ఆంధ్రప్రదేశ్‌

జీవన్మరణ సమస్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 31:‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య. రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయించే అంశం. ఇటువంటి అంశాన్ని సానుకూలంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానికి, కేంద్రానికి లేదా? ప్రధాని రెండు గంటలు కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీ ఎంపిలతో ఆయన సమావేశమై ప్రత్యేక హోదాపై లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఆ తరువాత విలేఖరులతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజనను ఆంధ్ర ప్రాంత ప్రజలు కోరుకోలేదు. చేయని తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి. విభజన సమయంలో రాజ్యసభలో ఏపి పక్షాన ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన జైట్లీ ఇప్పుడు మాట మార్చి, చేస్తున్న వ్యాఖ్యలు నన్ను ఆవేదనకు గురి చేస్తున్నాయ’ని చంద్రబాబు అన్నారు. రాజ్యసభలో హోదాపై జరిగిన చర్చ చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. జైట్లీ రాజ్యసభలో మాట్లాడుతూ ఏపికి చాలా నిధులు కేటాయించామని, ఫ్రండ్లీ పార్టీ అయినందువలన ఇంతకన్నా ఎక్కువ చేయలేమని చెప్పడం బాధాకరంగా ఉందని సిఎం అన్నారు. కనీసం ఆర్థిక లోటును కూడా భర్తీ చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఏపికి నిధులు కేటాయించారని, గతంతో పోల్చి చూస్తే కేటాయింపుల శాతం తక్కువేనని అన్నారు. దేశంలోని మెజార్టీ పార్టీలన్నీ ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని చెప్పినా, కేంద్రం పట్టించుకోపోవడమేంటని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తనకున్న ఒక ఎంపి స్థానాన్ని కూడా సురేష్ ప్రభుకు ఇచ్చామని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ఈ నిర్ణయం తీసుకున్నామని సిఎం చెప్పారు. మరి ఆ కృతజ్ఞతను కేంద్రం చూపడంలేదు కదా? అని విలేఖరులు ప్రశ్నించగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నానని, ప్రజలు దీన్ని గమనిస్తున్నారని, అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అన్యాయం, విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చ, మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపి ఎక్కడుంది? అన్న అంశాలను ప్రధానికి పూర్తిగా వివరించేందుకు తెలుగుదేశం పార్లమెంటరీ బృందం ప్రధాని అపాయింట్‌మెంట్‌ను కోరుతోందని చంద్రబాబు చెప్పారు. సోమవారం వీరు ప్రధానిని కలిసే అవకాశం ఉందని అన్నారు. అలాగే సోమవారం పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపిలు నిరసన తెలియచేస్తారని ఆయన చెప్పారు. బంద్‌లు, ఆందోళనలు చేయడం వలన రాష్ట్రానికి మరింత నష్టం తప్ప, ఒరిగేదేమీ ఉండదని సిఎం అన్నారు. ఈ నిరసన ఢిల్లీలో చేయాలని, కేంద్రంపై వత్తిడి తేవాలని విపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. న్యాయం కోసం కేంద్రంపై పోరాటానికి తాము కూడా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ముందు జపాన్ తరహా నిరసన తెలియచేస్తామని చెప్పారు. లక్ష్యానికి మించిన పనులు చేయడం, రోడ్లు ఊడ్చి నిరసన తెలియచేస్తామని ఆయన చెప్పారు.
అనుభవంతో చెబుతున్నా...!
‘ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దేనికైనా ప్రజలే చివరి నిర్ణేతలు అని కేంద్రం గుర్తించాలి. నా రాజకీయ అనుభవంతో రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు వేరే ప్రాధాన్యతలు లేవు. ప్రలోభాలు లేవు. నాకు హైకమాండ్ లేదు. ప్రజలే నాకు హై కమాండ్. హోదాకోసం అనేకసార్లు ఢిల్లీ పెద్దల్ని కలిశాను. కానీ ప్రయోజనం కనిపించలేదు. ఇప్పటికైనా ప్రధాని స్పందించాలి’ అని చంద్రబాబు అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయడాన్ని ఒక అవకాశంగా తీసుకుంటున్నాననీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సినవన్నీ రాబట్టుకోవడం ఒక సవాలుగా తీసుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు.
ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు!
ఓపక్క రాష్ట్రానికి న్యాయం చేయాలని తాను కోరుతుంటే, విపక్ష నేత ఉన్మాదిలా వ్యవహరిస్తూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా కేంద్రంతో ఘర్షణకు దిగితే, భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తితో ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
chitram...
విలేఖరులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు