ఆంధ్రప్రదేశ్‌

ఉద్రిక్తతల నడుమ జగన్ భరోసా యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 3 : అనంతపురం జిల్లాలో వైకాపా అధినేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడవ రోజైన శుక్రవారం ఉద్రిక్తతల నడుమ సాగింది. ఈ యాత్రలో భాగంగా జగన్ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర పదజాలంతో దూషించడం వివాదమైంది. దీంతో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎదురుదాడులకు దిగడంతో పరిస్థితి వేడెక్కింది. జిల్లా వ్యాప్తంగా టిడిపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టి జగన్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో రైతు భరోసా యాత్ర సాగింది. అందులో భాగంగా జగన్ రోడ్ షో నిర్వహించగా టిడిపి శ్రేణులు రాస్తారోకోకు దిగాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక జిల్లాలో శాంతిభద్రతలు, జగన్ రోడ్‌షో భద్రతపై డిజిపి జెవి.రాముడు, అనంతపురం రేంజ్ డిఐజి, ఎస్పీలను అడిగి తెలుసుకోవడంతో పాటు పోలీసు శాఖకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. కాగా అనంతపురంలో 5వ తేదీ నిర్వహించనున్న వైకాపా ధర్నాలో జగన్ పాల్గొనే విషయంపై సందిగ్ధత నెలకొంది.
సిఎం చంద్రబాబుపై జగన్ శుక్రవారం మరోమారు పరుష పదజాలంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ, ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, నవ నిర్మాణ దీక్షలతో మభ్యపెడుతున్న చంద్రబాబును చెప్పులతో కొడితే తప్పా.. ప్రజల పక్షాన అవినీతి, అక్రమాలను నిలదీస్తే ఎదురు దాడి చేస్తారా.. అంటూ ప్రశ్నించారు. జగన్ శుక్రవారం యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో తు భరోసా యాత్ర చేపట్టారు. యాడికిలో రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ సిఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. విచ్చలవిడిగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, ఆక్రమంలో ఇప్పటికే రూ. 6 వేల కోట్లు వెచ్చించారన్నారు.

తప్పుచేస్తే తమ్ముడైనా ఉపేక్షించం: కెఇ

కర్నూలు, జూన్ 3 : పార్టీలో ఉంటూ పార్టీ అధినేతను, పార్టీని విమర్శిస్తే తమ్ముడైనా సరే ఉపేక్షించే ప్రశే్నలేదని క్రమశిక్షణా చర్యలు తప్పవని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో శుక్రవారం డిప్యూటీ సిఎం కెఇ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. టిడిపి తరఫున రాజ్యసభ సభ్యత్వం బిసిలకు ఇవ్వలేదని ఆందోళన చేసిన తన సోదరుడు కెఇ ప్రభాకర్ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తోందని తప్పు అని తేలితే దండన తప్పదని తేల్చి చెప్పారు. పదవి కావాలంటే తాను పార్టీకి చేసిన సేవలను అధినేత చంద్రబాబుకు వివరించి అవకాశం కల్పించాలని కోరితే సరైన సమయంలో అవకాశం కల్పిస్తారన్నారు. అంతేకాని పార్టీని ధిక్కరిస్తూ వీధుల్లో మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. ఇక చంద్రబాబుపై వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను కెఇ ఖండించారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండు, మూడు నెలల్లో పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోబోతోందన్న వార్త తెలిసి ఆయనకు పిచ్చిపట్టినట్లుందని మండిపడ్డారు. నాడు దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డిపై కడపలో చెప్పులు వేయించిన తండ్రి బాటలోనే తనయుడు పయనిస్తున్నట్లుందని విమర్శించారు.

