ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ దీక్ష విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 22: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు బుధవారం ఉదయం కిర్లంపూడిలోని తమ స్వగృహంలో ఉత్కంఠభరితమైన పరిస్థితుల నడుమ నిరాహార దీక్ష విరమించారు. కాపు జెఎసి నేతలు ముద్రగడ దంపతులకు నిమ్మరసం ఇచ్చి, దీక్ష విరమింపజేశారు. నిమ్మరసం సేవించే సమయంలో ముద్రగడ భార్య పద్మావతికి గొంతు సహకరించకపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. భార్య ఆరోగ్య పరిస్థితిని చూసి ముద్రగడ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. నిరాహార దీక్ష అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడిన ముద్రగడ తీవ్ర భావోద్వేగంతో కనిపించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి నుండి ముద్రగడ దంపతులు శుక్రవారం ఉదయం తమ స్వంత వాహనంలో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి చేరుకున్నారు. ఆయన వెంట కాపు జెఎసి నేతలు, అభిమానులు, బంధు మిత్రులున్నారు. అప్పటికే వేలాదిగా జనం అక్కడికి చేరుకున్నారు. ముద్రగడ వాహనం చేరుకోగానే ఘన స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం నుండి కిర్లంపూడి వరకు భారీ పోలీసు భద్రత కల్పించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి నుండి ముద్రగడ బయలుదేరగానే జాతీయ రహదారిలో వాహనాన్ని ఎక్కడా నిలిపే అవకాశం లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేయడం గమనార్హం. కిర్లంపూడిలో సాయుధ బలగాలను మోహరించారు. ముద్రగడ తన నివాసానికి చేరుకోగానే కాపు జెఎసి నేతలు, అభిమానులు ‘ముద్రగడ నాయకత్వం వర్ధిల్లాలి’, ‘కాపుల ఐక్యత వర్ధిల్లాలి’ అంటూ నినాదాలు చేశారు.
ముందుగా కాపు జెఎసి నాయకులు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ 14వ రోజుకు తమ నాయకుడు ముద్రగడ నిరాహార దీక్ష చేరడం, ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో దీక్ష విరమించాల్సిందిగా కోరినట్టు చెప్పారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుండి విడుదలయిన ముగ్గురు కాపు నేతలకు ఆసుపత్రిలో దీక్షలో ఉన్న తమ నేతను కలిసే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ నేత దీక్షలో ఉండగా ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపు జెఎసి ఆధ్వర్యంలో ముద్రగడ నాయకత్వంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బిసి జాబితాలో చేర్చేవరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. తుని ఘటనలో పునఃవిచారణ చేస్తామని, ఏ విధమైన అరెస్టులు ఉండవని ప్రభుత్వం చెప్పిందని, తరువాత మాట మార్చి అరెస్టులు ప్రారంభించారని ఆరోపించారు. బెయిల్‌పై వచ్చిన 13 మంది ముద్రగడను కలిశారని, భవిష్యత్‌లో జరిగే ఆందోళనకు ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ముద్రగడ అరెస్టు సమయంలో పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. ముద్రగడ భార్య పద్మావతిని బలవంతంగా లాక్కెళ్ళి వాహనం ఎక్కించారని, కుమారుడు, కోడలు తదితరులను అసభ్య పదజాలంతో దూషించి, కొట్టారని కాపు జెఎసి నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.
సమావేశంలో భాగంగా కాపు జెఎసి నేతలు ముద్రగడ రెండు చేతులూ పట్టుకుని దీక్ష విరమించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం దంపతులచే నిమ్మరసం తాగించి దీక్ష విరమించినట్టు ప్రకటించారు.