ఆంధ్రప్రదేశ్‌

జల విలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం కకావికలమైంది. గుంటూరు జిల్లా పల్లెగుంత వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. నడికుడి-పిడుగురాళ్ల మధ్య ట్రాక్‌పైకి నీరు చేరింది. రెంటచింతలలో గోలివాగు ఉద్ధృతికి ఇళ్లలోకి నీరు చేరింది. దాచేపల్లి సమీపంలో నాగులేరు వాగు పొంగడంతో హైదరాబాద్-గుంటూరు మార్గంలో రాకపోకలు స్తంభించాయి. కరాలపాడు గ్రామంలో ఓ ఇంటి గోడ కూలి వృద్ధురాలు మరణించింది. అటు ప్రకాశం జిల్లాలోనూ వాగులూ, వంకలూ పొంగిపొర్లుతున్నాయి. నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూండటంతో కొత్తపట్నం-ఒంగోలు మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ఒంగోలు సమీపాన కర్నూలు రోడ్డులో ట్రాన్స్‌కోకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్లు నీటమునిగిపోయాయి. సంతనూతలపాడులో 185 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కాగా ఈ వర్షాలకు పులిచింతల ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి వరద పరిస్థితిని సమీక్షించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.

వర్ష బీభత్సం

పొంగిపొర్లుతున్న వాగులు.. చెరువులు జలదిగ్బంధంలో పల్నాడు
లోతట్టు ప్రాంతాలు జలమయం.. నీట మునిగిన కాలనీలు గోడకూలి వృద్ధురాలి మృతి
మాచర్ల- గుంటూరు మధ్య కొట్టుకుపోయిన ట్రాక్ నడికుడి- పిడుగురాళ్ల వద్ద ట్రాక్ పైకి వరద

