తెలంగాణ

అయుతం... అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి/జగదేవ్‌పూర్ డిసెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తలపెట్టిన అయుత చండీయాగం అద్భుతంగా ప్రారంభమైంది. వేదమంత్రాల ఘోషతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. గురు ప్రార్థనతో చండీమాత విగ్రహం ముందు తొలిరోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి దంపతులు, గవర్నర్ దంపతులతో వేద పండితులు మహాగణపతి పూజ, మహాసంకల్పం చెప్పించారు. గోపూజ, మహామంటప స్థాపనం, చండీయంత్ర లేఖనం, యంత్ర ప్రతిష్ఠ, దేవతా అవాహనం, ప్రాణప్రతిష్ట, నవావరణార్చన, ఏకాదశ న్యాసపూర్వక సహస్ర చండీ పారాయణం, పంచబలి, యోగినీ బలి, మహారుద్రయాగ సంకల్పం, రాజశ్యామల, మహరుద్ర పునశ్చరణా చతుర్వేద యాగ ప్రారంభం, మహా సౌరం, ఉక్తదేవతా జపాలు, మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు వేద మంత్రాలను రుత్విక్‌లు నిరాటకంగా నిర్వహించారు. కర్నాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలకు చెందిన రుత్విక్‌లు మొదటిరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కర్నాటక, అనంతరం మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల పండితులు యాగంలో పాల్గొని చండీ మాత మంత్రాలను పఠించారు. సాయంత్రం ప్రారంభమైన యాగంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాలాసాహెబ్ బోస్లే హాజరై పాల్గొన్నారు. శ్రీశైలం జగద్గురువు చన్‌సిద్రామ పండితారాధ్య, ఆర్ట్ ఆఫ్ లీవింగ్ వ్యవస్థాపకులు డాక్టర్ రవిశంకర్, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, చందూలాల్, రాజ్యసభ సభ్యులు, టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్, ఎంపిలు కవిత, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మిత సభర్వాల్, హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, హైదరాబాద్, మెదక్ కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రొనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.
పటిష్ఠ బందోబస్తు
వేదోపాసనలు చేసిన వందలాది మంది రుత్విక్కులతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహింపజేస్తున్న అయుత చండీ మహాయాగాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. మొదటి రోజున ప్రారంభమైన యాగాన్ని తిలకించడానికి భక్తులు తక్కువగా వస్తారని నిర్వాహకులు అంచనా వేయగా అందుకు భిన్నంగా వేలాదిగా తరలివచ్చారు. యాగానికి తరలివస్తున్న భక్తులను పోలీసులు మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి లోపలకు అనుమతిస్తున్నారు. యాగాన్ని తిలకిస్తూ చుట్టూ ఒక ప్రదక్షిణ నిర్వహించే అవకాశం లభించడంతో చుట్టూ పూర్తి చేయడానికి భక్తులకు కనీసం రెండు గంటల పాటు క్యూ లైన్‌లో నిల్చున్నారు.
సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, స్మార్ట్ ఫోన్లలలో యాగ నిర్వహణ దృశ్యాలను చిత్రీకరించడంతో మిగిలిన భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. యాగ దర్శనం అనంతరం బయటకు వెళ్లే భక్తుల్లో పురుషులకు లడ్డూ, అయుత యాగ విశిష్టత, ప్రతిఫలం, నిర్వహించే విధానానికి సంబంధించిన పుస్తకాన్ని అందజేసారు. మహిళా భక్తులకు లడ్డూ, పుస్తకం, పసుపు, కుంకుమలను మహాప్రసాదంగా అందజేసారు. తొలిరోజు నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమంలో సుమారు 2 వేల మంది మహిళలు పాల్గొన్నారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసారు. మహిళలు, పురుషులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు ఏర్పాటు చేసారు. ఎర్రవల్లి గ్రామానికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉండడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసారు. ఐజి నవీన్‌చంద్, జిల్లా ఎస్పీ సుమతి పర్వవేక్షణలో వేలాది మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసారు. గౌరారం, మర్కుఖ్ మీదుగా విఐపిలు ఎక్కువ సంఖ్యలో చేరుకోగా, సాధారణ భక్తులు గణేష్‌పల్లి మీదుగా యాగ స్థలికి చేరుకున్నారు. యాగ సందర్శన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులకు అన్నదానం నిర్వహించారు. భోజనశాలలో కూడా భక్తులు క్రమపద్ధతిలో భుజించి సంతృప్తిగా స్వస్థలాలకు చేరుకున్నారు. ఇంతటి మహాయాగం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ధన్యుడయ్యారంటూ పలువురు భక్తులు అభినందించడం విశేషం. మహోన్నత కార్యక్రమాన్ని దేశ ప్రజలకు అందించేందుకు వివిధ మీడియా చానళ్లు, పత్రికల ప్రతినిధులు చేరుకోవడంతో వారి సౌకర్యార్థం బిఎస్‌ఎన్‌ఎల్, రిలయెన్స్ సంస్థలు వైఫై సేవలను ఉచితంగా అందించి ఫొటోలు, వీడియో క్లిప్పింగులను పంపించుకునే వెసులుబాటు కల్పించాయి. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, అత్యవసర సేవల నిమిత్తం వైద్య శిబిరం, అంబులెన్స్, అగ్నిమాపకదళాన్ని అందుబాటులో ఉంచారు. యాత్రికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు చెందిన పలువురు యువకులు స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం అందించారు.

అయుత చండీయాగం ప్రారంభానికి
ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న వేద పండితులు... యాగశాలకు విచ్చేసిన తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి, శ్రీశైలం జగద్గురువు సిద్దిరామ పండితారాద్య శివాచార్య, పండిట్ రవిశంకర్‌లకు స్వాగతం పలుకుతున్న దృశ్యం