ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 28: ప్రభుత్వ శాఖల్లోని ఎస్సీ,ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ స్పష్టం చేశారు. విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాల వారీగా ఎస్సీ,ఎస్టీ పోస్టుల ఖాళీల వివరాలను సేకరించామని, త్వరలోనే వీటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించే అంశంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో చర్చిస్తున్నామని, నిధులు పక్కదారి పడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలోని తొమ్మిది ఐటిడిఎల్లో ఎస్టీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించామని తెలిపారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారులను ఆదేశించామన్నారు. అలాగే సీజన్‌లో ముందస్తు చర్యల్లో భాగంగా ఏజెన్సీ గ్రామాల్లోని ప్రతి ఇంటికి దోమతెరలతో పాటు మెడికల్ కిట్‌ను పంపిణీ చేయాలని, వైద్యాధికారులు, సిబ్బంది సహా అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించామన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో చోటుచేసుకుంటున్న జాప్యంపై ఆయన స్పందిస్తూ కేసుల విషయంలో ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొమ్మిది జిల్లాల్లో విస్తృతంగా పర్యటించానని, ఎస్సీ,ఎస్టీల స్థితి గతులు, వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. కొన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కుల వివక్ష అమల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ,ఎస్టీలకు పదోన్నతుల కల్పనలో అన్యాయం జరుగుతోందన్నారు.

అనంతలో మహిళ దారుణహత్య

పెనుకొండ, జూన్ 28: అనంతపురం జిల్లా పెనుకొండ మండల పరిధిలోని గుట్టూరులో ఓ మహిళలు దుండగులు దారుణంగా హత్య చేశారు. బండరాయితో తలపై మోదడడంతో బోయ నాగలక్ష్మమ్మ(48) అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి, గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, బోయ నాగలక్ష్మమ్మ దంపతులకు ముగ్గురు పిల్లలు. మంగళవారం ఉదయం నాగలక్ష్మమ్మ తమ పొలంలో పని చేసేందుకు వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆంజనేయులు వెళ్లి చూడగా అక్కడ ఆమె శవం కనిపించింది. గుర్తుతెలియని దుండగులు బండరాయితో మోదడంతో తల ఛిద్రమై నాగలక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కాగా రక్తసంబంధీకుల మధ్య ఉన్న భూమి వివాదాలే నాగలక్ష్మమ్మ హత్యకు కారణమని తెలుస్తోంది. ఎస్‌ఐ లింగన్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

సంగీతా ఛటర్జీకోసం మరోసారి పిటిషన్

చిత్తూరు, జూన్ 28: కలకత్తాకు చెందిన మహిళా ఎర్రచందనం స్మగ్లర్ సంగీతా ఛటర్జీ కోసం చిత్తూరు పోలీసు బృందం కలకత్తాకు తరలి వెళ్లింది. ఇప్పటి వరకు బెయిల్‌పై ఉన్న ఆమెను తమకు అప్పగించాలని చిత్తూరు పోలీసులు కలకత్తా కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన స్మగ్లర్లకు మధ్యవర్తిగా ఉంటూ ఆర్థిక లావాదేవీలను నడుపుతన్న కలకత్తాకు చెందిన మహిళా స్మగ్లర్ సంగీతా ఛటర్జీని అరెస్టు చేయడానికి జిల్లా పోలీసులు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నా అక్కడ కోర్టు వరుసుగా బెయిల్ ఇస్తుండంతో వీలు కాని పరిస్థితి నెలకొంది. అయితే ఇటీవల కలకత్తా కోర్టు ఇచ్చిన బెయిల్ గడువు మంగళవారంతో ముగియనుండంతో, చిత్తూరు జిల్లాలో ఆమెపై పలు కేసులు ఉన్న నేపథ్యంలో ఆమెను తమకు అప్పగించాలని చిత్తూరు పోలీసులు తాజాగా కోర్టులో పిటీషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.

పేలిన బాయిలర్..ఏడుగురికి గాయాలు

తోటపల్లిగూడూరు,జూన్ 28; నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం నేలటూరులో ఎన్‌సిసి ధర్మల్ పవర్ ప్లాంట్‌లో మంగళవారం మధ్యాహ్నం బాయిలర్ పేలి ఏడుగురికి తీవ్ర గాయాలైనాయి. ఇందులో ఇద్దరికి ప్రమాద స్థాయి తీవ్రం కావడంతో అత్యవసర చికిత్స నిమ్మిత్తం చెన్నైకి తరలించారు. పోలీసులు,స్థానికుల సమాచారం మేరకు ధర్మల్ విద్యుత్ ప్లాంట్‌లోని కోన్ క్లీనింగ్ బాయిలర్‌లో పనులు జరుగుతుండగా హఠాత్తుగా మంటలు చెలరేగడంతో అందులో పని చేస్తున్న ఏడుగురు కార్మికులకు తీవ్ర గాయాలైనాయి. శ్రీకాకుళంకు చెందిన హరిబాబు,శ్రీనివాసులు,బీహర్‌కు చెందిన యాదవ్, సచరిత, సుమంత్ కుమార్, మంతియాజ్, హరిభట్ట, దిచత్ర గాయపడినవారిలో ఉన్నారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై తరలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నటు రూరల్ డిఎస్‌పి తిరుమలేశ్వరరెడ్డి తెల్పారు.

రైతు నేపథ్యంతో 101వ సినిమా:బాలయ్య

హిందూపురం, జూన్ 28: తన తదుపరి చిత్రం గురించి హీరో బాలకృష్ణ హిందూపురంలో మంగళవారం ప్రకటించారు. రైతు నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందన్నారు. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న వందవ సినిమా శాతకర్ణి చిత్ర నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. రైతు నేపధ్యంలో 101వ సినిమా ఉంటుందని ఆయన అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గత ఎన్నికల సందర్భంగా వందో సినిమాకే పరిమితమవుతానని, ఇకపై రాజకీయాలకు పూర్తిసమయం కేటాయించి ప్రజాసేవలో పాలు పంచుకుంటానని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా మంగళవారం బేవినహళ్ళిలో జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకుల్లో ఉన్నా రైతు రుణమాఫీ అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు.

‘ఉచితం’తో సోమరులను చేస్తున్నాం: విశాఖ ఎమ్మెల్యే

విశాఖపట్నం, జూన్ 28: ఉచితం పేరుతో ప్రజలను సోమరులను చేస్తున్నామన్న అభిప్రాయాన్ని విశాఖ (నార్త్) ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యక్తం చేశారు. విశాఖలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై సమీక్షా సమావేశాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం యాంత్రీకరణ, పంటల వేసే విధానంలో మార్పుపై చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకుని వ్యవసాయ పనులు చేసేందుకు రైతులకు పనివారు లభించక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనికి ఆహార పథకం వద్దని, సబ్బిడీల మొత్తాలను తగ్గించాలన్నారు. నాలా పన్నును 9 శాతం వసూలు చేస్తున్నారని, తెలంగాణలో రెండు శాతానికి తగ్గించారని గుర్తు చేశారు. ఉచితం పేరుతో 5 రూపాయలకు ఆహారం, తక్కువ ధరలకు ఇతర దినుసుల సరఫరా వల్ల జనాన్ని సోమరులుగా చేస్తున్నామని వ్యాఖ్యానించారు. రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. అవసరం ఉన్న వారికే ఈ పథకాలను వర్తింప చేయాలని కోరారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అక్కడ ఉన్న మంత్రి, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, జిల్లా అధికారులు అవాక్కయ్యారు.

504.6 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం

విజయపురిసౌత్, జూన్ 28: శ్రీశైలం జలాశయం నుండి నాగార్జున సాగర్ జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోవడంతో సాగర్ జలాశయం నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది. మంగళవారం సాయంత్రానికి సాగర్ జలాశయం నీటిమట్టం 504.6 అడుగులకు చేరుకుంది. ఇది 122.6853 టీఎంసీలకు సమానం. జంట నగరాల వాసులకు మంచినీటి అవసరాల నిమిత్తం ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 779.9 అడుగులకు చేరుకుంది. ఇది 20.3038 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి నీటి సరఫరా నిలిచిపోవడంతో సాగర్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఎగువ జలాశయాలైన రోజా, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి శ్రీశైలం జలాశయానికి నీటి చేరిక పూర్తిగా నిలిచిపోయినట్లు సాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా 12 రైతు బజార్లు

విశాఖపట్నం, జూన్ 28: రాష్ట్రంలో కొత్తగా 12 రైతు బజార్లను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. విశాఖలోని ఎంవిపి రైతు బజార్‌లో రైపనింగ్ చాంబర్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన జెడ్పీ సమావేశ మందిరంలో వ్యవసాయ, దాని అనుబంధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో 80 రైతు బజార్లు ఉన్నాయని తెలిపారు. అందులో 50 బజార్లను ఆధునీకరించామని వివరించారు.మిగిలిన వాటిని త్వరలో ఆధునీకరిస్తామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా 300 సంచార రైతు బజార్లను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రజల వద్దకే తాజా కాయగూరలు చేర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కూరగాయలు నిల్వ చేసేందుకు శీతలీకరణ గిడ్డంగులు, పండ్ల కోసం రైపనింగ్ చాంబర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని రైతు బజార్లలో ఈ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పొలం నుంచి ప్రధాన రహదారిని అనుసంధానం చేస్తూ లింక్ రోడ్లను 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్నామన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని నూరు శాతం రాష్ట్రంలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. డ్వాక్రా సంఘాల మహిళల సాయం తీసుకుని విజయవంతం చేసేందుకు నిర్ణయించామన్నారు.

