ఆంధ్రప్రదేశ్‌

నీట మునిగి ఏడుగురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/ మచిలీపట్నం/ మొగల్తూరు, జూలై 31: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం కడప, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో మూడు వేర్వేరు సంఘటనల్లో ఏడుగురు వ్యక్తులు నీట మునిగి చనిపోయారు. కడప జిల్లాలో పెన్నానది ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లి నీటిలో గల్లంతై ముగ్గురు బాలురు మృతి చెందారు. కడప నగరం దండోరా కాలనీకి చెందిన ఒక కుటుంబం పెన్నానది ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లింది. అక్కడ ఉన్న మరికొందరు బాలురతో కలిసి మొత్తం ఆరుగురు బాలురు సరదాగా సిద్దవటం సమీపంలోని మాచుపల్లె ఏరులో నీటిలోకి దిగారు. అయితే ప్రవాహం ఎక్కువ కావడంతో ఆ విద్యార్థులు గల్లంతయ్యారు. జాలర్లు ముగ్గురు విద్యార్థులను రక్షించగలిగారు. అయితే కడప నగరం బెల్లం మండికి చెందిన షేక్‌సుహాల్ (10), దండోరా కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రాయపాటి అఖిలేష్ (9), రాయపాటి కిరణ్‌కుమార్ (10) మృతదేహాలు రాత్రి 7 గంటల సమయంలో లభ్యమయ్యాయి.
కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్‌లో ఇద్దరు స్నేహితులు నీట మునిగి మృతి చెందారు. కొండపల్లికి చెందిన టేకుపూడి అక్షిత(19) ఆదివారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు అమర్లపూడి ప్రవీణ్ (20), పొన్నం ఆదర్శ్ (21), నల్లమోతి వినయ్ ప్రమోద్ (20), యడ్ల స్వాతి (19)తో కలిసి గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకున్న వీరంతా మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంగినపూడి బీచ్‌కు చేరుకున్నారు. వీరిలో అక్షిత, ప్రవీణ్ సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఉద్ధృతంగా వచ్చిన అలల తాకిడికి ఉక్కిరిబిక్కిరయ్యారు. గమనించిన స్థానిక బీచ్ ఫొటోగ్రాఫర్లు, పోలీసులు వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. కొన ఊపిరితో ఉన్న ఇద్దరిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు మృతిచెందారు.
జిల్లాలోని ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన పదిమంది ఒకే కుటుంబీకులు ఆదివారం ఉదయం పేరుపాలెం బీచ్‌కు వచ్చారు. వీరంతా సముద్ర స్నానం చేస్తుండగా కెరటాల తాకిడికి ముగ్గురు కొట్టుకుపోసాగారు. గమనించిన స్థానికులు వీరిలో ఒకరిని రక్షించగలిగారు. అయితే దాసరి కిరణ్ సుందర్ (35), నూక పేయి సూర్యప్రకాష్ (20) అనే ఇద్దరు మాత్రం గల్లంతయ్యారు. రెండు గంటల అనంతరం వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

మంగినపూడి బీచ్‌లో మరణించిన అక్షిత, ప్రవీణ్