ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 26: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో రూ.4.22 కోట్లు హుండీ ద్వారా సమకూరాయి. ఇటీవల కాలంలో ఆలయ లెక్కల ప్రకారం ఇదే రికార్డు ఆదాయంగా నిలిచింది. శనివారం ఆలయ హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను ఆదివారం లెక్కించారు. అజ్ఞాత భక్తులు కొందరు భారీస్థాయిలో హుండీలో కానుకలు సమర్పించడంతో శ్రీవారి ఆదాయం నాలుగు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. 2012 జనవరి 3వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రూ. 4.25 కోట్లు లభించింది. అలాగే వేసవి రద్దీ నేపథ్యంలో 2014 జూన్ 22న సుమారు రూ.4.45 కోట్లు లభించింది. అంతకుముందు ఒకే రోజున రూ.5.5 కోట్లు లభించడం ఇప్పటివరకు రికార్డుగానే ఉంది. కాగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. గదులు కోసం, తలనీలాలు సమర్పించడం కోసం, స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు 63,487 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు 10 గంటల సమయం పడుతుండగా, కాలినడక భక్తులకు కల్పించే దివ్యదర్శనానికి 7 గంటల సమయం పడుతోంది.
భార్య, కుమారుడిని కాపాడి
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
నూజెండ్ల, జూన్ 26: విద్యుదాఘాతానికి గురైన భార్య, కుమారుడుని కాపాడి భర్త మృత్యువాత పడిన సంఘటన గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని తంగిరాల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆవులమంద శ్రీను (26) తన కొట్టంలోని ఎద్దులకు నీళ్లు తాగించేందుకు వెళ్లగా అదే సమయంలో భార్య రామాంజమ్మ, నాలుగేళ్ల కుమారుడుతో పక్కనేవున్న పొలంలోకి బహిర్భూమికి వెళ్లింది. పొలానికి ఉన్న కంచె దాటే సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడి విద్యుదాఘాతానికి గురైంది. ఇది గమనించిన శ్రీను భార్య, కుమారుడు లక్ష్మయ్యను కంచెమీద నుంచి నెట్టి కాపాడాడు. అయితే శ్రీను మృత్యువాతపడ్డాడు. తీవ్రంగా గాయపడిన భార్య, కుమారుడు వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
తడిసి ముద్దయిన గోదావరి జిల్లాలు
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు/కాకినాడ, జూన్ 26: బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. శనివారం అంతా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవగా, ఆదివారం కాస్త జోరు తగ్గినప్పటికీ, రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది. పలుచోట్ల రైతులు ఖరీఫ్ సాగుకు సన్నాహాలు ప్రారంభించారు. అయితే శనివారం రాత్రి భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీయడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భీమవరం సమీపంలోని పెన్నాడలో విద్యుత్ వైర్లు తెగిపడటంతో దాదాపు 20 గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొగల్తూరు మండలం ముత్యాలపల్లిలోశనివారం అర్థరాత్రి మెరుపులుతో కూడిన వర్షం పడటంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామంలోని కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. హైవోల్టేజీ కారణంగా పలువురి టెలివిజన్లు కాలిపోయాయి. ఉండి మండలంలో విస్తారంగా పడుతున్న వర్షాలకు నారుమళ్లు నీట మునిగాయి. భీమవరం సమీపంలోని ఆకివీడులో వర్షాలకు రెండు ఇళ్ల గోడలు కూలిపోయాయి. ఈసందర్భంగా ఒక మహిళ గాయపడింది.

