవంతిలో కలిసిన అనేక మంది నాయకులు చెబుతున్న మాటలనైనా చెవికెక్కించుకోవాలి కదా? గత సంవత్సరం జినుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న, ఇటీవల సట్వాజీ అలియాస్ సుధాకర్ చెప్పిన విషయాలను ఎవరూ పరిశీలించినా మావోయిస్టుల మార్గానికి వర్తమానంలో మాన్యత లేదని తేటతెల్లమవుతోంది.
మావోయిస్టుల విరోధులో, శత్రువులో, మరొకరో కాదు- స్వయంగా సట్వాజీ (సుధాకర్) చెప్పిన విషయాలను మననం చేసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. ఎలాంటి విలువలు, విజ్ఞత లేకుండా బండగా పార్టీలో వ్యవహారాలు కొనసాగుతున్నాయన్న విమర్శ మావోయిస్టు అగ్రనాయకత్వం ఆలకించాలి కదా? అలా ఆత్మవిమర్శ చేసుకోకుండా ఇలా పదుల సంఖ్యలో సాధారణ పోలీసులను పొట్టనపెట్టుకుంటే దండకారణ్యంలో భాగమైన గడ్చిరోలి విముక్తి చెందుతుందా?.. దండకారణ్యంలో గత 40 ఏళ్లుగా మకాం వేసినా, మానవ వనరులను, ఆర్థిక వనరులను పెద్దఎత్తున పోగేసి తమ ఇష్టారాజ్యంగా ఖర్చుచేసినా, వేలాది మంది తలలు ఉత్తరించినా, వందలాది మంది ఆదివాసీలను కడతేర్చినా, మందుపాతరలతో, ‘రాంబో’ బాణాలతో భద్రతా బలగాల భరతం పట్టినా, పాఠశాల భవనాలు, కల్వర్ట్‌లు పేల్చినా, వాహనాలు, సెల్‌ఫోన్ టవర్లు, టెలిఫోన్ ఎక్స్‌ఛేంజీలను బూడిద చేసినా తాము ఆశించిన లక్ష్యం కళ్ళముందు కనిపిస్తోందా..? లేదు.. వాస్తవానికి వారి లక్ష్యం మరింత దూరమవుతోంది తప్ప దగ్గరవడం లేదు. ఈ విషయాన్ని విజ్ఞులు, మాజీ మావోలే చెబుతున్నారు.
ఇలా ఎందరో కీలకమైన వారు చెబుతున్నప్పుడు, ప్రపంచం శ్రమశక్తి కన్నా మేధోశ్రమ, మేధోశక్తిపై ఎక్కువ ఆధారపడి పరుగులిడుతున్న ‘దృశ్యం’ చూస్తే ఆత్మవిమర్శకు, ఆత్మ పరిశీలనకు తావివ్వకుండా, మరింత మొదటుగా, ముతక రీతిలో 150 ఏళ్ళకి తప్ప చైతన్యానికి, భావజాలానికి మెరుగులు దిద్దుతాం అంటూ పయనిస్తే అందులో ఇసుమంతైనా విజ్ఞత, ప్రజానుకూలత దాగున్నదా..? ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం ప్రజలది. ఏ భావజాలానిదో, ఏ సముదాయానిదో కాదు. ప్రజల కోసం ప్రజలే సంపద సృష్టించి, ప్రజలే పంచుతున్నారు. ప్రజలే అనుభవిస్తున్నారు. అంతా ప్రజల చుట్టూ తిరుగుతోంది. ప్రజలే కేంద్రంగా ప్రపంచం తిరుగుతోంది.
పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు, దళారులు, బూర్జువాలు, భూస్వాములు, వారి జలగలు జనసామాన్యాన్ని పీల్చి పిప్పిచేస్తున్నాయి. మూల్గుల్ని పీలుస్తున్నాయి. దీన్ని అరికట్టి అసంఖ్యాకమైన జన బాహుళ్యపు ప్రతినిధుల చేతిలో ప్రపంచ పగ్గాలు ఉన్నప్పుడే, అందినప్పుడే లోక కల్యాణం జరుగుతుంది. మానవాళి సుఖ సంతోషాలతో తులతూగుతుంది. ఆ ఘడియ కోసం మేం ఇలాగే మందుపాతరులు పేలుస్తాం, మర తుపాకులు ఎక్కుపెడతాం, మరెన్నో నరమేధాలకు పాల్పడతాం... అనడంలో అమాయకత్వంతోపాటు అపరిపక్వత ధ్వనిస్తోందని మావోలు గుర్తించకపోవడం విడ్డూరం.
