సబ్ ఫీచర్

పరిపాలన పట్టదా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకరు. అటు ప్రతిపక్ష నేతగా, ఇటు ముఖ్యమంత్రిగా దశాబ్దకాలం పనిచేసిన ఘనత ఆయనది. గతంలో మంచి పరిపాలనాదక్షుడిగా ఆయనకు పేరు వుంది. రాష్ట్ర విభజన తరువాత పరిపాలనాదక్షుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, తమ కష్టాలు కడతేరుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ రెండు సంవత్సరాలలో ఆయన చేసినన్ని విదేశీ పర్యటనలు దేశంలోని మరే ఇతర ముఖ్యమంత్రి చేయకపోవడం గమనార్హం. విదేశీ పర్యటనలలో ఆయన ప్రధాని నరేంద్రమోదీతో పోటీపడుతున్నట్లుగా ఉంది.
రాజధాని నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేలవిడిచి సాము చేస్తున్నట్లుగా వుంది. విభజన కారణంగా రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నదని ఒకవైపు చెబుతూనే, మరోవైపు లక్షల కోట్ల రూపాయలు వ్యయంతో రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. రాజధానికి సంబంధించి పలు ఊహా చిత్రాలను పత్రికలకు విడుదల చేస్తూ, ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు సుపరిపాలనను అందించవచ్చు. అయితే, నిత్యం రాజధాని నిర్మాణంపై సమీక్షలు తప్ప, పరిపాలనా వికేంద్రీకరణకు ప్రభుత్వ పరంగా తీసుకొంటున్న చర్యలు శూన్యం.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ, చంద్రబాబునాయుడు జిల్లాల పునర్విభజనపై ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం గమనార్హం. పక్క రాష్టమ్రైన తెలంగాణలో ప్రస్తుతం పది జిల్లాలు ఉన్నాయి. వీటిని 25 జిల్లాలుగా విభజించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చురుకుగా సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాల విభజనకు పరిపాలనాపరమైన అడ్డంకులు కూడ ఏమీ లేవు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేమే ప్రధాన అడ్డంకి. 2000 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌ఘర్, బీహార్ నుంచి జార్ఖండ్‌లను వేరుచేసి, ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటుచేశారు. ఈ విభజన అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని 45 జిల్లాలను 71గా, మధ్యప్రదేశ్‌లోని 45 జిల్లాలను 51గా, బీహార్‌లోని 37 జిల్లాలను 40గా, జార్ఖండ్‌లోని 18 జిల్లాలను 24గా, చత్తీస్‌ఘర్ లోని 16 జిల్లాలను 29గా, ఉత్తరాఖండ్‌లోని ఐదు జిల్లాలను 13గా విభజించారు. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఐదు జిల్లాలను 17గా, నాగాలాండ్‌లోని ఎనిమిది జిల్లాలను 11గా, మేఘాలయాలోని ఏడు జిల్లాలను 11గా, త్రిపురలోని నాలుగు జిల్లాలను ఎనిమిదిగా విభజించారు.
చిన్న జిల్లాలను ఏర్పాటుచేయడం వలన పరిపాలనలో పారదర్శకత పెరుగుతుంది. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది. జిల్లా అధికారులపై పనిభారం తగ్గుతుంది. అంతేకాకుండా, సంక్షేమ కార్యక్రమాలలో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టవచ్చు. జిల్లాల విభజనతో మండలాల సంఖ్య పెరుగుతుంది. దీని కారణంగా, పలువురు రాజకీయ నిరుద్యోగులకు మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు లభిస్తాయి. కొత్త జిల్లాల ఏర్పాటువలన అటు ప్రజలకు ఇటు సొంత పార్టీవారికి ఎంతో మేలు జరుగుతుంది. అయినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త జిల్లాల ఏర్పాటు ఊసే ఎత్తకపోవడం గమనార్హం.

- పి.మస్తాన్‌రావు