జగన్‌కు జైలే సురక్షితం: యనమల

అమలాపురం, జూన్ 3: విభజన కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రజలను చైతన్యం చేయడానికి నవనిర్మాణ దీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వైఎస్ జగన్ సంస్కార హీనుడని, అతనికి జైలే సురక్షిత ప్రదేశమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్‌పై పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ త్వరలోనే రుజువు కాగలవని, అప్పుడు జైలే శాశ్వత నివాసం అవుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఆమలాపురంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తున్న చంద్రబాబును చూసి ఓర్వలేకే జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. రలక్ష కోట్ల అవినీతి ఆరోపణలపై 18 నెలలు జైలు జీవితం అనుభవించినా, 43వేల కోట్లు ఈడి అటాచ్ చేసినా ఆయనకు బుద్ధిరాలేదన్నారు. జగన్ క్రిమినల్ అనడానికి ఇంతకన్నా ఆధారాలేం కావాలని యనమల ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ అభివృద్ధిని సహించలేని జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర పరిస్థితులపై వాస్తవాలను గుర్తించి మాట్లాడాలని, లేకపోతే ప్రజలే చెప్పులతో కొడతారని చినరాజప్ప హెచ్చరించారు.

నెలాఖరుకు బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ: కారెం

అయినవిల్లి, జూన్ 3: ప్రకాశం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జూన్ నెలాఖరుకు ఐదు వేల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ తెలిపారు. కమిషన్ ఛైర్మన్‌గా పదవి చేపట్టిన 30 రోజుల్లో విశాఖపట్నం, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీల పథకాల అమలుతీరుపై సమీక్షలు నిర్వహించామని, ఆయా జిల్లాలో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీకి ఆదేశాలు జారీచేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగాం గ్రామంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. విజయవాడ రైల్వే డివిజన్‌లో సి, డి కేటగిరిల్లో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు నాలుగు వేలు ఉన్నాయని, వీటిని భర్తీచేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశామన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న దళిత, గిరిజన ఉద్యోగులు వివక్షతకు గురవుతున్నట్టు ఎస్సీ, ఎస్టీ కమిషన్ గుర్తించిందని, వీటిని నిర్మూలించడానికి కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఛార్జిషీటు నిర్ణీత సమయంలో కోర్టుకు అందకపోవడంతో బాధితులు అన్నివిధాలుగా నష్టపోతున్నారని, దీనిలో పోలీసు శాఖ జాప్యం ఉన్నట్టు గుర్తించామన్నారు.

భక్తులకు అందుబాటులో ఆర్జిత సేవా టిక్కెట్లు

తిరుమల, జూన్ 3: సుదూర ప్రాంతాలనుంచి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 3నెలల ముందే ఆన్‌లైన్‌లో 300 రూపాయల టిక్కెట్‌ను రిజర్వ్ చేసుకునే సౌకర్యాన్ని మరో వారం రోజుల వ్యవధిలో కల్పించనున్నట్లు టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన డయల్ యువర్ ఇ ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 300 రూపాయల ప్రత్యేక దర్శనటిక్కెట్లు 60 రోజులు ముందు మాత్రమే బుక్‌చేసుకునే అవకాశం ఉందన్నారు. గదులు, ఆర్జితసేవా టిక్కెట్లను కూడా 90 రోజుల ముందుగా భక్తులు రిజర్వ్ చేసుకునే విధానాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. జూలై 1 నుంచి 31వ తేదీ వరకు స్వామివారికి జరిగే ఆర్జిత సేవలను భక్తులు కొనుగోలుచేసుకునేందుకు వీలుగా శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఉంచామన్నారు. 56,640వేల టిక్కెట్లను ఇంటర్‌నెట్‌లో భక్తులు కొనుగోలుచేసే విధంగా అందుబాటులో ఉంచామన్నారు. డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.టిటిడిఎస్‌ఇవిఎఓఎన్‌ఎల్‌ఐఎన్‌ఇ .కామ్ వెబ్‌సెట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. 6426 సుప్రభాతసేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచామన్నారు. 120 తోమాల, 120 అర్చన, సోమవారం జరిగే విశేషపూజ సేవాటిక్కెట్లను 1497, మంగళవారం జరిగే అష్టదళాపాదపద్మారాధన సేవాటిక్కెట్లు 60, శుక్రవారం అభిషేకానంతరం జరిగే నిజపాద దర్శనం టిక్కెట్లను 1859 అందుబాటులో ఉంచామన్నారు. 11,248 కల్యాణోత్సవం, 11,610వేల వసంతోత్సవం, 6450 వేల ఆర్జిత బ్రహ్మోత్సవాలు, 14,250 వేల సహస్తద్రీపాలంకార సేవ టిక్కెట్లు, 3వేల ఊంజల్‌సేవ (డోలోత్సవం) సేవా టిక్కెట్లను అందుబాటులో ఉంచామన్నారు.

