సబ్ ఫీచర్

‘పుస్తకం’పై దృష్టి పెడదాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్‌తోనే మమేకం కావడంతో పుస్తక పఠనానికి ప్రాధాన్యత తగ్గిపోతోంది. సాంకేతిక రంగంలోనూ, పారిశ్రామీకరణలోనూ వడివడిగా అడుగులు వేస్తున్నప్పటికీ- ప్రపంచ స్థాయిలో మన దేశం తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉరుకులు పరుగుల ఆధునిక జీవనం, పాశ్చాత్య సంస్కృతి వల్ల మన దేశంలోనూ పలుమార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక పోకడలతో యువత వెర్రితలలు వేస్తోందేమో అనిపిస్తుంది. ప్రతి విషయానికీ యువతీ యువకులు సెల్‌ఫోన్‌పైనే ఆధారపడుతున్నారు.
తల్లి ఒడే పిల్లల మొదటి బడి. పిల్లలు అమ్మఒడి నుంచే అభ్యాసాన్ని ప్రారంభిస్తారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ‘చినిగిన చొక్కనైనా వేసుకో..కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్న పెద్దల మాటలను చిన్నారులకు తెలియజేయాలి. అలనాడు జిజీయా బాయి తన కుమారుడు శివాజీని దేశభక్తుడిగా తీర్చిదిద్దడానికి ఎంతగానో శ్రమించింది. తల్లి చెప్పిన కథలతో స్ఫూర్తిని పొందిన శివాజీ ‘ఛత్రపతి’గా ఎదిగాడు. ప్రపంచంలో అమ్మకు మించిన దైవం మరోటి లేదు. నవమాసాలు మోసి పురిటి నొప్పులతో మరోజన్మకు శ్రీకారం చుట్టే తల్లి తన పిల్లలను ప్రయోజకులుగా తయారుచేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పిల్లలు పెరిగేటప్పుడు వారికి మంచి అలవాట్లను తల్లిదండ్రులే నేర్పాలి. పుస్తక పఠనం పిల్లల్లో జ్ఞానాన్ని పెంచుతుంది. చిన్నారుల్లో ఏకాగ్రత పెరుగుతుంది. పుస్తక పఠనంతో మానసిక సమస్యలు దూరం అవుతాయి. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. పుస్తక పఠనం వల్ల పిల్లలు మొదలుకుని పెద్దలకు కూడా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. పిల్లలు కథలంటే ఇష్టపడతారు. పిల్లలకు చిన్నచిన్న కథలు చదివి వినిపిస్తుండాలి. చిత్రాలతో కూడిన ఆసక్తికర పుస్తకాలను వారిచేత చదివించాలి. దీంతో తమకు తెలియకుండానే పుస్తకాల పట్ల వారు ఆకర్షితులవుతారు. పుస్తక పఠనంతో కొత్తకొత్త పదాలను నేర్చుకుంటారు. పిల్లలచేత పుస్తకాలను చదివించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రముఖ పాత్ర పోషిస్తారు. బాలసాహిత్యంలో అభినయ గేయాలు చదివిస్తూ వారిచేత అభినయం చేయించాలి. చిన్నారులకు ఇష్టానికి తగినట్టుగా పుస్తకాలను ఎంపిక చేసుకొని చదివేలా ప్రోత్సాహాన్ని అందించాలి. పుస్తక పఠనంలోని ఆనందాన్ని, అనుభూతులను వాళ్లు నేరుగా పొందుతారు.
పిల్లలకు చదవమని పుస్తకాలు ఇచ్చేస్తే చదవరు. వారిముందు పేరెంట్స్ కూడా చదువుతుండాలి. పేరెంట్స్ హాబీని పిల్లలు కూడా నేర్చుకుంటారు. వారికి కొత్తకొత్త పుస్తకాలను బహుమతిగా ఇస్తుండాలి. ఇలా పుస్తక పఠనానికి అలవాటుపడతారు. పేరెంట్స్ ఏం చేసినా చిన్నారులకు స్ఫూర్తిగానే ఉండాలి. నేడు చాలా పత్రికలలో పిల్లల కోసం ప్రత్యేకంగా పేజీలను కేటాయించి ప్రచురిస్తున్నాయి. ఆదివారం నాటి పత్రికల్లో క్రాస్‌వర్డ్, పజిల్స్, చుక్కలను కలపడం, ఆకారాలను తయారు చేయడం వంటివి వివరిస్తూ పిల్లల చేత వాటిని చేయిస్తుండాలి. ఇవి మెదడుకు బాగా పదును పెడతాయి. పుస్తక పఠనంవల్ల చదువులో ముందుకు వెళ్తారు. పిల్లలకు పుస్తకాల్లోంచి కథలు చదివి వినిపిస్తుండడంవల్ల తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య ఉండే అనుబంధం మరింత పెరుగుతుంది. అనుబంధాల విలువలు, కుటుంబం పట్ల గౌరవం, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివితే- మనుషుల మధ్య ఉండే ప్రేమను, ఆప్యాయతలను చిన్నారులు నేర్చుకుంటారు. జీవితంలో ఎదగడానికి పుస్తక పఠనం చాలా ముఖ్యం.
పుస్తకాలను చదువుకోవడానికి వీలుగా పరిసరాలను, అనువైన వాతావరణాన్ని కల్పించాలి. పుస్తకాలు చదవడం వల్ల పొందే అనుభూతి రుచి చూపిస్తేచాలు వాళ్లే ఇష్టంగా పుస్తకాలను చదవడం ప్రారంభిస్తారు. కామిక్స్, మాగజైన్స్, న్యూస్ పేపర్స్, బొమ్మల పుస్తకాలు, సింగిల్ పేజీ కథల పుస్తకాలను, సమాజం గురించి తెలుసుకునే అంశాలను పిల్లలకు అందుబాటులో ఉంచాలి.
పిల్లల మానసిక సామర్థ్యానికి, వయసుకు తగ్గట్లుగా, మెదడుకు శ్రమలేని రీతిలో సులభంగా అర్థమయ్యే పుస్తకాలనే చదవమని ప్రోత్సహించాలి. స్థాయికి మించిన పుస్తకాలను పిల్లలకు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు. వాటి పట్ల ఆసక్తి తగ్గే ప్రమాదం ఉంటుంది. పిల్లలను తల్లిదండ్రులు తరచూ దగ్గరలోని లైబ్రరీకి తీసుకువెళ్లాలి. లైబ్రరీలో చదువుతున్న కొత్త స్నేహితులను సంపాదించుకోవడమే కాకుండా పుస్తకాలంటే కూడా అమితంగా ఇష్టపడతారు. పుస్తక పఠనంతో మానసిక ఉల్లాసం లభించి, పిల్లల మనసుల్లో ఆందోళనలు తగ్గుతాయి.
*
(నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం)
*

-డా. అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321