సబ్ ఫీచర్

‘బాహుబలి’ స్ఫూర్తితో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాజులు, మాంత్రికులు, రాజమందిరాలు, కోట రహస్యాలు, కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీలు, ఏనుగుల ఘీంకారాలు, వీరసేనుల విన్యాసాలు.. ఇవన్నీ మనం వెండితెరపై ‘బాహుబలి’లో చూశాం.. ఆస్వాదించాం.. జేజేలు పలికాం. ప్రభాస్ హీరోగా ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించి తెలుగు సినిమా స్టామినాను ఎలుగెత్తిచాటింది. అయితే.. ఇప్పుడు అలాంటి కళ్లుచెదిరే, ఒళ్లు జల్లుమనిపించే దృశ్యాలు బుల్లితెరపై ‘స్వర్ణఖడ్గం’ రూపంలో వీక్షిస్తూ తనివితీరా ఆనందాన్ని పొందుతున్నారు ప్రేక్షకులు. జూలై 6 నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 8.30గం.లకు ప్రసారమవుతున్న ఈ జానపద ధారావాహిక అడుగడుగునా ఆసక్తి రేకెత్తించి, ఆబాల గోపాలన్ని అమితంగా ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. అపూర్వరీతిలో ఓ సరికొత్త జానపద ధారావాహికను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ ‘స్వర్ణఖడ్గం’ యాట సత్యనారాయణ దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది. ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచిన ఈటీవీ దీని ద్వారా ఇప్పుడు టెలివిజన్ చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. యాట సత్యనారాయణ గతంలో ఎన్నో సీరియల్స్‌ను రూపొందించి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నారు. ఆయన రూపొందించిన మనోయజ్ఞం, త్రిశూలం, నీలాంబరి, ఉమ్మడి కుటుంబం, శివన్నారాయణ తీరులు, చంద్రముఖి, నాపేరు మీనాక్షి, మల్లీశ్వరి, కలవారి కోడలు, పెళ్లినాటి ప్రమాణాలు, రాధాగోపాలం వంటివి ఇంటిల్లిపాదిని ఆకట్టుకున్నాయి. వెండితెరపై దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించే పనిలో గత కాలంగా నిమగ్నమై ఉన్న యాట సత్యనారాయణ త్వరలోనే ఆ కలను నెరవేర్చుకుంటానని చెబుతున్నారు. ఆయన మాటల్లోనే...
దర్శకత్వమే ఊపిరి..
నాశ్వాస.. నాఊపిరి దర్శకత్వమే. ఎప్పటికైనా వెండితెరపై తనేంటో నిరూపించుకుంటా. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌ను రూపొందించి అందరి ప్రశంసలందుకున్నప్పటికీ, నా లక్ష్యం మాత్రం వెండితెర ప్రయాణమే. ఇప్పటికే నావద్ద మంచి కథలు వెండితెరపై వెలుగులు విరజిమ్మేందుకు సిద్ధంగా ఉన్నాయి. సమయం కోసం వేచిచూస్తున్నా. ఆ రోజు ఎంతో దూరం లేదనుకుంటున్నా. అలా అడుగులు పడుతున్న సమయంలోనే ఈ ‘స్వర్ణఖడ్గం’ కళ్లముందుకొచ్చింది. వెండితెరపైనే కాదు, బుల్లితెరపై కూడా కళ్లు చెదిరే జానపద కథలను ప్రేక్షకులకు అందించాలన్న లక్ష్యంతోనే దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది.
స్వర్ణఖడ్గం గురించి...
