సబ్ ఫీచర్

పాఠశాలల్లో కానరాని ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థుల మనోవికాసాన్ని పెంచి, వారిలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందింపచేసి, పది మంది కలిసి సమైక్యంగా సంతోషాన్ని పంచుకునేందుకు నిర్దేశించిన ప్రత్యేక ఉత్సవాలు, పాఠశాలలో క్రమేపీ కనుమరుగవుతున్నాయి. స్వార్థసంకుచిత భావాలకు దూరంగా కులమతాలకు అతీతంగా, భారతావనీ ప్రాచీన సంస్కృతికి ప్రతి బింబాలుగా నిలుస్తున్న ఉత్సవాలపై పాఠశాలల్లో నిర్లక్ష్యపు నీడలు కమ్ముకుంటున్నాయి. పాఠశాల బోధన, హాజరు, పరీక్షలకే పరిమితమవుతూ, బోధనేతర అంశాలకు తగు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు నానాటికీ అధికమవుతున్నాయి. ప్రతి ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విధిగా నిర్వహించవలసిన ఉత్సవాలను పొందుపరుస్తూ, జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు ద్వారా ప్రచురితమైన పాఠశాలదర్శినిని పాఠశాలలన్నింటికీ సరఫరాచేసినా అది అమలుకు నోచకోవడం లేదు.
జూలై రెండవ పక్షంలో వన మహోత్సవం, 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం, ఆగస్టు 9న క్విట్ ఇండియాడే, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 29న జాతీయ క్రీడా దినోత్సవం, సెప్టెంబర్ 5 గురుపూజా దినోత్సవం, 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం, 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవం, 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం, అక్టోబర్ 2న గాంధీ జయంతి, 4న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం, 24న ఐక్యరాజ్యసమితి దినోత్సవం, 31న జాతీయ పునరంకిత దినం, నవంబర్ 7 నుండి 14వరకు గ్రంథాలయ వారోత్సవాలు, 14న బాలల దినోత్సవం, 19న జాతీయ సమైక్యతా దినం, 19 నుండి 25వరకు నేషనల్ బుక్ వీక్, డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం, 10 మానవ హక్కుల సంరక్షణ దినం, జనవరి 26న గణతంత్ర దినం, ఫిబ్రవరిలో స్వయం పరిపాలనా దినోత్సవం, పాఠశాల వార్షికోత్సవాలు, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, తదితర కార్యక్రమాలను నిర్వహించాలని సూచించినా పాటించడం లేదు. అంతేగాక ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన ప్రపంచ ఆరోగ్య, మహిళా, పరిసరాల, అంగవికలుర మరియు సంఘ సంస్కర్తల, స్వాతంత్య్ర సమరయోధుల తదితర ప్రముఖుల జన్మదినాలు, సంస్మరణాదినాలు జరుపుకోవాలని సూచించింది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాకమీషన్ మరియు డైరెక్టర్ ఉత్తర్వులను అనుసరించి, జిల్లా విద్యాధికారులు, ప్రభుత్వ పాఠశాలల్లో వార్షికోత్సవాలు జరుపుకోవాల్సిందిగా కార్యాలయ ఉత్తర్వుల సంఖ్య 542/బి/2/ 2002 తేదీ 5-1-2002 ద్వారా గతంలో ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ, స్థానిక అన్ని సంస్థలకు చెందిన అన్ని ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి సంవత్సరం డిసెంబర్ లేదా జనవరి నెలలో ఎలాంటి ఖర్చుకు తావీయకుండా, వార్షికోత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలు విద్యార్థులకు, తాము చదువుతున్న పాఠశాల గురించి గర్వపడేలా చేస్తాయని, టీం స్పిరిట్‌ను ప్రోత్సహిస్తూ, పాఠశాలల్లో ఆరోగ్యకరమైన పోటీతత్త్వాన్ని విద్యార్థులలో పెంపొందింపచేస్తాయని వివరించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు, ప్రభుత్వ పాఠశాలలు ఏ రకంగానూ తీసిపోవని, వాటి కంటే తక్కువ కాదనే భావనను విద్యార్థులలో కల్పించే కార్యక్రమం తమ సంస్థలలో చేపట్టడం ప్రధానోపాధ్యాయులు గర్వకారణంగా భావించాలని సూచించారు. స్థానిక సీనియర్ ప్రభుత్వ అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులను వార్షికోత్సవాలకు ఆహ్వానించి, వారిని భాగస్వాములను చేయాలని సూచించారు.
దశాబ్దల క్రితం ఇలాంటి ఉత్సవాలు తరచుగా నిర్వహించబడగా, క్రమేపి ఆయా కార్యక్రమాలు కనుమరుగౌతున్నాయ. అందువల్ల పాఠ్యాంశాల బోధనతోపాటు ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి నిలిపి, విద్యార్థులలో నూతనోత్సాహం, ఉత్తేజం నింపుతూ, వారిని అన్ని కార్యక్రమాలలో పాలుపంచుకునేలా ప్రతి పాఠశాలలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇందుకు విద్యాశాఖాధికారులు, పాఠశాల యాజమాన్యాలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది.

- గుండు రమణయ్యగౌడ్