రూ.162 కోట్లతో
సింహాచలం
మాస్టర్‌ప్లాన్
మంత్రి గంటా వెల్లడి

సింహాచలం, జూన్ 26: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు 162 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం సింహగిరిపై కలెక్టర్ యువరాజ్, జివిఎంసి కమిషనర్ ప్రవీణ్ కుమార్, దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్‌తో కలిసి సింహాచలం మాస్టర్ ప్లాన్‌ని పరిశీలించి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి విలేఖరులకు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ఏటా సుమారుగా నలభై లక్షల మంది భక్తులు దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ఏటా కోటి మంది భక్తులు లక్ష్యంగా సౌకర్యాల కల్పనకు మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు మంత్రి చెప్పారు. అదనంగా మరో రెండు కోట్ల రూపాయలతో పచ్చదనం అభివృద్ధి చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. సింహగిరి, మెట్ల మార్గం, అడివివరం, పుష్కరిణీ, మార్కెట్ కలుపుకొని అయిదు విభాగాలుగా నాలుగు విడతలుగా అభివృద్ధి చేపడతామని ఆయన అన్నారు. అభివృద్ధి పనులకు దేవస్థానం నిధులే ఖర్చు చేస్తామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేవస్థానం ఆదాయం ఏటా నలభై కోట్ల రూపాయలు వస్తోందని మంత్రి వెల్లడించారు.
స్మార్ట్ సిటీకి స్పందన భేష్
విశాఖ స్మార్ట్ సిటీ కోసం చేసిన ప్రజాభిప్రాయ సేకరణకు విశేష స్పందన వచ్చిందని, నాలుగు లక్షలకు పైగా అభిప్రాయాలు వెల్లడించారని మంత్రి గంటా తెలిపారు. సింహగిరిపై ఎంతో విలువైన ఔషధ మొక్కలు ఉన్నాయని వాటిని రక్షించుకుంటూ అంతరించిపోయిన మొక్కలను పునరుజ్జీవం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. అడివివరంలో అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.

బిఆర్‌టిఎస్ రహదారి నిర్మాణానికి అతి త్వరలోనే ఆటంకాలు తొలగి పోనున్నాయని ఆయన చెప్పారు.

బాధితులకు స్థలానికి స్థలం ప్రత్యమ్నాయంగా ఇవ్వాలన్న నిబందన లేనప్పటికీ అడివివరం బాధితుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కేబినెట్‌లో చర్చించనున్నట్టు మంత్రి చెప్పారు.

రౌడీయిజాన్ని అణచివేశాం

హోంమంత్రి చినరాజప్ప వెల్లడి

ఎస్.రాయవరం, జూన్ 26: రాష్ట్రంలో పోలీస్ శాఖను ప్రక్షాళన చేసి, కట్టుదిట్టమైన చర్యలు అవలంబించి ఎర్రచందనం స్మగ్లింగ్, మహిళలపై వేధింపులు, భూ కబ్జాలు, రౌడీయిజాన్ని అణగదొక్కామని రాష్ట్ర హోం శాఖామంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విశాఖ జిల్లా, ఎస్.రాయవరం మండలంలోని అడ్డురోడ్డులో 70లక్షల రూపాయలతో నిర్మించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన సముదాయంతోపాటు నక్కపల్లిలోని కొత్త సర్కిల్ కార్యాలయాన్ని హోంమంత్రి చినరాజప్ప ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి రాజప్ప మాట్లాడారు. కొత్తగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు పోలీస్ బోర్డు రిక్రూట్‌మెంట్ చేపట్టిందని, పోలీస్ శిక్షణ అనంతరం సాంకేతిక శిక్షణను ఇస్తున్నామని పేర్కొన్నారు. పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేశామని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ఫైర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిస్తున్నామని ఆయన తెలిపారు. హోంగార్డులకు జీతాలు పెంచడంతోపాటు వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తోందని, రాజకీయ, గూండాయిజం, భూ కబ్జా, చోరీలు నివారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని మంజూరు చేసామని మంత్రి తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖా మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-మీరు కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమంలో పోలీసులు భాగస్వాములు కావాలని, ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జిల్లా ఎస్పీ రాహూల్‌దేవ్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిఐజి శ్రీకాంత్, ఎమ్మెల్యే వి.అనిత తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు
ప్రత్యేక బృందాలు
రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారికి పక్కనగల మద్యం దుకాణాలను మూసివేయించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రి చినరాజప్ప అన్నారు. నక్కపల్లి పోలీస్ సర్కిల్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. చోరీలకు పాల్పడే యువకులకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.

పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతోపాటు తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో విస్తరించనున్న పెట్రోకారిడార్ ఏర్పాటుకు అనువుగానే నక్కపల్లిలో ముందస్తుగా పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా ఈ పోలీస్ స్టేషన్‌కు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించడంతోపాటు ఎటువంటి చర్యలు చేపట్టాలో ముందుగానే పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌కు సూచనలిస్తారని హోంమంత్రి తెలిపారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖామంత్రి అయ్యన్నపాత్రుడు, స్థానిక ఎమ్మెల్యే వి.అనిత, రూరల్ ఎస్పీ విక్రమ్‌దేవ్‌శర్మ, ఎఎస్పీ ఐశ్వర్య రస్తోగి, జెడ్పీ చైర్మన్ లాలం భవానీ తదితరులు పాల్గొన్నారు.

మీ విజయ రహస్యం చెప్పండి!

విద్యుత్ రంగంలో వినూత్న పథకాలపై నివేదిక పంపండి
ఈపిడిసిఎల్ సిఎండి ముత్యాలరాజును కోరిన కేంద్ర విద్యుత్ శాఖ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 26: విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకురావడంతోపాటు భారతదేశంలోనే మరెక్కడా లేని వినూత్న పథకాలతో బహుళ ప్రయోజనాలు కల్పిస్తున్న ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) వరుస విజయాలకు సంబంధించి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఓ నివేదికను కోరింది. అలాగే వినియోగదారులకు ప్రయోజనం, విద్యుత్ శాఖకు సమయం ఆదా చేసే పలు పథకాలు దేశంలో పలు రాష్ట్రాలకు విస్తరించడం కోసం అవసరమైన సేవలు అందించాల్సిందిగా ఈపిడిసిఎల్ సిఎండి రేవు ముత్యాలరాజును ఈ శాఖ కోరింది. దీంతో విజయవంతంగా నిర్వహిస్తున్న పథకాల నివేదికను సంస్థ సిద్ధం చేస్తోంది. యాగ్రిగేట్, వాణిజ్య నష్టాలను (ఏటి అండ్ సి) 2015-16 సంవత్సరానికి 5.48 శాతానికి తగ్గించగలిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 6.32 శాతం మేర తగ్గించగలిగింది. ఈ విధంగా వాణిజ్య నష్టాలు తగ్గించడంతో సంస్థకు ఏకంగా రూ.300 కోట్ల మేర ఆదా చేయగలిగింది. అలాగే విద్యుత్ అమ్మకాలు(మీటర్డ్ సేల్స్) 81.67శాతం మేర పెంచి రెవెన్యూ లక్ష్యాలను అధిగమించింది. రెవెన్యూ వసూళ్ళ సామర్థ్యాన్ని ఏకంగా నూరు శాతానికి తీసుకువెళ్ళింది. ఇటీవల వినియోగదారుల సేవలను మరింత సులభతరంగా చేయడం కోసం ‘ఈస్ట్రన్ పవర్ ఏపిపి’ పేరుతో మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా విద్యుత్ సరఫరా పరిస్థితిని ప్రపంచ దేశాల్లో ఎక్కడి నుంచి అయినా తెలుసుకోవచ్చు. కొత్త విద్యుత్ కనెక్షన్ల కోసం స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం, అదీ ఫీల్డ్ ఆఫీసర్లు ఇళ్ళకు వెళ్ళి మరీ పేర్లను నమోదు చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధంగా అతి తక్కువ సమయంలో కనెక్షన్లు మంజూరు చేస్తోంది. దెబ్బతిన్న, మరమ్మతులకు నోచుకుని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి వాటి స్థానంలో కొత్త డిటిఆర్‌లను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు వీలుగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌ను(జిపిఎస్)ను అమలు చేస్తోంది. దీనివల్ల రైతులకు ఎక్కువుగా ప్రయోజనం కలుగుతుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, బ్రేక్ డౌన్లు తక్షణ పరిష్కారానికి ఈ విధానం తోడ్పడుతోంది. మొబైల్ ఎస్‌ఎంఎస్ ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులు, రసీదులు పొందే సరికొత్త విధానం ఒక్క ఈపిడిసిఎల్‌లోనే అమలవుతోంది. పైలెట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఆన్‌లైన్ స్పాట్ బిల్లింగ్ విధానం ద్వారా అక్రమాలకు తావు లేకుండా పోయింది. ఇటువంటి వినూత్న పథకాలను ప్రయోగంలోనే విజయవంతంగా నిర్వహిస్తున్న పరిస్థితులు దేశంలో ఉన్న 48 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో ఎక్కడా లేకపోవడాన్ని గుర్తించిన కేంద్ర విద్యుత్‌శాఖామంత్రి పియాష్ గోయాల్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీటన్నింటినీ నివేదిక రూపంలో సమర్పించాల్సిందిగా కోరడం జరిగింది. కనీసం మూడు మాసాలకోసారి అయినా విజయాలు సాధించిన పథకాలు, వినియోగదారులకు బహుళ ప్రయోజనం కలిగిస్తున్న మరిన్ని విధానాలను దేశంలో ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు తగిన సహయాన్ని అందించాల్సిందిగా కేంద్ర విద్యుత్‌శాఖామంత్రి ఆదేశించారు. అలాగే అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేస్తున్న ప్రయోగాలను దేశంలో ముఖ్యమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాలకు విస్తరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే గోవాలో ఆయా పథకాలపై నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో అనేక రకాలుగా సామర్థ్యాలను పెంచుకోవడం ద్వారా లక్ష్యాలను అధిగమిస్తున్న తీరు గురించి మూడు మాసాలోకోసారి సమీక్షలు, సమావేశాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, శిక్షణా తరగతులు తదితర మార్గాల ద్వారా మరింతగా అవగాహన కల్పించాల్సిందిగా కోరిన మీదట ఈపిడిసిఎల్ సిఎండి ముత్యాలరాజు స్పందించారు. సేవలందించేందుకు తాను సిద్ధమేనంటూ స్పష్టంచేశారు. అలాగే పలు పథకాల నివేదికను త్వరలో సిద్ధం చేసి సమర్పించనున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఐదు జిల్లాలతో కూడిన ఈపిడిసిఎల్ వార్షిక ఆదాయ(2016-17) లక్ష్యం పది వేల కోట్లకు చేరుకోవాలని నిర్ణయించింది. గత ఏడాది (2015-16)లో రూ. 7,740 కోట్లు సాధించింది. వినియోగదారులకు నాణ్యమైన, పారదర్శకతతో కూడిన సేవలనందించడం వలనే ఇది సాధ్యమని భావిస్తోంది.