ఆర్టీసీ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుతాం

శ్రీకాకుళం, జూన్ 3: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుకుంటామని ఎపిఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ ఆర్‌విఇఎస్‌డి ప్రసాదరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జిల్లా పర్యటన నేపథ్యంలో ఇక్కడి ఆర్టీసీ కాంప్లెక్సు ఆవరణలో యూనియన్ నేతలు నిర్వహిస్తున్న ధర్నాలో మాట్లాడుతూ విభజన నేపథ్యంలో ఎపియస్ ఆర్టీసీకి 42, 58 నిష్పత్తి ప్రకారం అప్పులు పంచి పెట్టారని, ఇదే నిష్పత్తిలో ఆస్తులను పంచాల్సి ఉందన్నారు. ఈ దిశగా యాజమాన్యంపై వత్తిడి తీసుకువస్తామని, ఆస్తుల పంపకం ద్వారా రాష్ట్ర ఆర్టీసీ నష్టాల నుండి గట్టెక్కే పరిస్థితి ఉందన్న నిజాన్ని గట్టిగా తాము వినిపిస్తామన్నారు. 13 ఉమ్మడి ఆస్తులు ఉన్నాయని, వాటి విలువ సుమారు 24 వేల కోట్ల రూపాయలుంటుందని స్పష్టం చేశారు. సంస్థను నష్టాలనుండి గట్టెక్కించేందుకు జాతీయ రహదారి వెంబడి ఉన్న టోల్ ఫీజునుండి మినహాయింపుకోసం కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేసామని, ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఇదే కాకుండా విమానయాన, నౌకాయాన రవాణాకు మాదిరే ప్రజా రవాణా సంస్థ అయిన ఎపియస్ ఆర్టీసీకి వసూలు చేస్తున్న డీజెల్‌పై 23.5 శాతం టాక్స్ మినహాయింపు కోరామన్నారు. ఇలా అయితే సుమారు 400 కోట్ల రూపాయల ఆదాయం సంస్థకు సమకూరుతుందని, తద్వారా సంస్థ బ్రాండ్ ఇమేజ్ నిలబడుతుందన్నారు.

అహోబిలం ఆలయ ఇఓ ఇంటికి నిప్పు

ఆళ్లగడ్డ, జూన్ 3 : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం దేవస్థానం పరిపాలనాధికారి(ఇఓ) రంగరాజు ఇంటికి గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో కిటికీలు, ప్రధానద్వారం పాక్షికంగా కాలిపోయాయి. వివరాలు.. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కొందరు అహోబిలం ఆలయ ఇఓ కార్యాలయానికి వెళ్లి రంగరాజు కోసం వెతికారు. అక్కడ ఆయన కనిపించకపోవడంతో కార్యాలయం కిటికీ అద్దం పగులగొట్టడంతో పాటు కంప్యూటర్, ప్రింటర్, ఫైల్స్ కింద పడవేశారు. అంతటితో ఆగక అక్కడే ఉన్న ఏఇఓ శివరామయ్యపై దాడి చేశారు. అనంతరం ఏఓ ఇంటికెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయారు.

మున్సిపల్ స్కూళ్లలో
అంగన్‌వాడీ కేంద్రాలు

నెల్లూరుసిటీ, జూన్ 3: నెల్లూరు జిల్లాను ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మోడల్ అంగన్‌వాడీ కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర మునిసిపల్‌శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలలో మొత్తం 2లక్షల మంది పిల్లలు చదువుతున్నట్టు వివరించారు. నగరంలో 251 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. అంగన్‌వాడీల్లో అవినీతి తావులేకుండా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే విధంగా నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి అంగన్‌వాడీ కేంద్రాలలో నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి విద్యను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.