ఈ ధారావాహిక గురించి చెప్పాలంటే.. మణిపుర మహా సామ్రా జ్యం, రుద్రగిరి మహా సామ్రాజ్యం. కపాల దీవి మధ్య నడిచే ఆసక్తికరమైన కథ. నెమళ్ల కొండమీద కొనే్నళ్ల పాటు భువనేశ్వరీదేవిని ఆరాధించి మహిమాన్విత స్వర్ణఖడ్గాన్ని సాధిస్తారు మణిపుర వంశీకులు. తను విశ్వవిజేత కావాలంటే స్వర్ణఖడ్గం దక్కించుకోవడంతోనే సాధ్యం అని ఆ ప్రయత్నంలో ఉంటాడు మాంత్రికుడు. మరి చివరకు ఆ ఖడ్గాన్ని సాధించాడా? లేదా? ఇంతకీ రుద్రగిరి సామ్రాజ్యంలోని మహాధాత్రి మహారాణికి మణిపురతో ఉన్న సంబంధం ఏమిటి? ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ మధ్యలో యుద్ధాలు, ప్రణయ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని సమ్నోహితుల్ని చేస్తుంది ‘స్వర్ణఖడ్గం’. భువనేశ్వరీదేవి విగ్రహం, మణిపుర సామ్రాజ్యం ఎరీనా సెట్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దాం. రుద్రగిరి సామ్రాజ్యం అంటే శివుడి అంశంతో ఉండే ప్రాంతం. అందుకోసం చుట్టూ నీరు ఉండి మధ్యలో అడవిలా ఆ సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దాం. కపాలదీవిలో మాంత్రికుడు ఆరాధించే కపాలిక దేవి విగ్రహాన్ని 22 అడుగుల ఎత్తులో భారీగా ఏర్పాటు చేశాం. బాహుబలి, రోబో, పద్మావత్‌లాంటి భారీ చిత్రాలకు పనిచేసిన సుమారు 110 మంది నిపుణులు దీని కోసం పనిచేశారు. వీళ్లతో పాటు ప్రత్యేకంగా ఓ 25మంది సాంకేతిక నిపుణులను ఇందుకోసం తీసుకున్నాం. ఇందులో సెట్లతో పాటు విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకూ దక్షిణాదిలో రాని విధంగా హిందీ సీరియల్స్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా బుల్లితెర బాహుబలిలా తీర్చిదిద్దాం. టెలివిజన్ చరిత్రలో ఇది కొత్త అధ్యాయమే. మేము అనుకున్నట్టుగానే ఈ ధారావాహిక అద్వితీయ రీతిలో అలరిస్తోంది. అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి కళ్లు చెదిరే సెట్టింగులతో, కేరళ అరణ్యాల్లో రూపొందించిన ప్రతిష్ఠాత్మక ధారావాహిక ఇది. ఇప్పటికే అత్యంత వీక్షకాదరణ పొందుతూ గొప్ప ప్రాచుర్యాన్ని సంతరించుకోవడం ఆనందంగా ఉంది. బాహుబలి చిత్రాలతో ఐదేళ్లు ప్రయాణించి ఎంతో అనుభవం సంపాదించిన నిర్మాతలు ఆ స్ఫూర్తితోనే దీనికి శ్రీకారం చుట్టారు. బాహుబలి స్ఫూర్తితో హిందీలో కొన్ని సీరియల్స్ వచ్చాయి. తెలుగులో అలాంటి సీరియల్ చేస్తే బాగుంటుంది అని ఈటీవీవారు ఇచ్చిన సలహా, సూచనతో ఈ ప్రాజెక్టు మొదలైంది. దాంతో ఓ కథ అనుకొని ఈటీవీ వారు, ఆర్కామీడియా బృందం కలిసి భారీ స్థాయిలో తీర్చిద్దాం. బాహుబలితో ఐదేళ్లు పనిచేసిన బృందంలోని కీలకమైన నిపుణులు ఈ సీరియల్‌కు పనిచేశారు. సాధారణంగా ధారావాహిక అంటే ఓ మూడు నెలలు ప్రీ పొడక్షన్ పనులు చేసి సెట్స్‌పైకి తీసుకొచ్చేస్తారు. కానీ ఈ ‘స్వర్ణఖడ్గం’ కోసం 14నెలలు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశాం. బాహుబలి స్థాయిలో ఉండాలి కానీ బాహుబలితో పోల్చేలా ఉండకూడదు అన్నీ కొత్తగా చేశాం. రామోజీ ఫిలింసిటీ, కేరళలో చిత్రీకరణ జరిపాం. దక్షిణాదిలోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించాం.
బోలెడంత ఫాంటసీ..
‘స్వర్ణఖడ్గం’లో బోలెడంత ఫాంటసీ ఉంటుంది. ఓ కథానాయకుడు. ఇద్దరు కథానాయికల మధ్య నడిచే డ్రామా. మహిళలకు ఎంతో బాగా నచ్చుతుంది. మాంత్రికుడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు పిల్లల్ని అమితంగా అలరిస్తాయి.

