సబ్ ఫీచర్

జనం బాధలే అంజన్న పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆయనొక సజీవ పాటల సాహిత్య నది. తెలంగాణ మట్టికున్న మహోన్నత వ్యక్తిత్వం, పౌరుషం, పోరాట పటుత్వం, అల్లుకున్న మానవ సంబంధాల గూళ్లు అన్నీ ఆయన సాహిత్యంలో అల్లుకుపోయాయి. ఆయన పాటలు పండిత పామరులను రంజింపజేస్తాయి. సామాజిక అంశాలపై ఆలోచింపజేస్తాయి. పొగలు సెగలు కక్కే పోరాట జ్వాలలను రగిలింపజేస్తాయి. మొత్తంగా ఆయనొక తెలంగాణ భౌగోళిక సాహిత్య చిత్రపటం. ఎందరెందరో సాహితీవేత్తలు నడిచిన దారిలో అడుగులు వేస్తూ ఆయన పోరు మార్గాన్ని ఎంచుకొని పోరుదారుల్లో సాగిపోయాడు.
ఆయన లాలించే పాటలు రాశాడు. ఆగ్రహంతో దోపిడి వ్యవస్థను బద్దలు కొట్టే విప్లవ జ్వాలలను తన పాటల్లో రగిలించాడు. ఆయనొక వాగ్గేయకారుడు. ఆయనొక పాటల బ్రహ్మ. ఆయన ప్రజల బాధలు, గాథలపై నిత్యం తపించి పరవశించి, సాహిత్యాన్ని అల్లుకుపోయిన వౌఖి క సాహిత్య ముఖం. ఆయనే గూడ అంజన్న. ఆయనే తెలంగాణ బీద, బిక్కి పాటల అంజన్న. ఆయనే పోరు ఉద్యమాలతో కేక వేసి దొరల గడీలపై విరుచుకుపడ్డ విప్లవ పాటల అంజన్న. 1955లో ఆదిలాబాద్ జిల్లా లింగాపురంలో జన్మించిన అంజన్న మలిదశ తెలంగాణ ఉద్యమంలో రగిలి రగిలి సెగలు కక్కిన యుద్ధ వచనం. మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి మట్టి మనుషులతో పెనవేసుకుపోయిన తెలంగాణ మట్టి స్వరూపం. ఆయన ఏ పాట రాసినా అది దళిత, బహుజన, గిరిజన, మైనార్టీ అట్టడుగు వర్గాల గురించిన తాత్విక చింతన ఉంటుంది.
నగ్జల్ బరీ వసంత మేఘ గర్జనలు తెలంగాణ అంతా ఆవరించిన విప్లవోద్యమ సందర్భంలో ఆయన రాసిన పాట తెలంగాణలో ఒక కొత్త ఉత్తేజానికి బాట వేసిం ది.‘‘ఊరు మనదిరా..ఈ వాడ మనదిరా..పల్లె మనదిరా..ప్రతి పనికి మనంరా..దొర ఏందిరో..వాని పీకుడేందిరో’’ అంటూ ఆయన రాసిన పాట మొత్తం తెలుగు సమాజానికి పాటల పాఠ్యాంశంగా మారింది. మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజల దగ్గర నుంచి విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల వరకు, పల్లెల నుంచి పట్టణాలకు ఈ పాట ఎగబాకింది. ఆ పాట విననివారు ఉండరంటే ఆశ్చర్యకరమేమీ కాదు. నల్లగొండ జిల్లా పలివెలగ్రామంలో నాటి మాజీ ఎమ్మెల్యే గురునాధ రెడ్డి ఒక సభను ఏర్పాటు చేశారు. అందులో పాల్గొనేందుకు వేళ్లే క్రమంలో, పలివెల మోటబావి వద్ద ఒక రైతు ఆలపిస్తున్న ఒక జానపద గీతాన్ని విని అప్పటికప్పుడు ‘‘ఊరుమనదిరా..’’పాటను రాశారు. ఈపాట 16 భాషల్లోకి అనువాదమైంది.
1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీలో అరెస్టయి ఏడాదికాలం పాటు జైల్లో ఉన్నారు. పోలీసు హింసలను అనుభవించారు. ప్రజలకోసం నిలిచిన ప్రజాకవిగా జైలు జీవితం గడిపారు. అయినా ఆయన కన్నుమూసే వరకు ప్రజల పక్షం వహించి ప్రజాకవిగా నిలిచారు. జైల్లోనుంచి బయటకు వచ్చి ఫార్మసిస్టుగా ఉద్యోగంలో చేరాడు. 1978-1979 లోసిరిసిల్లలో జరిగిన రైతాంగ ప్రజా ఉద్యమంలోఆయన చరుగ్గా పాల్గొన్నాడు.
తరువాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో గూడ అంజన్న పాత్ర మరువలేనిది. ఆయన తన పాటల ద్వారా ప్రజలను ఉత్తేజితం చేశారు. ఆయన రాసిన తొలి రైతు పాట ‘ఊరిసినేబోదువా..’ జనం నాలుకపై నడయాడింది. ‘‘రాజిగా..ఒరి రాజిగా, ఉర్రూతలూగించింది. ‘్భద్రంకొడుకో.. అన్న పాట కూడా చాలా ప్రాచుర్యం పొందింది. ‘నేను రానుబిడ్డో సర్కారు దవఖానకు’ పాట అప్పట్లో ఒక సంచలనం. పోరాట ఉద్యమ ధారల్లో ఆయన రాసిన ఇటువంటి పాటలు కొన్ని వందలు.
మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించే పాటలు అనేకం రాశారు. ఆయన పాట పాడుతుంటే మొత్తం తెలంగాణ సమాజం పరవశించి పోయేది. కబీరు, నాజర్, పోతులూరి వీరబ్రహ్మం, వేమనలు ఆనాటి ప్రజలను తమ తాత్విక చింతనతో సాహిత్యంతో ఎలా ముంచెత్తారో, తెలంగాణ సమాజాన్ని కూడ గూడ అంజన్న పాటలతో మునిగిపోయింది. ‘‘అవ్వోనివా, నువ్వు అమ్మోనివా..’’ అంటూ తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు ఉర్రూతలూగించాయి. తెలంగాణ ఏ మారుమూల ప్రాంతంలో ఎక్కడ ధూం ధాం జరిగినా, ఎక్కడ ఏ మలుపులో ఉద్యమ సభ జరిగినా గూడ అంజన్న రాసిన పాట పాడకుండా ఆ కార్యక్రమం జరిగేది కాదు. తెలంగాణకు ఉన్న సంపద ఏమిటని ఆధిపత్య వాదులు ప్రశ్నిస్తే చెప్పిన సమాధానం ఒక్కటే. మాకు సకల సంపదలతో సరితూగే సాహిత్య సంపద ఉన్నదని, గూడులేని వారికి గూడ అంజన్న పాట ఉందని, గుండె ధైర్యాన్నిచ్చే గూడ అంజన్న లాంటి పాటలే మాకు కొండంత సంపదలని తేల్చి చెప్పారు. అదీ ఆయన సాహిత్యానికున్న శక్తి. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు గూడ అంజన్న ఆడి పాడాడు. కోట్ల మంది ప్రజలకు తన పాటతో ధైర్యరసం నూరి పోశాడు. తన పాటలతో మొత్తం తెలుగు సమాజాన్ని పరవశింప చేశాడు. ఆయన రాసిన ‘గిరిజన మహిళా మేలుకో’ అనే నాటికకు అద్భుతమైన స్పందన వచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ‘వాయిస్ ఆఫ్ తెలంగాణ’, ‘తెలంగాణ బుర్రకథ’ సిడిలను ఆవిష్కరించారు. సాహిత్య రత్న, దళిత కళారత్న, దళిత సేవారత్న వంటి అవార్డులను అందుకున్నాడు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఈ సందర్భంలో సుందరయ్య విజ్ఞానకేంద్రం లో జరిగిన ఒక సభలో వీల్‌ఛైర్‌పై వచ్చి ప్రసంగించారు. ‘‘గొడ్డేడ్చిన రాజ్యం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని’’ రైతులు ఆత్మహత్యలపై ఆవేదన చెంది ప్రసంగం చేశారు. ఆయన రాసిన వందలాది పాటలు జన నాలుకలపై ఉన్నాయి. సుకవి జీవించు ప్రజల నాలుకలపై అన్న మాటలకు సజీవ రూపం గూడ అంజయ్య. ఆయన భౌతికంగా లేకపోవడం పూరింపలేని లోటు. కాని ఆయన పాటల జీవనదీ ప్రవాహాన్ని మాత్రం ఎవరూ అపలేరు. అంజన్న పాటల పొద్దుపొడుపు. ఆయన బీదలకు మేలు కొలుపు. మొత్తం తెలంగాణ సాహిత్యంలో ఆయనొక మర్రి వృక్షం.

-జూలూరి గౌరీ శంకర్ కవి, సీనియర్ జర్నలిస్ట్