తెలంగాణ

గ్రామాల్లో భూసేకరణ చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 30: సాగు నీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం, ఉపాధి కోసం పరిశ్రమ కల్పనకు ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ కార్యక్రమాలు రసభసగా మారుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో యుద్ధ వాతావరణం నెలకొంటోంది. కలిసిమెలిసి జీవించిన ప్రజాప్రతినిధులు, ప్రజల మధ్య వైరుధ్యం తారాస్థాయికి చేరుకుంటుంది. తూర్పున తొగుట, పడమర న్యాల్‌కల్ మండలాల్లో ప్రభుత్వం వేలాది ఎకరాల భూ సేకరణ చేపట్టాలని యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. సంయుక్త కలెక్టర్ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో రెవెన్యూ అధికారులు భూ సేకరణ సర్వేలు ప్రారంభించారు. నిమ్జ్‌కు సంబంధించి కొంత వరకు భూ సేకరణ చేపట్టి పరిహారం అందించినా రైతులు మాత్రం నిరాశతో ఉన్నారు. 50 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 40 వేల ఎకరాల భూ సేకరణపై ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం సరిపోదంటూ అన్నదాతలు అధికారులపై తిరగబడుతున్నారు. ఈ నెల 9వ తేదీన తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి వెళ్లిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో పోలీసులు లాఠీ చార్జీ చేసిన విషయం తెలిసిందే. భూములకు సంబంధించిన వివరాలు అందించడానికి వెళ్లారన్న కోపంతో ఇదే గ్రామానికి చెందిన రైతులు ఎంపిటిసి సభ్యుడి ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్, కారును ధ్వంసం చేసి మరో రెండిళ్లపై దాడి చేసి విధ్వంసానికి దిగారు. నిమ్జ్ భూ సేకరణలో న్యాల్‌కల్ మండలంలోని 14 గ్రామాలు, ఝరాసంగం మండలంలో 3 గ్రామాల భూములను సేకరించనున్నారు. దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలోని తొగుట, కొండపాక మండలాలకు చెందిన పలు గ్రామాలు మల్లన్న సాగర్ రిజర్వాయర్‌లో కనుమరుగు కానున్నాయి. రిజర్వాయర్ నిర్మాణం ద్వారా మెదక్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 2 వేల ఎకరాల భూమిని సర్వే చేసిన అధికారులు కొంత మంది రైతులకు పరిహారం కూడా చెల్లించినట్లు సమాచారం. ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం ఎకరాకు 5.85 లక్షలు కావడం, అదే పెట్టుబడికి అవసరమైన భూమి దొరకని సంకట స్థితి నెలకొందని రైతులు ససేమిరా అంటున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా నాలుగు విడతల్లో పరిహారం ఇవ్వాల్సి ఉన్నా ఏకీకృత విధానం ద్వారా ప్రభుత్వం తీసుకువచ్చిన జివోను రైతులు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా సోమవారం ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులు గ్రామ నాయకులపైకి ఎదురుదాడికి దిగడంతో మరో ఉద్రిక్తతతకు దారితీసింది. తరతరాలుగా అనుభవిస్తూ వస్తున్న ఆస్తిని కోల్పోతుండగా ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆయా గ్రామాలకు చెందిన భూ యజమానులు గుండెపోటుతో మృతి చెందిన సంఘటనలు లేకపోలేదు. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తుండటంతో బాధితులకు కొంత ధైర్యం కలిసివచ్చింది. నాటి తెలంగాణ సాయుధ భూ పోరాటాన్ని తలపించే స్థాయిలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు ప్రభుత్వంపై తిరగబడుతుండటంతో పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు న్యాయంగా పరిహారం చెల్లించి వారి డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమానికి అడ్డుకట్ట పడే అవకాశం ఆవగింజంత కూడా కనిపించడం లేదు.