చర్లలో మందుపాతర పేల్చిన మావోలు
వాల్‌పోస్టర్ల విడుదల భయాందోళనలో స్థానికులు
చర్ల, జూన్ 26: కొద్దిరోజులు స్తబ్దతగా ఉన్న మావోయిస్టులు ఆదివారం ఖమ్మం జిల్లా చర్ల మండల కేంద్రానికి కూతవేటు దూరంలో మందుపాతర పేల్చారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ సందర్భంగా మావోయిస్టులు పలు డిమాండ్లతో కూడిన వాల్‌పోస్టర్లను వదిలి వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల మండల కేంద్రంలోని పూజారిగూడెం గ్రామ సమీపంలోకి శనివారం రాత్రి కొంతమంది మావోయిస్టులు చేరుకున్నారు. ప్రధాన రహదారిపై మందుపాతర అమర్చి ఒక వైరు సాయంతో దాన్ని పేల్చివేశారు. ఘటన అనంతరం మావోయిస్టులు పలు డిమాండ్లతో అక్కడ వాల్‌పోస్టర్లు వదిలారు. మందుపాతర పేల్చింది రాత్రి 10.30 సమయం కావడంతో స్థానికులు, మండలవాసులు భయాందోళనలకు గురయ్యారు. మావోయిస్టులు వదిలిన వాల్‌పోస్టర్లలో వివరాలిలావున్నాయి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమని పోస్టర్‌లో ముద్రించారు. ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో బంద్‌కు పిలుపునిస్తున్నామని దీన్ని అందరూ పాటించాలని కోరారు. అమరవీరులకు నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. మావోయిస్టులు వదిలిన వాల్‌పోస్టర్లు ఖమ్మం జిల్లా కమిటీ పేరిట ఉన్నాయి. ఘటన అనంతరం పోలీసులు కూడా చర్ల మండలంలో గాలింపు ముమ్మరం చేశారు. ఆదివారం సంతలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ సంతకు వచ్చే ప్రతి ఒక్కరిని తనిఖీ చేశారు.