రేషన్ షాపుల్లో
చంద్రన్న రంజాన్ తోఫా

మదనపల్లె, జూన్ 28: ముస్లింలు సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకోవాలని లక్ష్యంతో రేషన్ షాపుల్లో చంద్రన్న రంజాన్‌తోఫా అందిస్తున్నాం, జూలై మొదట్నించి రాష్ట్రంలోని 13జిల్లాలో పంపిణీకి శ్రీకారం చుట్టాలని కూడా అన్ని జిల్లాకలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. కుటుంబసమేతంగా చిత్తూరుజిల్లా కాణిపాకం దర్శనానికి వెళ్తూ మార్గమధ్యంలో మదనపల్లె ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో మాట్లాడుతూ రంజాన్ కానుకగా ముస్లింలకు 5కేజిల గోధుమపిండి, రెండుకేజిల చక్కెర, కేజి సేమియా, వందగ్రాముల నెయ్యి, బ్యాగుతో చంద్రన్న రంజాన్‌తోఫా అందిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11లక్షల కార్డుదారులకు తోఫా పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సర్పంచ్, కౌన్సిలర్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యే, జడ్‌పి చైర్మన్‌లు, జడ్‌పిటిసి, ఎంపిటిసి, ఎంపిపి, చైర్మన్‌లు సైతం రంజాన్‌తోఫా ఆయా ప్రాంతాలలో ప్రారంభించాలన్నారు.

కొలిక్కిరాని పుష్కర తొక్కిసలాట విచారణ

రాజమహేంద్రవరం, జూన్ 28: గత ఏడాది గోదావరి మహా పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట దుర్ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ ఒక కొలిక్కిరాలేదు. ఆరు నెలల్లోగా విచారణ పూర్తిచేయడానికి గత ఏడాది సెప్టెంబర్ 15న ప్రభుత్వం జస్టిస్ సివై సోమయాజులు అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఇప్పటికే కమిషన్ కాలపరిమితిని మూడు నెలలు పొడిగించారు. ఈ గడువు బుధవారంతో ముగియనుంది. అయినా ఇప్పటివరకు కమిషన్ విచారణ పూర్తికానందున మరోసారి పొడిగింపు అనివార్యమవుతోంది. నాటి తొక్కిసలాటలో 29మంది మృత్యువాత పడగా, 51మంది గాయపడ్డారు. ప్రభుత్వం నియమించిన కమిషన్ 2015 సెప్టెంబర్ 29న బాధ్యతలు చేపట్టింది. ఈ ఏడాది జనవరి 18న నిర్వహించిన తొలి విచారణకు సాక్షులు ఎవరూ రాకపోవడంతో వాయిదా పడింది. ఫిబ్రవరి 23న రెండోసారి విచారణ జరిగి వాయిదాపడింది. మార్చి 21న మూడవ సారి విచారణ జరిగింది. అప్పటికీ ప్రభుత్వం తరపున అఫిడవిట్లు దాఖలుకాలేదు. ఈ విచారణలో బార్ కౌన్సిల్ నాయకులు, న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, మరో 26 మంది తమ అఫిడవిట్లు దాఖలుచేశారు. ప్రభుత్వ తరపున అఫిడవిట్లు దాఖలుకు అధికారులు రెండు వారాల గడువు ఇవ్వాల్సిందిగా కోరారు. మార్చి 29వ తేదీతోకమిషన్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కమిషన్ కాలపరిమితి మరో మూడు నెలలు పొడిగిస్తూ ఏప్రిల్ 27న జీఓ నెంబర్ 99ని జారీచేసింది. ఈ నెల 29వ తేదీ (బుధవారం)తో ఆ గడువు పూర్తికానుంది. కానీ అధికారుల నుంచి అఫిడవిట్లు మాత్రం దాఖలు కాలేదు. కమిషన్ ఈ నెలలోనే నాలుగు సార్లు విచారణ జరిపింది. చివరిగా మంగళవారం జరిగిన విచారణలో కూడా అఫిడవిట్లు దాఖలుకు మరో రెండు వారాల పాటు గడువు కావాలని అధికార యంత్రాంగం కోరింది.