గుంటూరు/ఒంగోలు, సెప్టెంబర్ 13: అల్పపీడన భారీ వర్షాలకు గుంటూరు జిల్లా అతలాకుతలమైంది. పల్నాడు ప్రాంతంలో కురిసిన కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుఝాము వరకు ఎడతెరిపిలేకుండా నాలుగు గంటల పాటు హోరెత్తిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గురజాల, మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి, మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీవర్షాలకు మాచర్ల- గుంటూరు మార్గంలో గురజాల మండలం పల్లెగుంత వద్ద గండివాగు వరద ఉద్ధృతికి సుమారు అర కిలోమీటరు మేర రైల్వేట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రైళ్లను రద్దుచేశారు. నడికుడి- పిడుగురాళ్ల లైనులో పలు ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురజాల సమీపంలో దండివాగు పొంగి పొర్లటంతో పట్టణంలోని నాలుగు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో సుమారు నాలుగు వందల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్టాండ్‌లో షెడ్లు గాలికి కొట్టుకుపోయాయి. రోడ్లపై మూడడుగుల అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. వెంకట్రామరాజు కాలనీ, మేదరకాలనీలతో పాటు రెంటచింతలలో గోలివాగు వరద ఉద్ధృతికి లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ఇళ్లలో సామానులు సైతం వరదలో కొట్టుకుపోయాయి. పశుగ్రాసం వరదనీటి పాలైంది. గోలివాగు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోతున్న ఓ లారీ డ్రైవర్‌ను రెంటచింతల ఎస్‌ఐ చొరవతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మాచర్ల, వెల్దుర్తి వద్ద చంద్రవంక వాగు పొంగి పొర్లటంతో రాకపోకలు స్తంభించాయి. శివారు కాలనీలను వరదనీరు చుట్టుముట్టింది. దాచేపల్లి సమీపంలో నాగులేరు వాగు వరదనీరు రోడ్డుపై ప్రవహించటంతో హైదరాబాద్- గుంటూరు మార్గంలో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల కారణంగా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామంలో గోడకూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఇదిలా ఉండగా పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరింది. మంగళవారం 17 టిఎంసిలకు పైగా వరదనీరు చేరింది. ఇన్‌ఫ్లోగా 10వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో ముంపు గ్రామాలైన చిట్యాల, చిట్యాల తండా, కోళ్లూరు, వేమవరం, కేతవరం, పులిచింతల, మాదిపాడు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరద ఉద్ధృతి పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు గుంటూరు నగరంతో పాటు పల్నాడు ప్రాంతంలో పలు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. లైన్లు తెగిపడ్డాయి. గురజాల, మాచర్ల మండలాల్లోని పలు గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. గురజాల బస్టాండు, ఆర్డీవో కార్యాలయాలను వరదనీరు చుట్టుముట్టింది. దుర్గి మండలంలో అత్యధికంగా 28 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
పొంగిపొర్లుతున్న నల్లవాగు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా జడివాన కురిసింది. సోమవారం రాత్రి దాదాపు రెండున్నర గంటలపాటు కుండపోత వర్షంతో ఒంగోలు నగరంలో వీధులన్నీ జలమయమయ్యాయి. సోమవారం రాత్రినుండి మంగళవారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తునే ఉంది. ఈ భారీ వర్షాలకు వాగులు, వంకల్లోకి నీరుచేరాయి. ప్రధానంగా కొత్తపట్నం -ఒంగోలు మధ్య నల్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కొత్తపట్నం - ఒంగోలు మధ్య రాకపోకలు ఆగిపోయాయి. నల్లవాగుపై బ్రిడ్జి పనులు చేస్తున్న అధికారులు డైవర్షన్ రోడ్డును తాత్కాలికంగా వేశారు. ప్రస్తుతం డైవర్షన్ రోడ్డుపై వరదనీరు భారీగాప్రవహిస్తుండటంతో అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు. ఇదిలాఉండగా ఒంగోలుకు సమీపంలోని క్విస్‌కాలేజి దగ్గర ఉన్న నల్లవాగు ఉద్ధృతంగాప్రవహిస్తుండటంతో బియ్యంతో వెళ్తున్న లారీ తిరగబడింది. వెంటనే లారీలోని బియ్యాన్ని వేరొక లారీకి ఎక్కించి సురక్షిత ప్రదేశానికి తరలించారు. అదేవిధంగా త్రిపురాంతకంలోని పాత అన్నసముద్రం చెరువుతెగిపోవటంతో రోడ్డుమీద నీరు ప్రవహిస్తోంది. ఇదిలాఉండగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోని పలుపల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కర్నూలురోడ్డులోని అపార్ట్‌మెంటు సెల్లార్లల్లోకి భారీగా వరదనీరు రావటంతో ఆయిల్ ఇంజన్ల సహాయంతో నీటిని బయటకు తోడుతున్నారు. రాత్రి 10నుంచి రెండున్నర గంటలపాటు భారీ వర్షం కురవడంతో ఒంగోలు ఆర్‌టిసి డిపో గ్యారేజిలోను, బయట మోకాల్లోతు నీరు చేరింది. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రినుండి మంగళవారం ఉదయం వరకు సరాసరిన 57.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా నెలకు సరాసరినా 133.6మిల్లీమీటర్లు కురవాల్సిఉండగా ఇప్పటివరకు 85మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని సంతనూతలపాడు మండలంలో అత్యధికంగా 185.2మిల్లీమీటర్లవర్షపాతం నమోదైంది.
పులిచింతలకు జలకళ
అచ్చంపేట: ఎగువన కురుస్తున్న భారీవర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. మంగళవారం సాయంత్రానికి నీరు 19.3680 టిఎంసిలకు చేరింది. ఎగువ నుంచి 1,02,330 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వచ్చిచేరుతుంది. 4 స్లూయిజ్‌ల ద్వారా 12,552 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఎఇ రాజశేఖర్ తెలియజేశారు.

ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం

పెరుగుతున్న గోదావరి
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 13: ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతోంది. మంగళవారం రాత్రికి ధవళేశ్వరం బ్యారేజి వద్ద 10 అడుగుల నీటి మట్టం నమోదైంది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలోని భద్రాచలం వద్ద వరద నిదానంగా పెరుగుతోంది. దీని ప్రభావంతో ధవళేశ్వరం వద్ద సాయంత్రం ఐదు గంటలకు 9.8 అడుగులు నమోదయితే, ఆరు గంటలకు 10 అడుగులకు చేరుకుంది. అదే విధంగా భద్రాచలం వద్ద సాయంత్రం 29.30 అడుగుల నమోదు కాగా రాత్రికి 29.9 అడుగులకు చేరుకుంది.

chitram...
ప్రకాశం జిల్లా నల్లవాగులో బోల్తాపడిన లారీ

మాచర్ల- గుంటూరు మార్గంలో దండివాగు వరద
ఉద్ధృతికి కొట్టుకుపోయిన రైల్వేట్రాక్