తెలంగాణ

బోర్డు పెత్తనం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: కృష్ణా నదీ జలాల యాజమాన్య మండలి (కృష్ణా రివర్ బోర్డు) తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. కృష్ణా జలాల పంపిణీని తన ఆధీనంలోకి తీసుకోవాలన్న బోర్డు నిర్ణయం పట్ల తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ అంశంతోపాటు గోదావరి, కృష్ణా నదులపై నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు సంబంధించి తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఆంధ్ర ప్రభుత్వంపై ప్రధానికి ఫిర్యాదు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈ అంశంపై వెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలసంఘానికి, కృష్ణా బోర్డు అధికారులకు వాస్తవాలు వివరించాలని నీటి పారుదల మంత్రి టి హరీశ్‌రావును మంత్రి మండలి ఆదేశించింది. అవసరమైతే సిఎం కూడా ఈ అంశంపై ప్రధాని మోదీని కలవాలని కేబినెట్ నిర్ణయించింది. సచివాలయంలో సిఎం కెసిఆర్ అధ్యక్షతన శుక్రవారం కేబినెట్ సమావేశం జరిగింది. విదేశాల్లోవున్న ఐటీ, మున్సిపల్ మంత్రి కెటిఆర్ వినా మంత్రివర్గ సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు. గోదావరి, కృష్ణా నదుల్లో తమకున్న వాటా మేరకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నా, ఆంధ్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు, అర్థరహిత వాదనలతో కేంద్రానికి లేఖలు రాస్తోందని మంత్రిమండలి అభిప్రాయపడింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన వాదనను గట్టిగా వినిపించాలని, తక్షణమే మంత్రి హరీశ్‌రావును ఢిల్లీకి పంపాలని నిర్ణయించారు. అలాగే గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని మంత్రిమండలి ఆమోదించింది.
ఇలాఉండగా గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలు, నీటి లభ్యత, ఎక్కువ నీటిని వినియోగించుకోవడానికి ప్రాజెక్టుల రీ-డిజైనింగ్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రాణహిత, దేవాదుల, కంతానపల్లి, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పి, వరద కాల్వ ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ అవశ్యకతను మంత్రిమండలి అంగీకరించింది. అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై నిగ్గు తేల్చడం, కమతాల ఏకీకరణ, భూముల క్రమబద్ధీకరణ, నిరూపయోగంగా ఉన్న భూముల వినియోగానికి అవసరమైన విధానాన్ని రూపొందించాలని రెవిన్యూ శాఖను మంత్రిమండలి ఆదేశించింది. సాదా బైనామాలు, మ్యుటేషన్లు, పౌతీల విషయంలో ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలు కట్టుదిట్టంగా అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి సైజ్ వైజ్ టెండర్లు పిలవాలని, స్థానికులకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. అర్చకులకు ప్రభుత్వ ఖజానానుంచే వేతానాలు చెల్లించేందుకు అవసరమైన విధానాన్ని రూపొందించేందుకు ఎండోమెంట్ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన ఉప సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఉప సంఘంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని, తుమ్మల నాగేశ్వర రావు సభ్యులుగా నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. దేవాలయాలకు వచ్చే ఆదాయంలో అక్రమాల నియంత్రణ, నిధుల దుర్వినియోగం తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దేవదాయ, ధర్మాదాయ, ధార్మిక సంస్థల్లో ట్రస్టీల సంఖ్యను పెంచాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. 25 లక్షల నుంచి కోటి రూపాయల ఆదాయం దాటిన సంస్థల్లో 9నుంచి 14మంది సభ్యులను, రెండు లక్షల నుంచి 25 లక్షల ఆదాయం కలిగిన సంస్థల్లో 5నుంచి 7గురు, రెండు లక్షల లోపు ఆదాయం కలిగిన సంస్థల్లో మూడు నుంచి ఐదుగురు సభ్యులను నియమించుకోవచ్చని మంత్రిమండలి నిర్ణయించింది. వరంగల్‌లో వ్యవసాయ కాలేజీ, వెటర్నరీ కాలేజీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయించింది. మెదక్‌లో నిమ్జ్, హైదరాబాద్‌లో ఫార్మా నిమ్జ్ ఏర్పాటుకు టిఎస్‌ఐసిసి హడ్కో నుంచి రూ.784 కోట్ల రుణం పొందడానికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలో మత్స్య శాస్త్ర కళాశాల ఏర్పాటుకు నిర్ణయించింది. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ జరగడంతో ఈ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రిమండలి అభిప్రాయపడింది. మైక్రో ఇరిగేషన్ ప్రోత్సాహానికి నాబార్డు నుంచి రూ. 1000 కోట్ల రుణానికి ప్రభుత్యం గ్యారంటీ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.