ఆంధ్రప్రదేశ్‌

రేపటి నుంచి సాగునీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 8: నెల్లూరు జిల్లాలో మొదటి పంటకు గురువారం నుంచి సాగునీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో తొలి పంటకు సాగునీరు అందించేందుకు మంగళవారం నెల్లూరులో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానం చేస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపారు. సమావేశానంతరం రాష్ట్ర పురపాలక మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం సోమశిల జలాశయంలో 39.393 టిఎంసీల మేర నీటి లభ్యత ఉందని, డెడ్‌స్టోరేజి, నీటి ఆవిరి, తాగునీటి అవసరాలు పోను సుమారు 31 టి ఎం సిలు అందుబాటులో ఉంటుందన్నారు. దీనికి అనుగుణంగా పెన్నార్ డెల్టాకు 1.75లక్షల ఎకరాలు, కనుపూర్ కెనాల్ 22,400, బెజవాడ పాపిరెడ్డి కాలువ (కావలి కాలువ)కు 50వేలు, నార్త్ ఫీడర్ కాలువ 32,400, సౌత్ ఫీడర్ కాలువ 20,200 ఎకరాల పరిధిలో మొదటి పంటకు సాగునీరు అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. నిర్దేశించిన ఆయకట్టు పరిధిలోని ఎకరాలకు సాగునీరందించేందుకు ఆయా పరిధిలోని ఇంజనీర్లు ఒక్క బొట్టు కూడా నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం నుంచే జిల్లాలో తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో సుమారు 7వేలకు పైగా మోటార్ల ద్వారా కాలవల నుంచి నీటిని పారించుకుంటున్నారని, ఇకపై మోటార్ల ద్వారా సాగు చేసుకునే రైతులు వారంలో రెండు పర్యాయాలు మాత్రమే నీటి తోడుకోవాల్సి ఉంటుందని, మిగతా 5 రోజుల పాటు మోటార్లు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాల్వల మరమ్మతు పనులను వెంటనే చేపట్టి నీరు కాలువల్లోకి వచ్చేలోగా పూర్తి చేయాలని, ఆయకట్టు చివరి భూములకు పూర్తిస్థాయిలో నీరందించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించుకుని ఎలాంటి సమస్యలు లేకుండా సాగునీటి విడుదలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.
ఈ విషయంలో అధికారులకు నీటి యాజమాన్య, రైతు సంఘాలు సహకరించాలని మంత్రి కోరారు. జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు మాట్లాడుతూ జిల్లాలో రైతాంగానికి నిర్దేశించిన ఆయకట్టుకు ఐ ఏ బి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాగునీరందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలలో ఎలాంటి సమస్యలు లేకుండా సారదర్శకంగా కాలువల వారీగా నీటిని సమర్థవంతంగా పంపిణీ చేసేలా చూడాలన్నారు. ఇదిలావుండగా సమావేశంలో తరచూ ప్రభుత్వ, విపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు జరిగాయి. మంత్రి నారాయణ జోక్యం చేసుకుని కేవలం సాగునీటి విడుదలపై మాత్రమే మాట్లాడాలని సభ్యులకు సూచించారు. నాన్‌డెల్టా రైతాంగానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నిరసన తెలుపుతూ సమావేశాన్ని వాకౌట్ చేశారు. ఈ సమావేశంలో ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతంరెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, పాశం సునీల్‌కుమార్, ఎస్ ఐ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.