తెలంగాణ

రాజకీయ పునరేకీకరణే మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని, తెలంగాణ అంటే ఏమిటో దేశానికి అర్థం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టిడిపి, సిపిఎం పార్టీలకు చెందిన జెడ్‌పిటీసి, ఎంపిటీసిలు, ఎంపిపిలు, కౌన్సిలర్లు ముఖ్యమంత్రి అధికార నివాసంలో శుక్రవారం టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి కెసిఆర్ మాట్లాడారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ప్రత్యేక రాజకీయ సందర్భంలో ఉందని తెలిపారు. తెలంగాణ భావి తరాల కోసం వర్తమాన సమాజం రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో తమ వంతు బాధ్యతగా నూతన పంథాలో ముందుగు సాగాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాజకీయ ఆలోచనా సరళి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు ప్రస్ఫుటం చేశాయని అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ బలోపేతం కావడాన్ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ విషయం ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో రుజువైందని అన్నారు. ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును గెలిపిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు దీనికి నిదర్శనమన్నారు. మధిర నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు టిఆర్‌ఎస్‌లో చేరడాన్ని తాను రాజకీయంగా భావించడం లేదని, తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా కలిసి పోరాడుదామన్న పిలుపును ఇచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. సాధించుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలంటే వట్టి మాటలు చాలవని అదే స్ఫూర్తితో గట్టిపని తలపెట్టాలన్నారు. రాజకీయ పునరేకీకరణ జరగాలి, తెలంగాణ అంటే ఏమిటో దేశానికి అర్థం కావాలన్నారు. ఇప్పటికే మనం ఆ దిశగా ప్రయాణం సాగిస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజల నీటి అవసరాల కోసం మునే్నరు వాగు మీద కనీసం చెక్ డ్యాం కూడా కట్టనివ్వకుండా కట్టడి చేసిన ఆంధ్రా పాలకులు ఖమ్మం జిల్లాను ఆనుకుని పారే గోదావరి జలాలను ఇన్నాళ్లు వాడుకోనివ్వలేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో మన నీటిని మనం వాడుకునే స్వాతంత్య్రం నేడు తెలంగాణకు వచ్చిందని స్పష్టం చేశారు. గోదావరి జలాలలను అవసరం అయితే కృష్ణా ఆయకట్టుకూ వినియోగించుకునే విధంగా రూపుదిద్దుకుంటున్న సీతారామ ప్రాజెక్టు ( దుమ్మగూడెం ప్రాజెక్టు) ఖమ్మం జిల్లాకు వర ప్రదాయినిగా నిలుస్తుందని చెప్పారు. సహజ వనరులు సమృద్ధిగా కలిగిన ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. త్వరలో కొత్తగూడెం జిల్లాగా మారడం ద్వారా మరింత పురోగతి ఉంటుందని తెలిపారు.
ఇటీవల పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పువ్వాడ అజయ్ లాం నేతల రాకతో ఖమ్మం జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ బలోపేతమైందని అన్నారు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అండదండలు అందిస్తూ పరస్పర సహకారంతో ఖమ్మం జిల్లా నాయకత్వం ముందుకు సాగాలని అన్నారు. త్వరలో మధిర నియోజక వర్గ పర్యటనకు వస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిద్దామని అన్నారు.
మధిర జడ్‌పిటీసి ప్రియాంక, ఎంపిపి దాసరి సామ్రాజ్యం, పద్మావతి, ఎం వినయ్‌కుమార్, సామినేని అప్పారావు, లేల్ల వెంకట్‌రెడ్డితో పాటు పలువురు పార్టీలో చేరారు.. వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, జలగం వెంకట్రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.