హీరోయిన్లు తమ అందచందాలతో అలరిస్తున్నారు. పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకూ అందర్నీ అలరించే అంశాలతో ఆసక్తిగా సాగుతుంది. బాహుబలికి ఎలాగైతే అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చుపెట్టారో ఈ ధారావాహిక కోసమూ బడ్జెట్ దాటి ఖర్చు చేశారు నిర్మాతలు. బడ్జెట్ రెట్టింపైనా ఒక్కో సీజన్‌కు తక్కువలో తక్కువ ఓ మూడు వందల ఎపిసోడ్లు చేయాలనుకుంటున్నాం. కనీసం ఓ 30 ఎపిసోడ్లకు ఓసారి ఊహించని మలుపు. థ్రిల్ ఉండేలా కథను తీర్చిదిద్దాం. ఓ విధంగా చెప్పాలంటే ఓ సినిమా తీసి బుల్లితెరపై చూపిస్తున్నాం. ఈటీవీతో నిర్మాతలది పదిహేడేళ్ల అనుబంధం. వారి కలయికలో చాలా ధారావాహికలు వెలుగు చూశాయి. కానీ ఇప్పటి వరకు చేయని విధంగా తెరకెక్కించిన ధారావాహిక ‘స్వర్ణఖడ్గం’. బాహుబలి నిర్మించారు కాబట్టి దాంతో పోలుస్తున్నారు. బాహుబలి సినిమా కాబట్టి ఆ స్థాయిలో ఉంది. కానీ టీవీ సీరియల్స్‌లో బాహుబలి స్థాయిలోనే ఉంటుంది. ఈటీవీ వారు భారీ సీరియల్ చేయాలనడం, దానికి తగ్గట్టే కథ ఉండటంతో పెద్ద ఎత్తున ఖర్చుపెట్టారు. దక్షిణాదిలోనే గొప్పగా నిలిచేలా కథకు తగ్గట్టు విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్ అన్నీ తీర్చిదిద్దాం. ప్రియుడిపై యుద్ధం ప్రకటించిన మాహాధాత్రి, కన్నకొడుకుపైనే కత్తి దూసిన రాజమాత, మనసావాచా ప్రేమించిన ప్రియుడి ప్రాణం కోరిన మహాధాత్రి ఇలాంటి ఎన్నో ట్విస్టులతో సాగిన అద్భుత జానపద ధారావాహిక. బాహుబలి నిర్మాతలు అందించిన అపూర్వ కానుక ఇది. జానపదాల్లో రాజదర్బారులకే కాదు అంతఃపురాలకీ అమిత ప్రాధాన్యం ఉంది. రాజమాత కనుసన్నల్లోనే పరిపాలన సాగుతున్నప్పుడు అక్కడ జరిగే రాజకీయ కుతంత్రాలు, మంత్రాంగాలు మరింత ఆసక్తిని కలిగిస్తాయి. మరింత ఆసక్తిని కలిగిస్తాయి. మహారాణి, యువరాణి, రాజనర్తకి, అంతరంగిక చెలికత్తెలు, పరిచారికలు.. ఇలా ఎన్నో పాత్రలు కథాగమనంలో అడుగడుగునా ఉత్కంఠను రెకెత్తిస్తాయి. ఇలాంటి అనేక విశేషాలకు వేదికగా నిలిచిన ఈ స్వర్ణఖడ్గం ధారావాహిక ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. ప్రేమలు, పగలు, దయా దక్షిణ్యాలు, క్షమాగుణాలు, రోషాలు, క్రోధాలు, శౌర్య పరాక్రమాలు.. తదితర భావావేశాలెన్నో చిన్నితెరమీద కనువిందు చేస్తున్నాయి. ఇందులో నటించి ఆయా పాత్రలకు ప్రాణం పోస్తున్న నటీనటులకు ఈ ధారావాహిక గర్వకారణంగా నిలుస్తుంది. మహాధాత్రిగా హీరోయిన్ సంజన, మణిపుర మహా సామ్రాజ్య మహారాణి వింధ్యావతిగా పూనమ్‌కౌర్, కపాల మాంత్రికుడు షిరోఖండ్ పాత్రలో సందీప్ బుల్లితెర భళ్లాలదేవగా అలరిస్తాడు. మహాధాత్రికి ప్రేమికుడిగా.. వింధ్యావతి భర్తగా మూడు పార్శ్వాల్లో పోషిస్తున్న మహారాజు మహేంద్ర పాత్రలో లక్మేష్‌భట్, రాజమాతగా రాజశ్రీ నాయర్, మహారాణి సౌదామినిగా మేఘన్ ఇలా ఎన్నో ఎనె్నన్నో ప్రత్యేకతలు. అన్నీ కళ్లారా చూసి అబ్బురపడాల్సిందే. ఆద్యంతం ఆసక్తిగా వీక్షించాల్సిందే. ఆయా పాత్రల్లో వారి నటనను మెచ్చుకోకుండా వుండలేం. ముఖ్యంగా ఈ ధారావాహికను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
వెండితెర ప్రయాణం..
చాలా కాలంగా నేను ఎదురుచూస్తున్నది ఇదే. ఈ ప్రయాణం మొదలుపెట్టాలనుకున్నప్పుడు నేను బుల్లితెరపై బిజీ బిజీగానే వుంటున్నాను. ఇక ఆగలేను. ఈ ‘స్వర్ణఖడ్గం’ తర్వాత ఇక అదే దారిలో నా ప్రయాణం వుంటుంది. మంచి అవకాశాలు వున్నాయి. అయితే కొంత కాలం నిరీక్షణ తప్పదు అనుకొని ధారావాహికలపై దృష్టిసారించాను. త్వరలోనే వెండితెరపై దర్శకుడిగా ప్రత్యక్షమవుతాను.

-రతన్