మార్క్స్- ఏంగిల్స్, లెనిన్- స్టాలిన్, మావో-లిన్‌పియావో నాటి పరిస్థితులు, దోపిడీ విధానం వర్తమానంలో కనిపించడం లేదు. ఈ వౌలిక- కీలక అంశాన్ని పట్టుకునేందుకు విముఖత చూపుతూ మావోయిస్టులు రెచ్చిపోవడంలో ఏ మాత్రం అర్థం లేదు. ‘‘వాస్తవ పరిస్థితి’’ని అంచనా వేయకుండా, విశే్లషించకుండా, పరిశీలించకుండా అప్పుడెప్పుడో తీర్మానించుకున్న తీర్మానానికే కట్టుబడి, అదే శిలాశాసనంగా, ప్రేరణదాయకంగా భావిస్తూ ఇలా రహదారులపై మందు పాతరలు అమర్చి, సమయం చిక్కినప్పుడు వాటిని పేల్చి పదుల సంఖ్యలో ప్రాణాలు తీయడంలో, మరెందరినో గాయపరచడంలో తిరోగమనమే తప్ప పురోగమనం దర్శనమవడం లేదు. దార్శనికత అసలే ద్యోతకమవడం లేదు. మరి ప్రపంచాన్ని మొత్తం ఆకళింపు చేసుకుని, అన్ని ఆలోచనా ధారల సారాంశాన్ని ఔపోసన పట్టామని, తాము చెబుతున్నదే, తమ దృష్టి కోణమే సర్వదా.. సతతం సముచితమైనదని మందుపాతరలు పేల్చి చెబితే అదెలా సబబు అనిపించుకుంటుంది?
అరణ్యాలలో మకాం వేసి, మందుపాతరల భాషలో మాట్లాడే మావోలకు గాకపోయినా వారి ‘్థంక్ ట్యాంక్’గా పనిచేస్తున్న అర్బన్ నక్సల్స్ (మావోలు)కైనా డిజిటల్ టెక్నాలజీ వల్ల సమాజం మొత్తం ‘‘రీ డిజైన్’’ అయిందని, రూపాంతరం చెందిందని, మరింత వేగంగా మారబోతోందని గ్రహించి అరణ్యంలోని ‘కామ్రేడ్ల’ మనసుకు హత్తుకునేలా చెప్పాల్సింది పోయి... వారు తాన అంటే వీరు తందాన అనడం, వారు చూసిన దృశ్యానే్న వీరు పరవశించిపోయి తిలకించడం విచిత్రంగా తోస్తుంది.
లాప్‌టాప్ వాడుతూ, ఇంటర్నెట్ ఉపయోగిస్తూ, స్మార్ట్ఫోన్‌లో సంభాషిస్తూ, సందేశాలు, సమాచారం పంపుకుంటూ, మెట్రోరైళ్ళలో ప్రయాణిస్తూ, వర్తమాన సాంకేతిక పరిజ్ఞానం రాశిపోసినట్టున్న విశ్వవిద్యాలయాలను సందర్శిస్తూ, స్టార్టప్ సంస్థలతో సమాజంలో ఓ నూతన అధ్యాయం ప్రారంభమైందని విశ్వసిస్తూనే, వాటి ఫలాలు అందుకుంటూనే, ఆ జీవనాన్ని ఆస్వాదిస్తూనే దీనికి ఎన్నో యోజనాల దూరంలో ఉన్న ఆలోచనలకు ‘ఓకే’ చెప్పడం విడ్డూరం.. విచిత్రం. వాస్తవానికి వారు తిలకిస్తున్న, ఆస్వాదిస్తున్న, అనుభవిస్తున్న ఫలాలు ఆదివాసీలకు, సాధారణ ప్రజలకు ఎలా చేరవేయాలన్న ఆరాటం వ్యక్తం చేయడంలో అర్థం ఉంది గాని, వారి పేర ‘రాజ్యాధికారం’ ఎప్పుడు చేజిక్కించుకుందామా? అని చేసే ‘సాయుధ’ ఆలోచనలకు మాన్యత ఎక్కడిది? ఇది ద్వంద్వ ప్రమాణాలను తెలియజేస్తోంది తప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తున్నట్టు కనిపించడం లేదు. సత్యాన్ని ఎవరూ తొక్కి పెట్టినా, అది మందుపాతర అయినా మట్టి కరవాల్సిందే!

-వుప్పల నరసింహం 99857 81799